నిజానికి ఈ పోస్టు పైపైన చదివితే… ఏముందీ ఇందులో అనిపిస్తుంది… కాసేపటికి బుర్రలో అది తిరగడం మొదలవుతుంది… స్వచ్ఛమైన, అరుదైన సంపద అంటే ఏమిటో అర్థమవుతూ ఉంటుంది… అదెక్కడ, ఎలా ఉంటుందో కనిపిస్తూ ఉంటుంది… బహుశా ఈ పోస్టు కొన్ని వేల పోస్టులుగా మారి, వైరలై, లక్షల లైకులతో ఇప్పటికే చదవబడి ఉంది…
మళ్లీ మిత్రుడు Padmakar Daggumati వాల్ మీద కనిపించింది… “పాదాలకి మొక్కాలని అనిపించే మంచి” పేరిట… అవును, మళ్లీ ఓసారి కొత్త పాఠకులకు చెప్పాలనిపించింది… వేల మంది ఊరూపేరు లేకుండా ఈ పోస్టును షేర్ చేస్తూనే ఉన్నారు, మార్పులూ జరుగుతున్నాయి… సోషల్ మీడియాలో ఇవన్నీ సహజమే… ఇది ఒరిజినల్‌గా రాసింది బైక్ టూరిస్టు Deelip Menezes… ఇదుగో ఎనిమిదేళ్ల నాటి ఆ ఒరిజినల్ పోస్టు…
తన పోస్టు వైరల్ అయ్యాక పోస్టు అప్‌డేట్ చేశాడు.., ‘‘చాలామంది నన్ను ఆ లొకేషన్ చెప్పండని అడుగుతున్నారూ, మీరు గనుక అక్కడికి వెళ్తే… గోవా నుండి తెల్లటి మోటార్ సైకిల్ మీద ఓ పెద్ద గడ్డపాయన మీకు నమస్కారం పెట్టమని చెప్పాడని నన్ను గుర్తుచేయండి ప్లీజ్’’ అంటూ అప్‌డేట్ చేసి, గూగుల్ లొకేషన్ పెట్టాడు… (అదిప్పుడు ఉందో లేదో నాకు తెలియదు…)
Ads
తన ఒరిజినల్ పోస్టే 97 వేల షేర్లు, 16 వేల కామెంట్లు… ప్రశంసలు… సోషల్ మీడియాలో ఈ రేంజ్ పాజిటివిటీ స్ప్రెడ్ చేసే పోస్టులు కూడా అత్యంత అరుదు… సరే, ఇంతకీ ఆ పోస్టు ఏమిటంటే…? (మరీ అనువాదం గాకుండా మన భాషలో చెప్పుకుందాం…)
రాత్రి బాగా లేటయింది… తెల్లవారుతోంది… నర్సీపట్నం నుంచి లంబసింగి వైపు మోటారు బైక్ మీద వెళ్తున్నాను నేను… చాలాదూరం చెట్లు, గుట్టలు, వంకలు తప్ప ఇంకేమీ కనిపించవు… ఓచోట ఒక గుడిసె, దాని ముందు ఒక టేబుల్ వేసి ఉంది… ఓ వృద్ధుడు టీ కాస్తున్నాడు…
కడుపులో ఎలుకలు పరుగెడుతున్నాయి… తినడానికి ఏదో దొరికినట్టే అనుకున్నాను… బైక్ ఆపేసి, చాయ్‌తోపాటు టిఫిన్ దొరుకుతుందా అనడిగాను… నా భాష వాళ్లకు అర్థం కాలేదు… చేతిలో టీకప్పు చూపిస్తూనే తన సమీపంలోనే ఉన్న తన భార్యకు వాళ్ల స్థానిక భాషలో ఏదో చెప్పాడు… నేను ‘ఆకలవుతోంది, తినడానికి ఏమైనా ఉందా’ అన్నట్టుగా సైగలు చేశాను…
ఆయన మళ్లీ ఏదో చెప్పాడు ఆమెకు… ఆమె నాకు గుడిసె బయట ఉన్న బెంచీ చూపించింది, కూర్చోమన్నట్టుగా సైగ చేసింది… గుడిసెలోకి వెళ్లి కాసేపయ్యాక ఒక ప్లేటులో అయిదు ఇడ్లీలు, చెట్నీ వేసుకుని తీసుకొచ్చి ఇచ్చింది… హమ్మయ్య, ఆత్మారాముడు శాంతించాడు… నా బైక్ స్పీడ్‌తో సమానంగా ప్లేటు ఖాళీ చేశాను… టీ కూడా తాగాను… మహా ఆకలి మీదున్నాను కదా, కమ్మగా కడుపులోకి జారిపోయాయి…
‘ఎంత..?’ అన్నట్టుగా సైగ చేశాను… అంటే నా బిల్లు ఎంత అని… ఆయన 5 రూపాయలు అన్నాడు… అది మరీ వెనుకబడిన ప్రాంతమని తెలుసు నాకు, అదే సమయంలో ఆ ప్రాంతంలో ఆ సమయంలో తినడానికి ఏదీ దొరకదనీ తెలుసు… కానీ ఇడ్లీలు, టీ కలిపి మరీ 5 రూపాయల అతి తక్కువ బిల్లేమిటో నాకు అర్థం కాలేదు…
ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాను, నా ఫీలింగేమిటో తనకు అర్థమైంది… టీ కప్పు వైపు చూపిస్తూ 5 రూపాయలు అన్నాడు… అంటే అది చాయ్ ధర… ఆ డబ్బు మాత్రమే ఇవ్వమని చెబుతున్నాడు ఆయన… మరి దీని మాటేమిటి అని ఖాళీ ప్లేటు వైపు చూపించాను… ఈసారి ఆయన భార్య వైపు చూశాను… ఇద్దరూ నన్ను చూసి నవ్వారు…
నిజానికి వాళ్లది కేవలం టీ స్టాల్… అక్కడ టీ మాత్రమే దొరుకుతుంది… కానీ నా ఆకలి సైగలు చూసి అర్థం చేసుకుని, అప్పటికే వాళ్లకోసం వండుకున్న ఇడ్లీలను తీసుకొచ్చి నాకు పెట్టింది, అంటే ఆ రోజు వాళ్ల బ్రేక్ ఫాస్ట్ నాకు ఇచ్చేశారు నాకర్థమైంది… కాసేపు మౌనంగా ఉండిపోయి, పర్సులో నుంచి కొంత డబ్బు తీసి ఇచ్చాను… కానీ ఆయన నిరాకరించాడు… ఆ చేయి గట్టిగా పట్టుకుని ఆ డబ్బు అలాగే బలవంతంగా పెట్టాను…
బయల్దేరాను, బుర్రలో తిరుగుతోంది ఒకే విషయం… ఇదీ ఓ జీవితపాఠమే… ఇవ్వడంలో ఉన్న స్వచ్ఛత గురించి… అవసరమైనప్పుడు తమ కడుపు కాల్చుకుని మరీ మన కడుపులు నింపేవాళ్లు ఇంకా ఉన్నారని… ఇలాంటి అనుభవాలు అయితేనే మనమూ ఇవ్వడం నేర్చుకుంటామని… ఆ గుడిసె చిన్నది కావచ్చు, కానీ వాళ్లు ప్రదర్శించింది చాలా విశాలమైన మానవ భావన అని..!
Share this Article