Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఇన్‌స్టా ప్రేమలు..! ఈ ఇన్‌స్టంట్ ప్రేమలు సొసైటీకి మరో కొత్త జాఢ్యం..!!

January 28, 2025 by M S R

.

విశీ (వి.సాయివంశీ) ….. INSTAGRAM LOVE.. రెండు ఆత్మహత్యలు… (The Dark Side of Social Media Apps)

… కర్ణాటక రాష్ట్రం దావణగెరె అనే ఊరిలో ఉంటోంది శ్వేత. పెళ్లయింది. ఇంకా పిల్లలు లేరు. భర్త మంచివాడే! బాగానే చూసుకుంటున్నాడు. అతను పనికి వెళ్లాక, ఇంటి పని అయిపోయాక, ఏమీ తోచని టైంలో తనకు అలవాటైన ఇన్‌స్టా‌గ్రామ్ రీల్స్ చూస్తూ ఉండేది శ్వేత. రకరకాల మనుషులు. రకరకాల అందాలు. రకరకాల ఊహలు. రకరకాల ఉత్తేజాలు.

Ads

దావణగెరెకు దగ్గర్లోనే శివల్లి అనే ఊరుంది. ఆ ఊరిలో ఉంటున్నాడు విజయ్. రీల్స్ చేస్తూ ఇన్‌స్టాలో పెడుతుంటాడు. అప్పుడప్పుడూ అతని రీల్స్ చూస్తూ ఉండేది శ్వేత. మెల్లగా ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. అది ఎన్ని రోజులు గడిచిందో తెలియదు కానీ, ఇద్దరి మధ్యా ఉన్న పరిచయం స్నేహంగా మారి, ఆ స్నేహం ప్రేమకు దారితీసింది. విజయ్‌‌కి ఇంకా పెళ్లి కాలేదు. కానీ శ్వేత అప్పటికే పెళ్లయిన మనిషి. మరొకరి ఇల్లాలు. ఎలా?

‘ఏం ఫర్లేదు! అంతా నేను చూసుకుంటాను’ అని విజయ్ తనకు నచ్చజెప్పాడు. భర్తను వదిలేసి వచ్చేయమన్నాడు. ఒక్క క్షణం ఆలోచించింది శ్వేత. అటు భర్త, ఇటు ప్రేమికుడు‌. చాలాసార్లు భర్త కన్నా ప్రేమికుడే అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ఇక్కడా అదే జరిగింది.

జీవితాంతం తనతో ఉంటానని విజయ్ మాటిచ్చాడు కాబట్టి భయం లేదనుకుంది. వీళ్ల వ్యవహారం గురించి అప్పటికే శ్వేత భర్తకు అనుమానం వచ్చింది. ఒక రోజు శ్వేత విషయం బయటపెట్టింది. నీతో కలిసి ఉండలేనని భర్త ముందు తెగేసి చెప్పింది. గొడవలు.. సర్దుబాట్లు.. వాదాలు.. చివరకు శ్వేత, ఆమె భర్త పెద్దల సాక్షిగా విడిపోయారు.

ఆనందంగా విజయ్ దగ్గరికి వెళ్లింది శ్వేత. అతనూ ఆమెను ఆహ్వానించాడు. కానీ పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి? ముందున్న సందేహాలివి. విజయ్ ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళాలని చూశాడు. ఇంట్లో వాళ్లు ససేమిరా అన్నారు.

‘నీకోసం భర్తను వొదిలేసిన మనిషి, రేపు మరొకరి కోసం నిన్ను వదిలేయదా? ఇలాంటివి మంచివి కావు. తను నీ భార్య కావడానికి ఏమాత్రం ఒప్పుకోం’ అని తేల్చేశారు. ఆ మాటలతో శ్వేత గుండె ముక్కలైంది. విజయ్ తనవాళ్లను ఎదురిస్తాడని, ఒప్పిస్తాడని అనుకుంది. ఊహూ..! అతను కూడా సింపుల్‌గా సారీ చెప్పి చేతులెత్తేశాడు.

అరిచింది. ఏడ్చింది. నిలదీసింది. కొట్టింది. కాళ్లు పట్టుకుంది. ‘మా ఇంట్లో వాళ్లు ఒప్పుకుంటారనుకున్నా! ఒప్పుకోవడం లేదు. మరి నేనేం చేయను?’ అని అతను ఎదురు ప్రశ్నించాడు. శ్వేతకు జ్ఞానోదయం అయింది. అతనేమిటో, అతని వ్యక్తిత్వం ఏమిటో తెలిసి వచ్చింది. వెంటనే ఇంటికి వెళ్లి, ఉరేసుకుంది. తన చావుకు కారణం ‘విజయ్’ అని ఉత్తరం రాసి మరీ చనిపోయింది. 23 ఏళ్లకే తన జీవితం ముగిసిపోయింది.

insta love
***
… అదే కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లా బంట్వల్ తాలూకా కుక్కికట్టె అనే ఊరిలో ఉంటున్నాడు చేతన్. వయసు 25. అతనికి రోజూ ఇన్‌స్టా చూసే అలవాటు ఉంది. అక్కడే తనకు చైతన్య అనే అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఒకరికొకరు దృఢ నిశ్చయంతో తమ ఇంట్లో వాళ్లను ఒప్పించుకున్నారు.

8 నెలల క్రితం నిశ్చితార్థం చేసుకున్నారు. మరికొన్ని రోజుల్లో పెళ్లికి సిద్దమవుతున్నారు. చేతన్, చైతన్య రోజూ ఇన్‌స్టాలో చాట్ చేసుకుంటూ ఉండేవారు. చైతన్య పెట్టే ప్రతి ఫొటోకు చేతన్ లైక్ కొట్టేవాడు. ఈ మధ్య తన ఫొటోలకు కాకుండా వేరే అమ్మాయిల ఫొటోలకు అతను లైక్ కొడుతూ ఉండటం చైతన్య చూసింది.

అతని మీద అనుమానం మొదలైంది. ఈ విషయంపై గొడవలు జరిగాయి. అతనేదో సర్ది చెప్పాడు. ఆమె ఒప్పుకోలేదు. వారి మధ్య వివాదం పెద్దదవుతూ ఉంది. చివరకు చైతన్య చేతన్ ఇంటికి వచ్చి, అతను చేస్తున్న పనిని నిలదీసింది. ‘మనిద్దరికీ కుదరదు. పెళ్లి క్యాన్సిల్ చేద్దాం’ అంది.

అప్పటికే ఈ గొడవ కారణంగా విసిగిపోయి ఉన్న చేతన్ ఈ మాటతో ఇంకా ఆవేశంలోకి, బాధలోకి వెళ్ళిపోయాడు. వెంటనే తన గదిలోకి వెళ్లి, ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో వాళ్లకి దుఃఖం మిగిల్చాడు.

***
‌..‌. ప్రేమించానని చెప్పిన వాడి కోసం భర్తను వదిలేసి, చివరకు ఆ ప్రియుడి నిజస్వరూపం తెలుసుకున్న మహిళ ఒకరు. ప్రేమించిన అమ్మాయి పెట్టే ఇబ్బంది, పడే అనుమానం తట్టుకోలేక బలైన పురుషుడు ఒకరు. రెండూ ఇన్‌స్టాగ్రామ్ ప్రేమలే! రెండూ విషాదాంతాలే! ఈ ఘటనల్ని ఏమని వ్యాఖ్యానించాలి? జాగ్రత్తగా ఉండమని హెచ్చరించగలం అంతే!

PS: జరిగిన ఘటనల తాలూకు సమాచారాన్ని తెలుసుకొని రాసిన వ్యాసం ఇది‌. అయితే యథాతథంగా ఇలాగే జరిగిందనే నిర్ధారణ లేదు.

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…
  • అలా హీరో విలన్లను పట్టుకొచ్చి కోర్టు హాల్లో పడేస్తాడు… వెంటనే విచారణ..!!!
  • ముందు తెలిసినా…! ఇలా రాసేవాళ్లేరీ, తీసేవాళ్లేరీ, చేసేవాళ్లేరీ… చూసేవాళ్లేరీ..!!
  • దూసుకొస్తున్న మరో ‘స్కైలాబ్’… పాకిస్థాన్‌పై పడితే పీడాపోతుంది…
  • భయపడమనడం లేదు… బాధ్యతపడమంటున్నది ప్రభుత్వం…
  • ఇండియా కరెక్ట్ స్ట్రాటజీ… గుడ్డెద్దు చేలో పడ్డట్టు గాకుండా ఆచితూచి…
  • మియాజాకి @ దామిని..! అసలు ఏమిటి దీని స్పెషాలిటీ..? అంత రేటేమిటి..?!
  • సింగిల్..! శ్రీవిష్ణు షో… అక్కడక్కడా నవ్వులు భలే పండాయి…!!
  • శుభం..! ఇంతకీ ఈ సినిమా ద్వారా సమంత ఏం చెప్పాలనుకుంది..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions