అది అసలే మెగాస్టార్ మూవీ… ఎవరూ ఏమీ అనడానికి వీల్లేదు… రెండు సినిమాలు వరుసగా చీదేసినా సరే, మళ్లీ అవే డ్రెస్సులు, అవే స్టెప్పులు, ఇవే ఇమేజీ పోకడలు… అదే నెత్తిమాశిన ఫార్ములా పోకడలు… కానీ, దేవుడు కదా, ఎవ్వడూ ఏమీ అనొద్దు… మొన్నామధ్య ఎవరో ఆమీర్ భాన్, లాల్ సింగ్ చద్దా అన్నాడు, ప్రజెంట్ చేశాడు, అది కాస్తా ఫట్ మని తన్నేసింది…
తరువాత సల్మాన్ ఖాన్ అన్నాడు, అతిథి పాత్రో, విశేష పాత్రో ఇచ్చాడు… అదీ ఫట్… ఈ ఖాన్‌లలో మిగిలింది షారూక్ ఖాన్… ఈలోపు తనొక్కడే సరిపోడని అనుకున్నాడో, రాంచరణ్ అయినా సరే ఆచార్య పాదఘట్టం అవుతుందీ అనుకున్నాడో ఈసారి రవితేజను పట్టుకొచ్చాడు వాల్తేరు వీరయ్యకు… సేమ్, కమర్షియల్ సినిమా…
రవితేజ అంటేనే కమర్షియల్ ఐటం… అదేదో సినిమాలో బన్నీ కోడిని పట్టుకుని వస్తుంటాడు కదా… అదే తరహాలో ఓ మేకపిల్లను పట్టుకుని వచ్చాడు రవితేజ… వస్తే వచ్చాడు, ఫ్యాన్స్ కోసమే కదా సినిమా… వుయ్ అని ప్రోమో చూస్తూనే శివాలూగుతున్నారు… తీరా చూస్తే తెలంగాణ భాషకు, యాసకు ఖూనీ…
Ads
తెలంగాణ సమాజం కోరేది ఒకటే… ఇన్నాళ్లూ అవమానించారు కదర భయ్… ఇన్నేళ్లు హైదరాబాద్ మీద బడి బతికినా సరే, మీకు తెలంగాణ యాస రాదు, పైగా తెల్లారిలేస్తే అవమానించారు… మీ గుణం అది… ఇప్పుడు తెలంగాణ పాట కావాలి… యాస కావాలి… లేకపోతే సినిమాలు నడవడం లేదు… దాంతో ఎవడో నెత్తిమాశినోడిని పట్టుకుని డవిలాగులు రాయిస్తారు… వాడికీ ఏమీ తెలియదు… మీకూ ఏమీ తెలియదు…
డిక్షన్… తెలంగాణ యాస పలకడం అనేది ఓ పెద్ద టాస్క్… అది ఒక తనికెళ్ల భరణికి తెలుసు… ఒక శకుంతలకు తెలుసు… ఈమధ్య జొన్నలగడ్డ సిద్ధూ పర్‌ఫెక్ట్‌గా పలుకుతున్నాడు… భాషను ప్రేమించేవాళ్లకే దాన్ని పలకడం బాగా తెలుస్తుంది… నాలుగు డబ్బుల కోసం కృత్రిమంగా పలకాలని ప్రయత్నిస్తే వికటిస్తుంది… ఓ వికృత భాష ధ్వనిస్తుంది… దానికన్నా బాహుబలి కిలికి భాష బెటర్…
ఈ సినిమాలో రవితేజ హీరోయిక్ ఫోజుతో వస్తుంటే… ఫస్ట్ టైం మేక పిల్లను ఎత్తుకుని పులి వస్తా ఉన్నాది అంటూ బ్యాక్ గ్రౌండలో ఓ డైలాగ్… అది అసలు తెలంగాణ యాసకు వంద కిలోమీటర్ల దూరం… వస్తా ఉన్నది ఏందిర భయ్… సరే, దాని గురించి వదిలేయండి… తరువాత ఇదే రవితేజ తనకు ఏమాత్రం సూట్ కాని, చేతకాని రీతిలో తెలంగాణ యాసలో ‘‘ఏంరా వారీ, పిస్స పిస్స చేస్తున్నావ్, నీకింకా సమజ్ కాలే, నేనెవ్వని అయ్యకు ఇననని…’’ అని పలికాడు… పరమ వికృతంగా ధ్వనించింది… ప్రోమో ఇలా కంపు అంటే ఇక సినిమాలో భాషను ఎంత క్రూరంగా అత్యాచారం చేశాడో… దేవుడా…
రవితేజా, నీ బాంచెన్… ఎప్పటిలాగే పనిమనుషులకు, ఆకు రౌడీలకు ఈ యాస పెట్టినా సరే… మరీ ఈ వికృతమైన డిక్షన్‌తో చావగొట్టకు సార్… నీకు యాస నేర్చుకోవడం చేతకాదు, నీకు మా భాష, మా యాస అంటే ప్రేమ ఉంటే కదా, ఇంకా అవమానించకు మమ్మల్ని, మా భాషను, మా సంస్కృతిని… ఇప్పుడంటే మీ కాళ్లలో విరిగిన ముళ్లను పంటితో పీకే పాలకుడున్నాడు కాబట్టి సాగుతున్నయ్ మీ ఆటలు…
ఆ సూపర్ హీరోయిక్ ఇమేజీలు, బిల్డప్పులు మీ ఇష్టం… భాష దగ్గర పైలం… నీకింకా సమజ్ కాలే, పిస్స పిస్స చేస్తున్నవ్, మేమెవ్వని అయ్యకు ఇనమని… ఈ డైలాగ్ నీకోసమే…!! ఆ సిలిండర్ ఏమిటో, ఆ డేగిషల్ని కొట్టుడు ఏందో, రౌడీలు ఎగిరిపోవుడేందో… ఎప్పుడు మారుతర్ర భయ్ మీరు…!? ఇంతకీ నీకు ఈ డైలాగుల్ని పలకడం ఎవరు నేర్పారో వాళ్ల గురించి కూడా కాస్త ప్రోమోలో పెట్టు గురూ…!!
Share this Article