2004 లో టీడీపీ ఓడిపోయి వైయస్ ఆర్ ముఖ్యమంత్రి అయిన మూడు నాలుగు నెలలకే వేల కోట్ల అవినీతి అంటూ టీడీపీ ప్రచారం చేసేది . వారి ప్రచారాన్ని ముందు వారు నమ్మి ఇతరులను నమ్మిస్తారు . ఈ విధానం టీడీపీలో చాలా బాగుంటుంది . ఓ రోజు తెలుగుదేశం శాసనసభాపక్షం కార్యాలయంలో ఉన్నప్పుడు టీడీపీ శాసనసభ్యులు దేవినేని ఉమ ‘‘హరిశ్చంద్రుడు అబద్దం చెప్పడు’’ అనే ముఖకవళికలతో బోలెడు బాధపడుతూ .. విచ్చల విడిగా సంపాదిస్తున్నారు , ఇంత డబ్బు ఏం చేసుకుంటారో అని అమాయకత్వం కనిపించేలా ప్రశ్నించారు .
నేనూ అంతే సీరియస్ గా విన్నట్టు ముఖం పెట్టి .. వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తుంది కదా ? ఈ ఏడాదిలో వాళ్ళు ఎంత సంపాదించారో ఈజీగా లెక్క కట్టవచ్చు అన్నాను . ఎంత సంపాదించారు ? ఎలా చెప్పవచ్చు అని ఆసక్తిగా అడిగారు . మూడో తరగతి వాడు కూడా చెబుతాడు ఇదో పెద్ద లెక్కనా ? అని మీ పార్టీ తొమ్మిదేళ్లు అధికారంలో ఉంది కదా ? తొమ్మిదేళ్లలో ఎంత సంపాదించారో దాన్ని తొమ్మిదితో భాగించండి .. ఒక్క సంవత్సరంలో ఎంతో వస్తుంది .. ఒక్క సంవత్సరంలో మీరు సంపాదించింది ఎంత మొత్తమో , ఈ ఏడాదిలో కాంగ్రెస్ సంపాదించింది అంతే .. ఈజీ లెక్క అన్నాను . ముఖం చూస్తే అమాయకంగానే ఉంది . లెక్క తప్పేమీ కాదు . ఏమీ బదులివ్వకుండా అలానే ఉండి పోయారు దేవినేని …
****
వేల కోట్ల నుంచి ఈ అంకె క్రమంగా లక్ష కోట్లకు చేరింది . రాజకీయాల్లో అవినీతి ఉండదు అంటే ఎవరూ నమ్మరు . పాత సినిమాల్లో హీరో పగటి పూట చిన్న ఉద్యోగం , మూటలు మోస్తూ , రిక్షా తొక్కుతూ , రాత్రి టాక్సీ నడుపుతూ , చివరకు సైకిల్ తొక్కే పోటీలో పాల్గొని ఇంటికి డబ్బు తీసుకొచ్చినట్టు నాయకులు కాయాకష్టం చేసి , ముఖానికి మాస్క్ ధరించి రిక్షా తొక్కిన డబ్బుతో పార్టీలు నడపరు , రాజకీయ పార్టీ అన్నాక వ్యవహారాలు ఉంటాయి . ఐతే కొందరు తాము శ్రీ రామచంద్రునికి లేటెస్ట్ వెర్షన్ కానీ, మా ప్రత్యర్ధులు మాత్రం మనుషులను తినే రాబందులు అన్నట్టు ప్రచారం చేస్తుంటారు .
రౌండ్ ఫిగర్ అని మొదటి పది వేల కోట్లు , తరువాత 40 వేల కోట్లకు పెంచి, చివరకు అంకె ఆకర్షణీయంగా ఉంటుంది అని లక్ష కోట్లకు చేర్చినట్టు ఎం వి మైసూరారెడ్డి ఓసారి బహిరంగంగానే ప్రకటించారు . కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేర్చుకొని వారికి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు . చివరకు టీడీపీ మీడియా సూపర్ మాన్ గా క్రియేట్ చేసిన జెడి లక్ష్మీనారాయణ ఆ లక్ష కోట్ల అంకె ఎలా వచ్చిందో తెలియదు అని, చార్జిషీట్ లో సుమారు 15 వందల కోట్ల వరకు అవినీతి వివరాలు ఉన్నాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు . లక్ష కోట్లు అంటే ఎన్ని లారీల్లో డబ్బు తీసుకువెళ్ళవచ్చో లోకేష్ చెప్పారని చంద్రబాబు మురిసిపోయారు . ఇలా వినూత్నంగా చెప్పాలి అని పార్టీ నాయకులకు సూచించారు . ఐనా లక్ష కోట్ల ప్రచారం ఆశించిన స్థాయిలో పని చేయలేదు .
చివరకు లక్ష కోట్లు అనేది ఒక జోక్ గా మారిపోయింది . దీనిని ప్రజలు ఎందుకు పట్టించుకోలేదో అర్థం కావడం లేదు అని ఈ మధ్య బాబు కూడా మీడియా ముందు బాధపడ్డారు .
*****
లక్ష కోట్లు ఇడుపులపాయలో నేలమాళిగల్లో దాచిపెట్టారు అని ఉమ్మడి రాష్ట్రంలో దేవినేని పదే పదే ఆరోపించేవారు . ఉమ్మడి రాష్ట్రంలో 2009 ప్రాంతంలో అసెంబ్లీ లాబీలో లక్షకోట్లపై చర్చ జరుగుతుంటే నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం వివేకానందరెడ్డి ఆసక్తికరమైన విషయం చెప్పారు . అప్పుడు ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు . లక్ష కోట్ల అవినీతి నిజం కాదు కానీ టీడీపీ ప్రచారం చేయడం తెలివైన నిర్ణయం అన్నారు .
లక్ష కోట్లు అంటే మీరూ నేనూ నమ్మక పోవచ్చు . మన నమ్మకాలు టీడీపీకి అనవసరం . టీడీపీ ప్రచారం చేసేది జగన్ వర్గం నమ్మాలి అని కాదు .. టీడీపీ వర్గం నమ్మాలి అని . వాళ్ళు నమ్ముతారు టీడీపీకి అది చాలు . తండ్రి పేరు చెప్పుకొని జగన్ వెళుతుంటే టీడీపీ ఏం చేయాలి మౌనంగా ఉండాలా ? తమ వర్గం కోసం అయినా లక్ష కోట్లు అని ప్రచారం చేయాల్సిందే అంటూ ప్రచారంలో మర్మాన్ని వివరించారు . . ఏ విషయం అయినా కావచ్చు నమ్మని వారు ఉంటారు , అదే విధంగా నమ్మేవారు ఉంటారు . ప్రచారం చేసేది నమ్మేవారి కోసమే కానీ నమ్మనివారి కోసం కాదు.
టీడీపీ చేస్తున్న ఈ ప్రచారాన్ని టీడీపీ వర్గం అయితే నమ్ముతుంది కదా, అది చాలు అని ఆనం వివేకానందరెడ్డి కళ్ళు తెరిపించారు . ఒక్క టీడీపీ అని కాదు అన్ని పార్టీల ప్రచారానికి ఇది వర్తిస్తుంది . ఐటీని బాబే కనిపెట్టారు , సెల్ ఫోన్ బాబే తెచ్చారు అనే ప్రచారంలో మర్మం ఇదే. తమ వర్గం నమ్మితే చాలు . మడమ తిప్పడు, మాట తప్పడు అని చెప్పినా , రాజన్న రాజ్యం అని ప్రచారం చేసినా ప్రజలంతా నమ్ముతారని కాదు . అది నమ్మే వర్గం కొంత ఉంటుంది అది చాలు …
రాజకీయాల్లో పని చేసేది ఈ నమ్మకాలే ….. బాబు అరెస్ట్ పై వంద దేశాల్లో ఉద్యమాలు అని మహా టివి … జగన్ పార్టీ వాళ్ళు పెట్టే బేడా సర్దుకొని వెళ్లి పోతున్నారు అని టివి 5 విస్తృతంగా ప్రచారం చేస్తుంది . జనం నమ్మకపోవచ్చు టీడీపీ వీరాభిమానులు నమ్మితే చాలు ఆ ఛానల్స్ లక్ష్యం నెరవేరినట్టే … – బుద్దా మురళి
Share this Article