Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’

November 1, 2025 by M S R

.

“కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో కుటుంబ పాలన తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు… ఆయన ‘మావోయిస్టు సిద్ధాంతమే మా సిద్ధాంతం’ అన్న మాటలు కేవలం ప్రచార నాటకమే అయ్యాయి… ప్రస్తుతం సీఎం రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది… అయితే మావోయిస్టులను రేవంత్ సోదరులతో పోల్చారు…’’

……… ఇదీ మొన్న డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయిన మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పిన మాట… ఆసక్తికరం… ఇది మావోయిస్టు పార్టీలో కేసీయార్ పట్ల, రేవంత్ పాలన పట్ల ఉన్న అభిప్రాయం… సాధారణంగా జనాభిప్రాయాన్నే మావోయిస్టు పార్టీ చెబుతూ ఉంటుంది… చంద్రన్న ఒక్క మాటలో కేసీయార్ పాలన గురించి తేల్చిపారేశాడు…

Ads

.

తన మాటలు కొన్ని ఆలోచనాత్మకంగా అనిపించాయి… నిజానికి ఇంతకుముందు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు సోను, ఆశన్నలకూ ఈ చంద్రన్న లొంగుబాటుకూ నడుమ తేడా ఉంది… పూర్వరంగం ఓసారి పరిశీలిస్తే…

తెలంగాణ పోలీసుల ఎఫర్ట్ వల్ల నక్సలైట్ల ఉనికి దాదాపు తెలంగాణలో శూన్యం.., కానీ మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ నక్సల్ ప్రభావిత ప్రాంతాలు తెలంగాణ సరిహద్దుల్లో ఉండటంతో… అలర్టుగా ఉండకతప్పదు… ఐతే మావోయిస్టుల్లో రీసెంట్ సాయుధ పోరాట విరమణ ప్రతిపాదనలు, చర్చలు, అభిప్రాయ బేధాలతో… ఆ రెండు రాష్ట్రాల పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులు కూడా లొంగుబాట్ల మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు…

నిజానికి మావోయిస్టు కేంద్ర కమిటీలో పెత్తనమంతా తెలంగాణ వాళ్లదే… ‘‘రోజులు మారాయ్, అడవుల్లోనే ఉంటే ప్రాణాలతో ఉండరు, లొంగిపొండి, మీ ప్రాణాలకు నాదీ భరోసా, కేసులు కూడా ఎత్తివేస్తాం’’ అని డీజీపీ శివధర్ రెడ్డి హామీలు ఇస్తూ… లొంగుబాట్లకు ఓ సానుకూల వాతావరణం క్రియేట్ చేయగలిగాడు… చంద్రన్న లొంగుబాటు దాని ఫలితమే…

నిజానికి కేసుల ఎత్తివేతలకు సంబంధించి డీజీపీ చెప్పినట్టుగానే… అమిత్ షా కూడా చెబితే అదింకా బెటర్ ఫలితాన్నిస్తుంది… ఆ రాష్ట్రాల్లో ఆయుధాలతో లొంగిపోవాలని, వీలైనంతమందితో సామూహికంగా లొంగిపోవాలని షరతులు పెడుతున్నారు… తెలంగాణ పోలీసులు ఆ ఒత్తిడి కూడా పెట్టడం లేదు…

చంద్రన్న కూడా లొంగిన ఇతర కేంద్ర కమిటీ సభ్యుల్లాగా… పోరాటం సమాప్తం అనే ప్రకటనలు ఏమీ ఇవ్వడం లేదు… నా ఆరోగ్యం బాగా లేదు, అందుకే బయటికి వచ్చాను, ఆయుధాల్ని అప్పగించే వచ్చాను అంటున్నాడు…

స్పష్టంగా చెబుతున్నాడు… సోనూ వంటి నేతలతో తనకు విభేదాలున్నాయని… అది కనిపిస్తూనే ఉంది… ఆయుధాలు పట్టుకుని మూకుమ్మడిగా లొంగిపోవడాన్ని సమర్థించను అంటున్నాడు… అది తన వ్యక్తిగత అభిప్రాయం… సోను, ఆశన్నల వాదన, సమర్థనలు వేరు… ఐనా పీఎల్‌జీఏ నేతల మనుగడే సంక్షోభంలో ఉన్నప్పుడు ఆయుధాలదేముంది..? ప్రభుత్వం వద్దకు ఆపరేషన్ కగార్ ఆ ఆయుధాలను తీసుకొస్తుంది…

“హిడ్మా లాంటి నేతలు కూడా శాంతి చర్చలకు వ్యతిరేకం కారు… సరైన పద్ధతిలో ప్రభుత్వం ముందుకొస్తే మేము కూడా చర్చలకు సిద్ధమే..,” అంటున్నాడు తను… అఫ్‌కోర్స్, ఒకసారి జనజీవన స్రవంతిలో కలిశాక ఈ మాటలకు పెద్దగా విలువ ఉండదు… ‘‘ప్రజల ఆలోచనలను బుల్లెట్లతో చంపలేరు, ఉద్యమం నిలుస్తుంది’’ వంటి జస్ట్, అలవాటైన పడికట్టు శుష్క ప్రకటనలు…

ఇంకొన్ని మాటలూ కొన్ని సందేహాలను బలపరుస్తున్నాయి… ‘‘“బసవరాజు ఎన్కౌంటర్‌లో కోవర్ట్ ఆపరేషన్ జరిగింది… అదే విధంగా కర్రెగుట్టల ఎటాక్ కూడా ఒక కోవర్ట్ ఆపరేషన్‌గానే జరిగింది..,” అంటున్నాడు… ఇవి ఎవరి మీదకో సందేహాల్ని కేంద్రీకృతం చేస్తున్నాయి… సాయుధ పోరాట విరమణకు కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందనే మాటల్నీ చంద్రన్న కొట్టిపడేస్తున్నాడు…

‘‘2024లో పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది… అందులో ఆయుధాలు వీడాలా అనే అంశంపై చర్చ జరిగింది… గణపతి, తిప్పిరి తిరుపతి, బసవరాజు, సోను – నలుగురూ చర్చిద్దాం అనుకున్నారు… కానీ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు… బసవరాజు నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం తప్పు..’’ అన్నాడు… త్వరలో సెక్రెటరీగా తిప్పిరి తిరుపతి నియామకం ఉంటుందనీ చెప్పుకొచ్చాడు…

రీసెంటుగా కొన్ని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి… హిడ్మా లొంగిపోబోతున్నాడు అని… తన అనుకూల సాయుధ బలగంతో పాటు అని..! నిజానికి కేంద్ర కమిటీ  సభ్యులకే రక్షణ లేదు ఇప్పుడు… పార్టీలో చీలిక దృష్ట్యా ఎవరూ వారి నీడలనూ నమ్మలేని దుస్థితి… ఏమో… హిడ్మా మాత్రమే కాదు, గణపతీ లొంగిపోవచ్చు… రోజులు అస్సలు బాగాలేవు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘కేసీయార్‌వి ప్రచార నాటకాలు- రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా కాదు’’
  • మొన్నటి అమ్మాయిల విజయం వెనుక ఓ అలుపెరుగని గురువు..!!
  • ఓ సుదీర్ఘ వీక్షణం… ఆ పాత వైబ్స్ లేవు, ఆ గూస్ బంప్స్ లేవు…
  • అదే రవితేజ… అదే మొనాటనీ… అదే యాక్షన్… అదే ‘మాస్ జాతర’…
  • నిన్న అమ్మాయిల గెలుపు హోరు… నేడు అబ్బాయిల పేలవ ఆటతీరు…
  • కొన్ని ఉద్వేగపు కన్నీళ్లకు పేర్లుండవ్… అవి అనుభవైక వేద్యమే…
  • మరో వెలుగుబంటి… కాదు, వాడి తాత…! గుట్ట ఈఈకి గుట్టలుగా ఆస్తులు..!!
  • లంచస్వామ్యం…! లంచం చుట్టూ, లంచం కోసం, లంచం చేత…!!
  • మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్… మరో మాట లేకుండా చప్పట్లు కొట్టేయడమే…
  • ది గ్రేట్ సైబర్ రాబరీ..! కుంభస్థలాన్నే కొట్టారు హ్యాక్ దొంగలు..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions