అందరితో కన్నీళ్లు పెట్టించినవాడు… ఊరూరా ప్రత్యేక ప్రదర్శనలతో నీరాజనం పట్టించుకున్నవాడు… ఓ ప్రాంత సంస్కృతికి పట్టం గట్టినవాడు… కుటుంబబంధాల విలువను చెప్పినవాడు… అలాంటి బలగం సినిమా దర్శకుడు ఎల్దండి వేణుకు ఓ పరాభవం… ఆ ఇండస్ట్రీయే అంత అనుకోవాలా..? లేక ఇక్కడ కూడా దిల్ రాజు పైత్య ప్రదర్శన పనిచేసిందనుకోవాలా..?
వివరాల్లోకి వెళ్తే… ఓ ఫోటో కనిపించింది… ఏమిటయ్యా అంటే, డైరెక్టర్స్ డే సందర్భంగా తెలుగు ఫిలిమ్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ కొన్ని ప్రశంసా పురస్కారాలను ప్రకటించిందట… అసలు ఈ అసోసియేషన్ ఉనికిని కొత్తగా వింటున్నాం… సరే, వాళ్ల బాధ వాళ్లది… ఏవో ప్రశంసా పురస్కారాలు అంటున్నారు… ఎక్కడ ఇస్తారో, ఇస్తారో లేదో తెలియదు, వోకే, కనీసం ప్రతిభ కనబరిచిన కొందరు దర్శకుల పేర్లను ఎంపిక చేశారు… సంతోషం…
కానీ మీరు ఈ ఫోటో చూస్తే… కార్తికేయ, విరాటపర్వం, బింబిసార, బలగం, నాట్యం, కలర్ ఫోటో సినిమాల పేర్లు, ఫోటోలు కనిపిస్తున్నాయి… జాగ్రత్తగా చూడండి… ఒక్క బలగం సినిమా తప్ప మిగతా సినిమాలన్నింటికీ దర్శకుల ఫోటోలున్నాయి… ఒక్క బలగం సినిమా దగ్గర మాత్రం నిర్మాత హర్షిత్ రెడ్డి పేరు కనిపిస్తోంది… నిర్మాత దిల్ రాజు కొడుకు కావచ్చు బహుశా…
Ads
ఇక్కడ జవాబు అంతుచిక్కని ప్రశ్న ఏమిటంటే… ఒక్క బలగం సినిమాకే… నిర్మాత పేరు రాసి, డైరెక్టర్స్ డే నాడు బలగం దర్శకుడిని వదిలేసి, నిర్మాతకు ప్రశంసా పురస్కారం ప్రకటించడం ఏమిటి..? ఠాట్, వేణు పేరు దేనికి..? మావోడి పేరు ప్రకటించండి అని దిల్ రాజు ఉరిమాడా..? ఆ ప్రభావంతో డైరెక్టర్ల సంఘం సాగిలబడిపోయిందా..? ఈ వికారంతో తమ పరువును బజారున పడేసుకుందా..?
నిజానికి వీరిలో నాట్యం అట్టర్ ఫ్లాప్… విరాటపర్వం ఘోరమైన ఫ్లాప్… కలర్ ఫోటో సోసో… కార్తికేయ, బింబిసార కమర్షియల్ హిట్స్… కానీ ఈ ఆరు సినిమాల్లో బలగం సినిమా సూపర్ హిట్… ఇక్కడ డబ్బులు, వసూళ్ల లెక్కల్లో కాదు, యావత్ తెలంగాణ సమాజం మనస్పూర్తిగా ఆశీర్వదించింది సినిమాను… చూసి కన్నీళ్లు పెట్టుకుంది… వేణు మా బిడ్డ అని అభినందించింది… కానీ ఈ డైరెక్టర్ల అసోసియేషన్‌కు కూడా ఏమైనా ప్రాంతీయ వాసనలు బలంగా ఉన్నాయేమో గానీ, వేణు పేరు మిస్సింగ్… అసలు యాణ్నుంచి వస్తారుర భయ్ మీరంతా… ఇంతకీ ఈ సంఘం బాధ్యులైన మహానుభావులు ఎవరో…
Share this Article