Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాజధానిలోనే స్మారకం, సరే సరే… మరి నాడు పీవీని ఏం చేశారు..?!

December 28, 2024 by M S R

.

మాజీ ప్రధానులు, రాజనీతిజ్ఞులకు ఢిల్లీలోనే అంత్యక్రియలు నిర్వహించి, ఆ స్థలంలోనే స్మారకాలు ఏర్పాటు చేయడం మన దేశంలో ఆనవాయితీగా వస్తుందని కాంగ్రెస్ చెబుతోంది… మన్మోహన్ అంత్యక్రియలు, స్మారకం కోసం…

మరి అదే మన్మోహన్‌ను కేబినెట్ మంత్రిని చేసి, దేశాన్ని దివాలా స్థితి నుంచి రక్షించిన తెలుగువాడు పీవీ అంత్యక్రియలకు సంబంధించి ఈ వాదన ఎందుకు గుర్తురాలేదు..? పీవీ భౌతికదేహాన్ని కూడా అవమానించింది కదా కాంగ్రెస్ మాత…

Ads

తన చేతిలో రిమోట్‌లా పనిచేశాడు కాబట్టి సోనియా అభిమానానికి పాత్రుడు మన్మోహన్… ఆమె చేతి కింద పనిచేయడం ఇష్టం లేక, ఓ స్వతంత్రుడిగా, రాజనీతిజ్ఞుడిగా, ప్రజాప్రధానిగా వ్యవహరించాడు కాబట్టి ఆమెకు అయిష్టుడు పీవీ… ఒక వ్యక్తి రాగద్వేషాలతో అన్నీ అలా మారిపోతుంటాయి… పీవీ మీద కేసులు కూడా..!!

ఈ సందర్భంగా మిత్రుడు దిలీప్ కొణతం తన వాల్ మీద షేర్ చేసుకున్న పోస్టు ఇది… (నిజమే… తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పీవీ పేరుకు, జ్ఞాపకాలకు సముచిత గౌరవాన్ని ఇచ్చింది కేసీయారే… సందేహం లేదు…)



నిన్నటి నుండి మన్మోహన్ సింగ్‌ను బీజేపీ వారు అవమానించారు అని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెడుతున్నారు. అసలు మన్మోహన్‌ను ఈ దేశానికి పరిచయం చేసింది తెలంగాణ బిడ్డ పీవీ నరసింహారావు. ఆయన మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా వ్యవహరించిందో, ఎలా అవమానించిందో చదవండి!

***

పీవీకి మరణంలోనూ అవమానం!

ఇంగ్లీష్ మూలం: ది హాఫ్ లయన్, By వినయ్ సీతాపతి

***

తెల్లని ధోవతీ, బంగారు రంగు పట్టు కుర్తాలో ఉందా భౌతికకాయం. మధ్యాహ్నం 2:30కి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నుండి 9, మోతీలాల్ మార్గ్‌కు ఆ భౌతికకాయం తీసుకువచ్చారు.

భారత ప్రధానిగా 1991 నుండి 1996 వరకూ ఉన్న పీవీ నరసింహారావు 23 డిసెంబర్ 2004 నాడు ఉదయం దాదాపు 11 గంటలకు మరణించారు. భౌతికకాయానికి డ్రెస్సింగ్ చేసి ఇంటికి పంపడానికి రెండు గంటల సమయం పట్టింది.

తొలుత అక్కడికి చేరుకున్నవారిలో చంద్రస్వామి ఉన్నారు. పీవీ కొంచెం దూరంగా పెట్టిన ఆయన ఎనిమిది మంది సంతానం, ఆయనతో సన్నిహితంగా ఉండే మనుమలూ, మనుమరాండ్రు కూడా చేరుకున్నారు. బ్రతికున్నప్పుడు తండ్రితో తీవ్రంగా విభేధించే జ్యేష్ట పుత్రుడు రంగా రావు దుఃఖం పట్టనలవిగానట్టుగా ఉంది.

అప్పుడు మొదలైనయి రాజకీయాలు.

అప్పటి కేంద్ర హోం మంత్రి శివ్‌రాజ్ పాటిల్ పీవీ చిన్న కొడుకు ప్రభాకర్ రావుతో “భౌతికకాయాన్ని అంత్యక్రియలకు హైదరాబాదు తీసుకువెళ్లాలి” అని సూచించాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు ఢిల్లీనే సరైన వేదిక అని భావించారు.

ఎందుకంటే, పీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, కేంద్ర మంత్రిగా, చివరికి ప్రధానిగా ఆయన కార్యస్థలం అంతా ఢిల్లీనే.

కానీ, కుటుంబసభ్యులు అంత్యక్రియలు ఢిల్లీలోనే చేస్తాం అన్న మరుక్షణం సహజంగా కొంచెం మర్యాదస్థుడిగా ఉండే శివ్‌రాజ్ పాటిల్ కూడా కొంచెం దురుసుగా “ఇక్కడ చేస్తే ఎవరూ రారు” అనేశాడు.

కొద్దిసేపటికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంతరంగికుడు, కశ్మీరీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అక్కడికి చేరుకున్నాడు. ఆయన కూడా భౌతికకాయం హైదరాబాద్ కు చేర్చాలనే అభ్యర్ధించాడు.

మరో గంట గడిచాక ప్రభాకర్ రావు మొబైల్ ఫోన్ మోగింది. అటువైపు ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.యెస్ రాజశేఖర్ రెడ్డి.

“ఇప్పుడే తెలిసింది నాకు. నేను అనంతపురం దగ్గరలో ఉన్నాను. సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాను. నా మాటగా చెప్తున్నాను. హైదరాబాదులో ఘనంగా అంత్యక్రియలు చేద్దాం”

సాయంత్రం 6:30కు సోనియా గాంధీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. ప్రధాని మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమె వెంటవచ్చారు.

“అంత్యక్రియలు ఎక్కడ చేద్దామనుకుంటున్నారు” అని ప్రభాకర రావును ప్రధాని మన్మోహన్ ప్రశ్నించాడు.

“వీళ్లందరూ హైదరాబాదులో చేయమంటున్నారు. కానీ ఢిల్లీనే ఆయన కర్మభూమి” అని ప్రభాకర రావు జవాబిచ్చాడు. “మీరు కొంచెం మీ క్యాబినెట్ సహచరులతో మాట్లాడి వారిని ఒప్పించండి” అని అభ్యర్ధించాడు.

మన్మోహన్ తల పంకించాడు

పక్కనే నిలబడ్డ సోనియాగాంధీ మౌనందాల్చింది.

జర్నలిస్ట్ సంజయ్ బారు కూడా వచ్చాడు. ఆయన తండ్రి బి.పి.ఆర్. విఠల్‌కు పీవీ 1960ల నాటినుండే పరిచయం. బారు ఇంటి ముందు కారిడార్ లోకి ప్రవేశించగానే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అతని భుజం మీద మెల్లగా తట్టి “మీకు ఈ కుటుంబం బాగా తెలుసు కదా. భౌతికకాయం హైదరాబాద్ తీసుకుపొమ్మని వారికి నచ్చచెప్పగలవా? అని అడిగాడు.

ఇదంతా జరుగుతుండగానే వైయెస్ ఢిల్లీ చేరుకున్నాడు. “అక్కడున్నది మన ప్రభుత్వమే. నన్ను నమ్మండి. భౌతికకాయం హైదరాబాద్ తీసుకుపోనివ్వండి. అక్కడే గొప్ప స్మారక చిహ్నం కట్టిద్దాం” అని వైయెస్ ఆ కుటుంబాన్ని ఒప్పించాడు.

అంత్యక్రియలు హైదరాబాదులో చేసినా, కనీసం స్మారకచిహ్నం అయినా ఢిల్లీలో కట్టించాలి అని పీవీ కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులు సరేనన్నారు. కానీ పీవీ పట్ల అప్పటికే పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసిన పీవీ కుటుంబం ఎందుకైనా మంచిదని ఆ రాత్రే ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లారు. రేస్ కోర్స్ రోడ్ లోని ప్రధాని నివాసంలో శివరాజ్ పాటిల్ సమక్షంలో తనని కలిసిన పీవీ కుటుంబసభ్యులతో మన్మోహన్ “తప్పకుండా స్మారక చిహ్నం కట్టిద్దాం” అని వాగ్ధానం చేశాడు.

జరిగిన సంగతులు గుర్తుచేసుకుంటూ ప్రభాకర రావు తర్వాత ఇలా అన్నాడు. “సోనియా గారికి నాన్న అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం గానీ, ఆయన స్మారకస్తూపం నిర్మించడం కానీ, అసలు ఆయనను ఒక జాతీయ స్థాయి నాయకుడిగా చూడటం కానీ ఇష్టం లేకుండె. కానీ ఆ రోజు మా కుటుంబం మీద బాగా వత్తిడి పెట్టారు. అందుకే మేం ఒప్పుకోక తప్పలేదు”.

***

మరుసటిరోజు (24 డిసెంబర్ 2004), కమ్యూనిస్టుల నుండి కాషాయవాదుల వరకూ రాజకీయ నాయకులంతా పీవీకి నివాళి అర్పించడానికి వచ్చారు.

ఉదయం పదింటికి భౌతికకాయం మీద జాతీయ జెండా కప్పి, పూలతో అలంకరించిన ఒక క్యారేజి మీద పెట్టి, దాన్ని ఒక సైనిక వాహనంతో విమానాశ్రయం వైపు ఒక ఊరేగింపుగా నడిపించారు. వెనుక సైనికులు నడిచారు. దారిలో 24, అక్బర్ రోడ్‌లో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆగాలని ప్లాన్ చేశారు.

ఆ కార్యాలయం పక్కనే సోనియా గాంధీ నివాసం ఉంది. ఊరేగింపు 24 అక్బర్ రోడ్ వద్దకు రాగానే వేగం తగ్గింది. కానీ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గేటు మాత్రం మూసే ఉన్నది. అక్కడ చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు జమయ్యిండ్రు. కానీ పెద్దగా కార్యకర్తలను తరలించినట్టు లేదు. నినాదాల హోరు కూడా లేదు. మొత్తం స్మశాన నిశ్శబ్దం. వాహనం బయట పేవ్‌మెంట్ వద్ద ఆగింది. సోనియా గాంధీ, ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు బయటికి వచ్చి చివరిసారిగా నివాళులు అర్పించారు.

పార్టీ అధ్యక్షులుగా సేవలందించినవారు మరణిస్తే వారి పార్థివశరీరం పార్టీ కేంద్ర కార్యలయంలోకి తీసుకుపోయి అక్కడ ప్రజల సందర్శనార్ధం ఉంచడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ. పీవీ విషయంలో మాత్రం అలా జరగకపోవడంతో అతని కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు.

పీవీ మిత్రులొకరు అక్కడున్న ఒక మహిళా కాంగ్రెస్ నేతను గేట్లు తెరవమని అడిగినప్పుడు, ఆమె “ఈ గేటు తెరుచుకోదు” అని జవాబిచ్చిందట. “అది నిజం కాదు” అంటాడు ఆ మిత్రుడు. ఎందుకంటే కొన్నేళ్ల ముందు మాధవ్ రావ్ సింధియా మరణిస్తే, ఇదే గేటు తెరుచుకుంది.

కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోనికి పీవీ భౌతికకాయాన్ని ఎందుకు రానీయలేదు అని మన్మోహన్ సింగును ప్రశ్నిస్తే ఆయన తనకు తెలియదు అని బదులిచ్చాడు. ఆరోజు అక్కడే ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు మాత్రం కుండబద్దలు కొట్టేశాడు. “మేమందరం ఆరోజు కార్యాలయం గేట్లు తెరుచుకుంటాయని ఆశించాం. కానీ పైనుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అవి తెరవమని ఆదేశించగలిగేది ఒక్కరే”.

“కానీ, ఆమె ఆ ఆదేశాలు ఇవ్వలేదు”

***

ఒక ఇబ్బందికరమైన అర్ధగంట గడిచాక శవపేటిక ఉన్న వాహనం విమానాశ్రయం వైపు కదిలింది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానంలో ఆ శవపేటిక ఉంచారు. సాయంత్రం 4:55 కు హైదరాబాద్ చేరుకుందా విమానం. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రివర్గం అక్కడ భౌతికకాయాన్ని రిసీవ్ చేసుకున్నారు. గోర్ఖా రెజిమెంట్ కు చెందిన సైనికులు గౌరవ వందనం చేశారు. ఒక గన్ క్యారేజి మీద పెట్టి హైదరాబాద్ వీధుల గుండా ఊరేగింపుగా నడిపారు.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హాలులో ఒక రోజంతా పీవీ భౌతికకాయం ప్రజల సందర్శనార్ధం ఉంచారు. వేలాది మంది అభిమానులు ఆయనను కడసారిగా దర్శించుకున్నారు.

ముఖ్యమంత్రి వైయెస్ ఇచ్చిన మాట మేరకు హుసేన్ సాగర్ ఒడ్డున నాలుగు ఎకరాల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లుచేయించాడు. మరునాడు మధ్యాహ్నం ఒంటిగంటకు అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని మన్మోహన్ డిల్లీ నుండి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యాడు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ డిల్లీలో పీవీ పార్థివదేహానికి జరిగిన అవమానానికి మన్మోహన్ చాలా బాధపడ్డాడని అన్నాడు.
ప్రధానితో పాటు ఆయన క్యాబినెట్ సహచరులు, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ, బీజేపీ నుండి ఎల్.కె.అద్వానీ హాజరయ్యారు. దాదాపు 12 వేలమంది సాధారణ పౌరులు – ఇందులో అనేకమంది ఆయన స్వగ్రామం వంగర నుండి వచ్చినవాళ్ళు – ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.

కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

చితిని అంటించిన రంగారావు దుఃఖంలో మునిగిపోగా అతని సోదరులు ఓదార్చారు. సుమారు రెండు గంటల తరువాత వచ్చినవాళ్లంతా వెనుతిరిగే సమయానికి చితి ఇంకా మండుతూనే ఉంది.

ఆరోజు రాత్రి చితిమీద సగం కాలిన పీవీ శరీరాన్ని టీవీ చానెళ్లు చూపించాయి. కొన్ని వీధికుక్కలు ఆ చితిని పట్టి లాగుతున్నాయి.

పీవీకి చాలాకాలంగా సన్నిహితుడుగా ఉన్న పి.వి.ఆర్.కె. ప్రసాద్ ఒక స్థానిక టెలివిజన్ చానెల్ కోసం ఈ అంత్యక్రియలను కవర్ చేశాడు. ఆయన పీవీ భౌతికకాయం సగం కాలింది అని వచ్చిన వార్తలు నిజం కాదంటాడు. చితిలో బూడిద ఒక శరీరాకృతిలో కనిపించింది అనేది ఆయన అభిప్రాయం.

“నిజానికి పీవీకి మరణంలోనూ అవమానం జరిగింది అనే అభిప్రాయం ప్రజల మనసుల్లో బాగా నాటుకుపోయింది. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా దేహాన్ని హైదరాబాద్ బలవంతంగా తీసుకొచ్చారని, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోకి అనుమతించలేదని…పీవీకి జరిగిన అవమానం వల్లనే ప్రజల మనసుల్లో ఆయన పార్థివదేహం పూర్తిగా చితిలో కాలలేదు అనే అభిప్రాయం ఏర్పడింది”. అన్నారాయన.

***

పీవీ మరణించాక పన్నెండేళ్లయినా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆయనను పట్టించుకున్నపాపాన పోలేదు. 2004 నుండి 2014 వరకూ అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ పీవీకి ఒక స్మారక చిహ్నం కట్టలేదు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపలేదు. పీవీ కుటుంబమే ఆయన జయంతిని ఢిల్లీలో ప్రైవేటుగా జరిపేవారు. దీనికి ఆయన వ్యక్తిగత సిబ్బంది, మిత్రులు సాయం చేసేవారు. పీవీకి సన్నిహితంగా ఉంటున్నందుకు కాంగ్రెస్ అధిష్టానం దూరం పెట్టిన పంజాబ్ కాంగ్రెస్ నేత ఎం.ఎస్. బిట్టా ఈ జయంతి వేడుకలకు తనవంతు సాయం చేసేవాడు. ఢిల్లీలో జరిగే జయంతివేడుకలకు జనాన్ని పంజాబ్ నుండి బస్సులో తరలించేవాడు బిట్టా. వచ్చినవారెవరికీ పీవీ గురించి ఏమీ తెలియక పోయినా ఏదో ఇంత తిండి దొరుకుతుంది అని ఆ పేదప్రజలు ఢిల్లీ దాకా వచ్చేవారు అని అంటారు సంజయ బారు.

ఎవరూ వచ్చినా రాకున్నా ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాత్రం క్రమం తప్పకుండా ఈ జయంతి కార్యక్రమానికి వచ్చేవాడు. ఆయనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్. పార్టీ అధినాయకత్వం మనోగతం తెలిసి ఈ ధిక్కరణ ఎందుకు చూపారని అడిగితే, పీవీ తనకు ఆర్థిక సంస్కరణల అమలులో పూర్తి స్వేచ్చను ఇచ్చారని, ఇది ఆయనకు నేను ఇచ్చే చిన్న నివాళి అని మన్మోహన్ చెప్పారు.

పీవీకి దగ్గరి బంధువు కెప్టెన్ లక్ష్మీకాంతారావు ప్రస్తుతం టీ.ఆర్.ఎస్‌లో ఉన్నారు. 2012లో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూటమి భాగస్వామిగా ఉన్నప్పుడు వరంగల్లో పీవీ విగ్రహం పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి మెమెరాండం సమర్పించారు. “కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆ పని జరగనివ్వలేదు. ఇక్కడ విగ్రహం పెడితే, దానికి ఎప్పుడో ఒకప్పుడు దండ వేయాలి. ఎవరైనా ఆ దండ వేస్తున్న సమయంలో ఒక ఫొటో తీసి అధినేత్రి సోనియాకు పంపితే లేనిపోని తంటా” అనేది వారి అభిప్రాయం కావచ్చని లక్ష్మీకాంతారావు అభిప్రాయం.

సోనియాగాంధీకి పీవీ నరసింహారావు నచ్చకపోవడానికి ప్రధాన కారణం నట్వర్ సింగ్ మాటల్లో చెప్పాలంటే”తాను ప్రధానిగా ఉన్నప్పుడు సోనియాగాంధీ చెప్పినట్టు వినాలి అని పీవీ అనుకోకపోవడమే. “పీవీ అలా చేయకపోవడమే సోనియా ఆగ్రహానికి కారణం.”

***

కానీ తెలంగాణ వచ్చాక కేసీఆర్ చొరవతో ఈ పరిస్థితి మారింది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆరెస్ పార్టీ పీవీకి సముచిత గౌరవం ఇచ్చింది. 2014లో రాష్ట్రం ఏర్పాటు అయినప్పటినుండీ ప్రభుత్వమే పీవీ జయంతిని అధికారికంగా నిర్వహిస్తోంది. పీవీ శతజయంతి ఉత్సవాలను ఒక ఏడాది పాటు వైభవోపేతంగా నిర్వహించింది. ఆయన గురించి అనేక పుస్తకాలు ప్రచురించింది, అనేక వీడియోలు తయారుచేయించింది. నెక్లెస్ రోడ్డు మీద ఆయన నిలువెత్తు విగ్రహం నెలకొల్పి ఆ రోడ్డుకు పీవీ మార్గ్ అని పెట్టింది. పీవీ స్మారకం నిర్మించింది. ఒక విశ్వవిద్యాలయానికి ఆయన పేరు పెట్టింది. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ గారు చేసిన డిమాండ్‌కు ఇటీవలనే స్పందన వచ్చి ఆ గొప్ప నాయకుడికి భారతరత్న ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పీవీ బిడ్డ వాణీదేవి గారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చి గౌరవించుకుంది కేసీఆర్ సర్కార్….

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఎద్దులతో ఓ జంట అనుబంధం…! తమిళ సినిమాకు కాదేదీ కథకనర్హం..!
  • ఈ సైకో రేపిస్ట్ ఎన్ని హత్యాచారాలు చేస్తేనేం… ఇంకా బతికే ఉన్నాడు…
  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions