పాకిస్థాన్ ఆర్మీ చెప్పినట్టుగా వ్యవహరించే అక్కడి అధికార గణం పీటీఐ ప్రతినిధి రవూఫ్ హసన్‌ను అరెస్టు చేసింది… ఏవేవో నేరారోపణలు చేసింది… పీటీఐ అంటే మన దేశంలో ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా… అంటే జాతీయ వార్తా సంస్థ, మీడియా సంస్థలకు వార్తల్ని సేకరించి ఇస్తుంటుంది…
కానీ పాకిస్థాన్‌లో పీటీఐ అంటే ఇమ్రాన్ ఖాన్ పార్టీ… పాకిస్థాన్ తెహ్రీక్-ఇన్సాఫ్… ఆ పార్టీకి రవూఫ్ స్పోక్స్ పర్సన్… తనను అరెస్టు చేయడానికి అధికారగణం ఆరోపించిన కారణాల్లో ముఖ్యమైంది… తను భారత గూఢచార సంస్థ (రా)తో సంబంధాలున్న ఇండియన్ జర్నలిస్టులతో నిత్య సంబంధాలను కలిగి ఉండి, మెయిళ్లతో పాకిస్థానీ సమాచారాన్ని చేరవేస్తున్నాడు… అనగా ఇన్‌ఫార్మర్, దేశద్రోహి, శత్రుసమర్థకుడు…
పోలీస్ ఎక్కడైనా పోలీసే… ఒకడిని మూయాలంటే ఏవేవో కథలు అల్లాలి… అలాగే రవూఫ్‌ను కూడా చివరకు రా సహకారిగా ముద్ర ఏదో వేశారు… ఐతే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే… వాళ్లు ఆరోపిస్తున్న ఆ భారతీయ జర్నలిస్టు పేరు కరణ్ థాపర్… ఇండియాలో చాలా సీనియర్ జర్నలిస్ట్… నిశిత ఇంటర్వ్యూలకు ఫేమస్… కొన్ని ఇంటర్వ్యూలయితే ప్రశ్నలు అడుగుతున్నట్టు కాదు, కడిగేస్తున్నట్టుగా ఉంటాయి… అదో తరహా…
Ads
సో, కరణ్ థాపర్‌తో నిత్యసంబంధాలున్నాయి కాబట్టి, కరణ్ థాపర్ ‘రా’ మనిషి కాబట్టి రవూఫ్ హసన్ దేశద్రోహి అని తేల్చేసింది అక్కడి అధికారగణం… ఇదెవరో కాదు, సాక్షాత్తూ కరణ్ థాపరే చెప్పుకుంటున్నాడు… సాక్షిలో ఈరోజు వచ్చిన ఎడిట్ వ్యాసం కూడా అదే…
నేను ఐఎస్ఐకి ఆ దేశవ్యతిరేకిగా కనిపిస్తే సరే, రవూఫ్‌ను ద్రోహిగా ముద్ర వేయడానికి నన్ను ఈ కేసులోకి లాగుతున్నారు సరే… కానీ పోయి పోయి నన్ను మోడీకి, ‘రా’కు సన్నిహితుడినని ముద్ర వేస్తున్నారు, అదే నాకు నచ్చడం లేదు అన్నట్టుగా ఆ వ్యాసం సాగింది… (ఆయన ఇంటర్వ్యూల్లాగే ఈ వ్యాసం అనువాదం కూడా అత్యంత గందరగోళంగా ఉంది…)
అక్కడి అధికారగణం చెప్పినదాన్ని పట్టుకుని అక్కడి యూట్యూబర్లు, మీడియా, ఆ దేశ సమాచార మంత్రి కూడా నన్ను ‘రా’ మోడీ సన్నిహితుడినని ముద్ర వేసేశారు… (చూశారా, నన్ను వీళ్లంతా మీ మనిషిని అని ముద్రవేస్తున్నారు, కాస్త గుర్తుంచుకొండి అని మోడీకి, రా’కు చెబుతున్నట్టుగా కూడా కనిపించింది ఈ వ్యాసరచన… నిజమైనా, కాకపోయినా…)
పనిలోపనిగా తనే చెప్పుకుంటున్నాడు… నేను చాలాసార్లు పాకిస్థాన్ వెళ్తుంటాను, నా మిత్రులు బోలెడుమంది, అక్కడి కీలక ప్రభుత్వ, పార్టీ నేతలెందరినో ఇంటర్వ్యూలు చేశాను… అది మరిచిపోయినట్టుంది ఐఎస్ఐ… కేవలం ఓ భారతీయ జర్నలిస్టుతో తెహ్రీక్ పార్టీ ప్రతినిధి మెయిళ్ల ద్వారా టచ్‌లో ఉండటమే దేశద్రోహమైనట్టుగా చిత్రీకరిస్తున్నారు అంటున్నాడు కరణ్ థాపర్…
నేను తెహ్రీక్ పార్టీ ప్రతినిధి రవూఫ్‌తో సాగించిన అత్యంత సాధారణమైన వాట్సప్ చాట్స్, సరళమైన మెయిళ్లు ఇప్పుడు అక్కడ ఒకరిని దేశద్రోహిగా ముద్రవేయడానికి కారణమయ్యాయి… దీనికన్నా గతంలో నేను ఇమ్రాన్ ఖాన్‌ను ఇంటర్వ్యూలు చేశాను కదా, ఆ కారణంతో నన్ను నిందించినా పోయేది అంటున్నాడు కరణ్ థాపర్… నిజానికి నాకు రవూఫ్ అసలు ముఖ పరిచయమే లేదని ముక్తాయించాడు… వాళ్లు ఏదో కేసు పెట్టి లోపలేయాలని నిర్ణయించి, ఏవో తోచిన నేరారోపణలు చేశారు, అదక్కడ సహజం… మరి, ఇదంతా ఇండియన్స్‌కు ఎందుకు కావాలని ప్రత్యేకంగా చెబుతున్నట్టు కరణ్ థాపర్ జీ…!? పాకిస్థాన్ అట్లుంటది మరి అని చెప్పడమా..? ఇదుగో నేను ఇదీ అని చాటడమా..?
Share this Article