Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బెంగళూరు నాగరత్నమ్మ… విశ్వనాథ్ శంకరాభరణం కథామర్మం ఇదే…

October 21, 2023 by M S R

‘శంకరాభరణం’ కథామర్మం – మహమ్మద్‌ ఖదీర్‌బాబు………. ‘పాశ్చాత్య సంగీతపు పెనుతుఫానుకు రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో’… ఎవరు? బెంగళూరు నాగరత్నమ్మ.

***

శంకరాభరణం కథ ఎలా పుట్టి ఉంటుంది? ఈ కథ రాయడానికి కె.విశ్వనాథ్‌ గారు ఎక్కడి నుంచి ఇన్‌స్పయిర్‌ అయి ఉంటారు, కథను మెల్లమెల్లగా ఎలా కల్పించుకుని ఉంటారు, ఎలా తుదిరూపు ఇచ్చి ఉంటారు అనేది ఒక కథకుడిగా నాకు ఎప్పుడూ ఆసక్తి. కాని విశ్వనాథ్‌ గారు ఎప్పుడూ, తన చివరి రోజుల వరకూ కూడా, ఎన్ని ఇంటర్వ్యూలలో కూడా శంకరశాస్త్రి పాత్రకు, తులసి పాత్రకు ఇన్‌స్పిరేషన్‌ ఎవరు అనేది చెప్పలేదు. వనిత టీవీ ఇంటర్వ్యూలో మాత్రం ‘అదొక క్షేత్ర పురాణం’ అనగలిగారు.

Ads

అవును క్షేత్ర పురాణమే. త్యాగరాజ క్షేత్ర పురాణం. తిరువయ్యారు క్షేత్ర పురాణం.

శంకరాభరణం కథకు ఈ క్షేత్రమే ఇన్‌స్పిరేషన్‌. ఎందుకంటే నాటి త్యాగయ్యే నేటి శంకర శాస్త్రి! నాటి బెంగళూరు నాగరత్నమ్మే నేటి తులసి!

***

గత కొన్ని రోజులుగా త్యాగయ్యను చదువుతున్నాను. డాక్యుమెంటరీలు చూస్తున్నాను. తమిళ దూరదర్శన్‌ వారు తీసిన డాక్యుమెంటరీలో త్యాగయ్య తెలుగువాడు అని చెప్పడానికి నోరు రాలేదు. కాని ఎవరో తమిళ విద్వాంసుడు పాడిన ‘సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి’ వినిపిస్తే కళ్లు చిప్పిల్లాయి. సీతమ్మను తల్లిగా, శ్రీరాముణ్ణి తండ్రిగా స్వీకరించిన ఈ సదా శిశువునకు ఇక జీవన వ్యవహారాల చింత ఏల?

***

‘నిరాదరణ పొందుతున్న శాస్త్రీయ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది’ అంటాడు శంకర శాస్త్రి క్లయిమాక్స్‌లో.

శంకరాభరణం అంతిమ మెసేజ్‌ ఇదే. కళాకారులు… పోషకులు. ఈ ఇరువర్గాలు లేకపోతే కళ లేదు. శంకరాభరణం ఈ ఇరువర్గాల ప్రతినిధుల కథ. కళాకారుడు శంకరశాస్త్రి. పోషకురాలు తులసి. త్యాగరాజస్వామి కథ కూడా ఇది కాదా? బెంగళూరు నాగరత్నమ్మ లేకుండా త్యాగరాజస్వామి కథ ఎంత అసంపూర్ణం?

1920ల నాటికి బెంగళూరు నాగరత్నమ్మకు రెండు లక్షల రూపాయల ఆస్తి ఉండేదని ‘గృహలక్ష్మి’ పత్రిక రాసింది. గొప్ప విద్వాంసురాలిగా, నాట్యకత్తెగా, దేవదాసీగా (అందుకు ఆమె గర్విస్తుంది) ఆమెకు ఒక అస్తిత్వం, జీవనం ఉన్నా దానంతటినీ త్యజించి త్యాగరాజస్వామి కొరకు జీవితాన్ని అంకితం చేసిందామె. జీర్ణస్థితిలో ఉన్న త్యాగయ్య సమాధిని పునరుద్ధరించి, గుడి కట్టి, సత్రాలు నిర్మించి, ఆరాధనోత్సవాల్లో ముందంజ వేసి, ఆస్తి దారబోసి ఆ మహనీయుడికి వర్తమానంలో పునర్‌ఘనతను తెచ్చి– అచ్చు శంకరశాస్త్రి పాదాల మీద పడి తులసి ప్రాణం విడిచినట్టే తాగయ్య సమాధి చెంతే ప్రాణం విడిచింది. అక్కడే సమాధి అయ్యింది. నేటికీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో పంచకృతులు పాడి త్యాగయ్యను ఆరాధిస్తే, నాదస్వర గానంతో బెంగళూరు నాగరత్నమ్మకు ఘనంగా నివాళి అర్పిస్తారు.

***

రెండు వేరువేరు కాలాల్లో జీవించి మరణించిన ఈ ఇరువురిని వర్తమానంలో తెచ్చి, వారిరువురి చుట్టు ఒక ఉదాత్తమైన కథను అల్లగలగడం కె.విశ్వనాథ్‌ మేధోసృజనకు ఉదాహరణ. మరి ఈ విషయం ఎందుకు బయటకు వెల్లడి చేయలేదు? చేస్తే అనేక ప్రశ్నలు రావచ్చు. లేనిపోని చర్చలు జరుగవచ్చు. ఉదాహరణకు త్యాగయ్యది రామభక్తి. శంకరశాస్త్రిది శైవారాధన. ఇక్కడితో మొదలు. పాత్రల సారం వరకే దర్శకుడు తీసుకున్నాడని అర్థం చేసుకుని వదిలే రకం కాదు కదా మనం. ఒకవేళ మనం వదిలినా ఎన్‌.ఆర్‌.ఐలు వదలరు.

అయినప్పటికీ కె.విశ్వనాథ్‌ గారి సబ్‌/కాన్షియస్‌ మైండ్‌ ఈ కథ అల్లికలో ఇది త్యాగయ్య, నాగరత్నమ్మల స్ఫూర్తి అని హింట్స్‌ వదలుతూనే ఉంటుంది. చూడండి –

– శంకరాభరణం ఫస్ట్‌సీన్‌లో శంకరశాస్త్రి నది ఒడ్డున జీర్ణవస్త్రాన్ని ఉతికి ఆరబెడతాడు. తులసి చూస్తుంది. తిరవయ్యారులో అడుగుపెట్టిన నాగరత్నమ్మ త్యాగయ్య వైభవం జీర్ణస్థితికి చేరిందని అర్థమయ్యి తల్లడిల్లింది. త్యాగయ్యకు గుడి కట్టి నాగరత్నమ్మ ధన్యురాలై మరణించింది. ‘శంకరాభరణం శంకరశాస్త్రి కళామందిరం’ కట్టి అంతే ధన్యురాలై తులసి మరణించింది.

కథాభావం: నాడు సామాజిక అభ్యంతరాలున్న దేవదాసీ సమూహంలో జన్మించి, త్యాగయ్యను ఆరాధించి, పునీతురాలైంది బెంగళూరు నాగరత్నమ్మ– ఎట్లనగా– పాము శివుడి మెడకు చేరి శంకరాభరణం అయినట్టు. అదే నేపథ్యంలో పుట్టి, శంకరశాస్త్రిని ఆరాధించి, సంగీతానికి సేవలు చేసి సద్గతిని పొందింది తులసి– కొడుకును శంకరశాస్త్రి వారసత్వానికి ఆభరణం చేసి– శంకరాభరణం చేసి.

May be an image of 4 people and text

మరికొన్ని పోలికలు–

– త్యాగయ్య జీవితంలో కావేరి నది, శంకరశాస్త్రి జీవితంలో గోదావరి నది.

– త్యాగయ్యకు మొదటిభార్య చనిపోయింది. రెండవ భార్య వల్ల సీతమ్మ అనే కూతురు పుట్టింది. శంకరశాస్త్రి భార్య మరణించింది. కూతురు శారద.

– త్యాగయ్య సన్మానాలను, సత్కారాలను లెక్క చేయడు. శంకరశాస్త్రి కూడా. ఎంతో ఔచిత్యం ఉందని బతిమిలాడితే తప్ప.

– త్యాగయ్య సీతారాములను ఇంట పెట్టుకుని పూజిస్తుంటాడు. శంకర శాస్త్రి నటరాజ స్వామి విగ్రహం పెట్టుకుని పూజిస్తుంటాడు. శారద తప్పు పాడితే ఆ విగ్రహం ఎదుట అరచేత కర్పూరం వెలిగించి ప్రాయశ్చితం చేసుకుంటాడు.

– ‘శంకరాభరణం’ సినిమా మొదలులో దర్శకుడు నాంది వాక్యాలు పలికి త్యాగరాజ కృతి మకుటం ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు’ అంటూ ముగిస్తాడు. క్లయిమాక్స్‌ను త్యాగరాజ కృతి మకుటం ‘దొరకునా ఇటువంటి సేవ’తో ముగిస్తాడు.

– సినిమాలో శంకరశాస్త్రికి సన్మాన ఆహ్వానం కన్నడదేశం నుంచి వస్తుంది. తమిళనాడు కుంభకోణం నుంచో కేరళ పాలక్కాడ్‌ నుంచో కాదు. బెంగళూరు నాగరత్నమ్మ పుట్టి పెరిగిన కన్నడసీమకు దర్శకుడి కృతజ్ఞత అది.

– తులసి పాత్రకు మంజు భార్గవిని ఎంపిక చేయడంపై ఆ రోజుల్లో అందరూ ఆశ్చర్యపోయారట. కె.విశ్వనాథ్‌ గారు అమాయకులు కాదు. నాగరత్నమ్మ వలే భారీ విగ్రహం ఉన్న నటీమణిని తీసుకున్నారు. తులసి వినమ్రురాలైనా ఏదైనా చేయగల ధీశాలి. ఆ పాత్రకు బేలరూపం పనికి రాదు.

– బెంగళూరు నాగరత్నమ్మ జీవితంలో అడ్వకేట్లు, జడ్జీలు కీలకపాత్ర పోషించారు. అల్లు రామలింగయ్య పాత్ర టీచరో, పోస్ట్‌మాస్టరో కాక ప్లీడరు కావడం ఇందుకే.

ఈ వ్యాసం రాయడానికి ‘శంకరాభరణం’ మళ్లీ చూశాను. ‘ఆర్దత’ అనే మాట ఉంటుంది సినిమాలో. సినిమా అంతటా ఆర్ద్రతే.

‘సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి’… నుంచి ‘శృతిలయలే జననీ జనకులు కాగా’… వరకూ సాగిన ఆర్ద్రమైన సృజన పరివర్తనే ‘శంకరాభరణం’. – అక్టోబర్, 2023

పి.ఎస్‌1: ఇది చదివాక బెంగళూరు నాగరత్నమ్మ వల్ల ఆ రోజు తెలుగు వాగ్గేయకారునికి మాత్రమే కాక తర్వాతి కాలంలో తెలుగు సినిమాకు కూడా గొప్ప మేలు జరిగిందన్న ఉటంకింపు జరిగితే అదే పదివేలు.

పి.ఎస్‌ 2: నాగయ్య గారి ‘త్యాగయ్య’ చూశాను. నాగయ్య గారు గ్రేటెస్ట్‌ డైరెక్టర్‌ అనిపించింది. బాపు గారి ‘త్యాగయ్య’ చూశాను. ఆ క్లాసిక్‌ మళ్లి తీసుండకపోతే బాగుణ్ణనిపించింది.

పి.ఎస్‌ 3: అంత పెద్ద మ్యూజికల్‌ హిట్‌ ఇచ్చాక కె.వి.మహదేవన్‌ మళ్లీ ‘పూర్ణోదయ’ సంస్థకు పని చేయలేదు. శంకరాభరణం విజయయాత్రకు ప్రొడక్షన్‌ వాళ్లు మామకు టికెట్‌ వేసి పుహళేందికి వేయకపోవడమే కారణం. అలా చిన్నచిన్న తప్పుల వల్ల పెద్దపెద్ద స్నేహాలు పోతుంటాయ్‌…. (ఇది మిత్రుడు Mohammed Khadeerbabu వాల్ నుంచి తీసుకున్న స్టోరీ)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!
  • జంధ్యాల నెలవంక… చూసింది నేల వంక… ఐననూ ఆదర్శ ప్రయోగమే…
  • బోలెడు క్షుద్ర రాజకీయ వివాదాలు… ఈ మూడే రియల్ గేమ్ చేంజర్స్…
  • గంజాయ్..! ఇదొక వరమూలిక..!! ఇన్నేళ్లూ మనమే కాలదన్నుకున్నాం..!!
  • మహిళకు ఒకరికన్నా ఎక్కువ మొగుళ్లు..! చట్టబద్ధం చేస్తే ఎలా ఉంటుంది..?!
  • పాకిస్థాన్ కకావికలం… ఇప్పటికే చావుదెబ్బ… సిందూరం భగభగ…
  • ఈ యుద్ధంతో అశాంతి కాదు… శాంతి కోసమే ఈ యుద్ధం… ఇలా…
  • అంబానీ కదా… చివరకు యుద్ధ చిహ్నాన్ని కూడా హైజాక్ ప్రయత్నం…
  • యుద్ధమంటే… విజయమో, పరాజయమో మాత్రమే కాదు..!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions