ఓ ప్రముఖ జర్నలిస్టు కరణ్ థాపర్ రాహుల్ గాంధీ అపరిపక్వ నాయకలక్షణాలపై రాసిన వ్యాసం గురించి చదివాం కదా… మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ కేసీయార్ మీద చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చకు దారితీస్తోంది… నిజానికి ఆయన మోడీ అనుకూల జర్నలిస్టేమీ కాదు… కొద్దోగొప్పో యాంటీ మోడీ కూడా…! సో, తన వ్యాఖ్యలకు సంబంధించి తనపై ‘మోడీ మనిషి’ అనే ముద్ర వేయాల్సిన అవసరం కూడా ఏమీ లేదు…
మోడీ వర్సెస్ ఆల్ అనే అంశంపై ఓ బ్రాడ్ కాస్ట్‌లో ఆయన ఇగో ఫ్యాక్టర్ మీద మాట్లాడుతూ కేసీయార్ మీద ఈ కామెంట్స్ చేశాడు… 2024లో ప్రతిపక్ష కూటమికి తనను నాయకుడిగా నియమిస్తే, ప్రతిపక్షాల మొత్తం ప్రచారవ్యయాన్ని తాను భరిస్తానని కేసీయార్ ఆఫర్ ఇచ్చాడనేది రాజ్‌దీప్ వ్యాఖ్య…
ఇక్కడ రాజ్‌దీప్ వ్యాఖ్యలు ఏ ఉద్దేశంతో చేయబడినవీ అనేది వదిలేస్తే… ఏ కాంటెక్స్ట్‌లో అన్నాడో వదిలేస్తే… వెంటనే ఓ భావన ప్రచారమవుతుంది… మొత్తం దేశంలోని అన్ని ప్రతిపక్షాల ప్రచారవ్యయం భరించడానికి కేసీయార్ ముందుకొచ్చాడంటే తెలంగాణ సమాజం నుంచి ఎంత సంపాదించి ఉంటాడు..? ఈ ప్రశ్న విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది… అసలే ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీయార్ బిడ్డ కూరుకుపోగా, కేసీయార్ అవినీతి మీద బీజేపీ తెలంగాణలో రోజూ ఆరోపణలు సంధిస్తున్నవేళ… ఈ ప్రతిపక్ష కూటమి ప్రచార వ్యయం బయటికి రావడం కేసీయార్‌కు ఒకింత ఇరకాటపు వ్యవహారమే…
Ads
ఇక్కడ ఓ సంగతి గమనించాలి… బీజేపీకి కేసీయార్ మీద కోపం రావడానికి కారణం ఏమిటి..? ఎందుకు బీఆర్ఎస్-బీజేపీ నడుమ ఉప్పునిప్పు ఫైటింగ్ స్టార్టయింది..? కేవలం తెలంగాణలో అధికారం కోసమేనా..? కాదు..! గత ఎన్నికల్లో కేసీయార్ పలు యాంటీమోడీ పార్టీలకు ఆర్థికసాయం చేశాడు… అదీ బీజేపీ కోప కారణాల్లో ఒకటి… ఎవరెవరికి ఎంత డబ్బు, ఎవరి ద్వారా పంపించబడిందో బీజేపీ హైకమాండ్‌కు తెలుసట… ఆమధ్య ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఏదో ఎడిటోరియల్ వ్యాసంలో ఇదే రాసినట్టు గుర్తు…
ఛట్, ఎవరో జర్నలిస్టులు ఏదో రాస్తే అదే నిజమా అనేది ప్రశ్న… కానీ బీఆర్ఎస్‌గా పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో గాయిగత్తర లేపాలని కేసీయార్ చేసే ప్రయత్నాల్లో ప్రస్తుతానికి ధనబలం, ధనప్రభావమే కనిపిస్తోంది… కొన్నాళ్లు రాకేష్ తికాయత్ కేసీయార్ వెంట తిరిగాడు… తరువాత గాయబ్… కొన్నాళ్లు ప్రకాష్ రాజ్, ఇంకొన్నాళ్లు ప్రశాంత్ కిషోర్… కొన్నాళ్లు మెయింటెయిన్ చేసి వదిలేశాడు కేసీయార్… ఇంకొన్ని ఉదాహరణల్నీ చెబుతుంటాయి ఢిల్లీ సర్కిళ్లు…
రాజకీయాలకు ధనం దన్ను అవసరమే ఈరోజుల్లో, కానీ ధనమే రాజకీయాల్ని నడపలేదు… ఈ విషయం కేసీయార్‌కు అందరికన్నా బాగా తెలుసు… సో, ఇదంతా ఆలోచిస్తే మొత్తం యాంటీ మోడీ ప్రతిపక్ష కూటమికి ప్రచారవ్యయం పెట్టడానికి కేసీయార్ సిద్ధపడి, ఓపెన్ ఆఫర్ ఇచ్చాడని రాజ్‌దీప్ చెబుతున్న దాంట్లో పాయింట్ ఉందనిపిస్తుంది… ఇవన్నీ తెలిశాకే మోడీ కేసీయార్ మీద కత్తులు, కారాలు, మిరియాలు నూరుతున్నాడా..?!
Share this Article