ఒక మిత్రుడు ఇన్‌బాక్సుకు వచ్చి మరీ నిలదీశాడు…. నాటు మోటు పాట మీద ఏదేదో రాశావు, నువ్వేం రాశావో నీకు తెలుసా అసలు అని…! నిజమే… తెలుగు సినిమాను మార్కెట్‌పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన రాజమౌళిని కదా అనాల్సింది… చారిత్రిక పాత్రలను వెకిలి చేసి, సినిమాటిక్ లిబర్టీ పేరిట అవమానించే ఆ దర్శకుడిని కదా అనాల్సింది… మనదే తప్పు… కాపీ డైరెక్టర్ అంటే చాలామందికి కోపం… కాపీ డైరెక్టర్ కానివాడెవ్వడు అని ఎదురు ప్రశ్నిస్తారు… అదేదో విజయశాంతి సినిమాలో విలన్ కొడుకు మరణించే సీన్‌ను యథాతథంగా విక్రమార్కుడు సినిమాలో దింపేసిన రాజమౌళి క్రియేటివ్ లెవల్స్ తెలుసు కదా… బోలెడు… కాపీ కొట్టడం ఓ కళ అని నిరూపించిన దర్శకుడి టేస్ట్ గురించి కదా చెప్పుకోవాల్సింది… నిజమే బ్రదర్, అసలు చంద్రబోస్ గురించి ఎందుకు రాసుకోవడం… అసలు తప్పు మూలాల్ని వెతకాలి కదా…
కుమరం భీమ్… జల్, జంగిల్, జమీన్ నినాదంతో ప్రభుత్వాల మీద పోరాడి, గిరిజనులకు ఆరాధ్యుడైనాడు… అల్లూరి… స్వాతంత్ర్య పోరాటంలో దండు కట్టి, దళం కదిల్చి, ప్రాణాలు వదిలేసిన హీరో కదా, ఓ ప్రాంత గిరిజనులకు ఆరాధ్యుడు కదా…. వాళ్ల జీవన కాలాలు వేరైనా, వాళ్లు ఎక్కడో కలిసినట్టు ఓ క్రియేటివ్ లిబర్టీ తీసుకున్నాడు రాజమౌళి, అది తనే చెప్పుకున్నాడు… సరే, ఏ గొప్ప కథైనా వక్రీకరించడం, హీరోల ఇమేజీకి తగ్గట్టు తప్పుడు బాష్యాలు చెప్పడం మన ఇండస్ట్రీ ఆనవాయితీ కాబట్టి, సినిమాటిక్ లిబర్టీ కోణంలో ఏదైనా చెలామణీయే అని ఉల్టా దబాయింపు ఉంటుంది కాబట్టి వోకే అనుకుందాం… తెలుగు ప్రేక్షకుడి ఖర్మ… అయితే..?
Ads
ఇద్దరు గిరిజన ఆరాధ్య నేతలకు ఆ మోడరన్ దుస్తులు తొడిగి, సగటు తెలుగు పాటల స్టెప్పులు పెట్టి, ఓ చెత్తా నాటు పాట పెట్టి, మొత్తం చరిత్రను, రెండు ప్రాంతాల గిరిజన మనోభావాలను నిలువునా దెబ్బతీస్తే మాత్రం… అది గొప్పతనమా..? అది సినిమాటిక్ లిబర్టీయా..? దానికి మనం చప్పట్లు కొట్టి ఆహా ఓహో అని రాజమౌళి అనబడే ఒక కాపీ కేరక్టర్ కి కీర్తికిరీటాలు తొడగాలా..? హారతులు పట్టాలా..? మార్కెటింగ్ టెక్నిక్స్ తెలిసి, సినిమాను పలు దేశాల్లో అమ్ముకుని, సొమ్ము చేసుకునే తెలివితేటలు ఉంటే అన్నీ చల్తా అనుకోవాలా… బారా ఖూన్ మాఫ్ అనేయాలా… అంతేనా రాజమౌళి గారూ… ఇద్దరు గిరిజన ఆరాధ్యనేతల్ని ఇలా వెకిలిగా చూపించినందుకు కారణాలు, జస్టిఫికేషన్ ఏమైనా చెప్పగలరా ప్లీజ్..? చరిత్ర అంటే తమరికి ఎందుకింత ద్వేషం..? కానీ ఒక్కటే ఆశ… తమరు ఇందిరాగాంధీ, నిక్సన్ పాత్రల్ని తీసుకుని, బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని, ఇలాంటి కథల్ని కూడా ఇదే రేంజులో తెరకెక్కించవద్దని ఆశించడం తప్ప, సర్, ప్లీజ్, తెలుగు ప్రేక్షకుల్ని, ఆ చరిత్రల్ని వదిలేయండి సార్ అని వేడుకోవడం మినహా… లోక్లాస్ ప్రేక్షకులం, మేమేం ఆశించగలం..?! అన్నట్టు బ్రదర్, చంద్రబోస్ గొప్పాతిగొప్ప రచయిత, తెలుగు పాటకు ఓ కీర్తికిరీటం సరే, కానీ ఇలా గిరిజన ఆరాధ్యులను కించపరిచే వెగటు సీన్లను ఏమందాం..?!
Share this Article