రోష్ని నాడార్, కిరణ్ మజుందార్ షా, లీనా గాంధీ తివారి, నీలిమ మోటపర్తి, రాధ వెంబు, జయశ్రీ ఉల్లాల్, రేణు ముంజల్, మాలిక చిరయు, అనూ ఆగ, ఫల్గుణి నాయర్…. వీళ్లంతా ఎవరో తెలుసా..? మన దేశంలోని అత్యంత ధనికులైన మహిళల్లో టాప్ టెన్… ఈమధ్యే ఎవరో జాబితా రిలీజ్ చేశారు… వాళ్లు నిజంగా ప్రతిభావంతులేనా, ఐటీ లెక్కల కోసం పేర్లు రాయబడిన ఫ్యామిలీ డమ్మీలా అనేది పక్కన పెట్టండి… వేల కోట్ల ఆస్తులు వాళ్లవి… కానీ ఒక్క HCL లేడీ బాస్ రోష్ని నాడార్ తప్ప ఇంకెవరూ పిల్లికి బిచ్చం వేయరు… ఎడమ చేత్తో కాకిని తోలరు… రికార్డుల్లో మాత్రమే పెద్ద పేరున్న కేరెక్టర్స్…
వాళ్ల ఔదార్యం, వాళ్ల సోషల్ రెస్పాన్సిబులిటీల గురించి మనం ఏమీ చదివినట్టు గుర్తులేదు… వాళ్ళ ప్రతిభా పాటవాలు మనకు తెలియవు… వాళ్ల గురించి వదిలేద్దాం… కానీ ఖచ్చితంగా ఒకామె గురించి చెప్పుకోవాలి… అన్నీ బాగుంటే వేల కోట్లు వెనకేసి కాలర్ ఎగరేయడం కాదు… అనూహ్యమైన సవాళ్లు ఒక్కసారిగా చుట్టుముడితే… ఈ కార్పొరేట్ దుష్ట వాతావరణంలో ఎలా పోరాడాలో ఆమె స్థిరంగా నిలబడి చూపిస్తోంది… బిజినెస్ సర్కిళ్లు ఆమె వైపే చూస్తున్నాయి… ఏం చేస్తుందో చూద్దాం అని ఆసక్తిగా కన్నేశాయి… ఆమె పేరు మాళవిక…
Ads
మాళవిక హెగ్డే… ఈమె ఎవరో తెలుసా..? గత ఏడాది ఆత్మహత్య చేసుకున్న కాఫీడే బాస్ సిద్ధార్థ భార్య… అంతకుముందు ఆమెకు ఆ కంపెనీ వ్యవహారాలు ఏమీ తెలియవు… తన ఇద్దరు కొడుకులు, తన కుటుంబం… అంతే… తను చదివింది ఇంజనీరింగ్… అంతకుముందు ఎప్పుడూ పెద్దగా ప్రచారంలోకి రాని పేరు… మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ బీజేపీ లీడర్ ఎస్ఎం కృష్ణ కూతురు ఆమె… కాంగ్రెస్ లీడర్ డీకే శివకుమార్ కుటుంబానికి సన్నిహితులు (ఏదో వియ్యం ఉన్నట్టుంది..)… ఆయనొక్కడే ఆమెకు మద్దతుగా నిలబడ్డాడు… కాంగ్రెస్లో ఉన్నా సరే, డీకే పద్ధతి, నైతికత కాస్త వేరేగా ఉంటుంది…
వందల బ్రాంచులు, వేల మంది ఉద్యోగులు, వేల కోట్ల టర్నోవర్… కానీ ఏడెనిమిది వేల కోట్ల అప్పులు… ఒత్తిడి భరించలేక… కొందరి సందేహం ప్రకారం కేంద్ర కస్టమ్స్, ఐటీ అధికారుల వేధింపుల్ని తట్టుకోలేక… ఓరోజు ఓ కాలువలో శవమై తేలాడు… తను పోతే పోయాడు… యాభయ్యేళ్ల మాళవిక చుట్టూ అయోమయపు చీకట్లు కమ్ముకున్నాయి…
ఆమె చుట్టూ సమస్యలు… వేల కోట్ల అప్పులు… భర్త లేడు… సాయంగా ఎవరూ లేరు… ఎవరినీ నమ్మడానికి లేదు… తిన్నంతసేపూ తిని, తరువాత తోక జాడించి వేధించే మాదచ్చొద్ ఉన్నతాధికారులు… కానీ తను నిలబడింది… ముందుగా తన ఉద్యోగులకు ఓ లేఖ ద్వారా చెప్పుకుంది… ‘‘నన్ను నమ్మండి, ఒక్కరూ బజారున పడకుండా చూసే పూచీ నాది… ఈ కంపెనీ నిలబడుతుంది… నిలబెడదాం… we are one family’’ అన్నది… బోర్డులో డైరెక్టర్గా చేరింది…
ఒక్క పైసా అప్పు కూడా ఎగ్గొట్టబోననీ, తన భర్త గౌరవాన్ని నిలబెడతాననీ చెప్పుకుంది… కంపెనీ అనుబంధ సంస్థల్లోని తమ షేర్లను అమ్మేసింది… కొన్ని ప్రాపర్టీలను వదిలించేసుకుంది… రుణదాతల్ని ఒక్కొక్కరినీ పిలిచి వాయిదా కోరడం, లేదంటే ఏదో ఒక ఆస్తి ఇచ్చేయడం, కంపెనీ షేర్లను బదలాయించడం… ఎలా వీలయితే అలా… భర్త మరణించినప్పుడు ఉన్న 7200 కోట్ల అప్పులను ఇప్పుడు 3000 కోట్లకు దింపింది… 25 వేల మంది ఉద్యోగులు… ఒక్కరి జీతమూ ఆపలేదు… కత్తిరించలేదు… వ్యాపారం ఎక్కడా ప్రభావితం కాలేదు… చివరికి లాక్ డౌన్ పీరియడ్లో కూడా కంపెనీ యధావిధిగా నడిచింది…
ఏమాత్రం అనుభవం లేని డ్రైవర్… కంపెనీని ఎలా నడుపుతుందో చూద్దాం అనుకునేవాళ్లే అందరూ… కొందరు కాఫీ రైతులు ఆమె మీద కేసులు పెట్టారు… చెక్ బౌన్స్ కేసులో ఓ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది… అనేక సవాళ్లు… కంపెనీ డైరెక్టర్లకు నచ్చజెప్పుకుంటూ బండి ట్రాక్ తప్పకుండా జాగ్రత్తపడింది…
ఇప్పుడు ఆమె గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… కంపెనీ సీఈవోగా ఇప్పుడు తను బాధ్యతలు స్వీకరించింది… అయిదేళ్లపాటు ఆమె కంపెనీకి అధికారికంగా బాస్… స్టాక్ ఎక్స్చేంజ్కు సమాచారం ఇచ్చారు… నో డౌట్… ఆమె నిలుస్తుంది… గెలుస్తుంది… అరె, గెలుపా ఓటమా జానేదేవ్… ఆమె కంపెనీని కాపాడుకోవడానికి, మరణించిన భర్త గౌరవాన్ని నిలపడానికి, సంస్థ ఉద్యోగుల ఉపాధి రక్షణకు… ఓ గొప్ప సవాల్ స్వీకరించింది… అదీ స్ఫూర్తి… నువ్వు గెలవాలి మేడం… కుట్రలు, కుతంత్రాల నీచ కార్పొరేట్ ప్రపంచంలో నిలదొక్కుకోవాలి… పైసా అప్పులేని ఓ కంపెనీగా నిలబడాలి… మరికొన్ని వేలమంది కడుపు నింపాలి…! మీ కమ్మని కాఫీ రుచితో…!!
Share this Article