పార్ధసారధి పోట్లూరి …. ‘’నా అనుభవంలో నేను చూసింది ఏమిటంటే, ఎప్పుడు తీవ్ర ఆర్ధిక నేరాలు జరిగినా సిబిఐ మరియు ED రంగ ప్రవేశం చేస్తాయి, కానీ ఆలస్యంగా ! ఇక దర్యాప్తు ఏళ్ల కొద్దీ జరుగుతుంది ! మీరు చెప్పండి, ఎన్ని ఆర్ధిక నేరాల విషయంలో సరైన, అర్థవంతమైన ముగింపు [Logical end] జరిగింది ?” … గురువారం రోజున సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్న ఇది…
ఒడిశాకు చెందిన పినాకపాణి మొహంతి ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారు సుప్రీం కోర్టులో… ఒడిశాతోపాటు పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సాం రాష్ట్రాలలో మొత్తం 10 వేల కోట్ల రూపాయల చిట్ ఫండ్ మోసం జరిగింది. బాధితులు మధ్యతరగతి మరియు దిగువ మధ్యతరగతి ప్రజలు. 10 వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఆవిరి అయిపోయింది. 2010 నుండి 2014 మధ్య జరిగిన ఈ చిట్ ఫండ్ కుంభకోణం మీద ఇంతవరకు సరయిన దర్యాప్తు జరగలేదు… ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు బెంచ్ కి చెందిన జస్టిస్ M.R. షా, జస్టిస్ C.T. రవి కుమార్ పైన పేర్కొన్న వ్యాఖ్యలు చేశారు.
ఈ భారీ చిట్ ఫండ్ కుంభకోణం జరిగిన తరువాత ఒడిశా, పశ్చిమ బెంగాల్, త్రిపుర, అస్సోంలు కలిసి విచారణ కమిషన్ ఏర్పాటు చేశాయి. ఈ కమిషన్ కి 25 లక్షల మంది తాము ఎంత మొత్తంలో డబ్బు నష్టపోయామో తెలుపుతూ, తిరిగి మా సొమ్ము మాకు ఇప్పించండి అంటూ అభ్యర్ధనలు చేశారు.
Ads
పొంజీ స్కీమ్ అనేది పెద్ద స్కామ్ !
అక్టోబర్ 10, 2022 లో సుప్రీం కోర్ట్ ఒడిశా ప్రభుత్వంతో పాటు సిబిఐకి నోటీసులు ఇచ్చింది పినాకపాణి మొహంతి పిల్ మీద. మొహంతి తరపున సుప్రీం కోర్ట్ సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు. నవంబర్ 14, 2022 న ఆయన అభ్యర్ధన మేరకు సుప్రీం కోర్ట్ గౌరవ్ అగర్వాల్ ను ‘అమికస్ క్యూరీ‘గా నియమించింది. అంటే పొంజీ స్కీమ్ స్కామ్ కేసు విషయంలో ఆయన సుప్రీం కోర్టుకి సహకరిస్తారు…
ఈ విచారణ సందర్భంగా జస్టిస్ షా అభిప్రాయాలు, వ్యాఖ్యలు, ప్రశ్నలు చాలా సీరియస్ అంశాలే… చదవదగ్గవి… ‘‘సిబిఐ డైరెక్టర్‌కు సమయం లేదా ? 25 లక్షల మంది ప్రజలు మోసపోయారు. ఇది అత్యంత ముఖ్యమయిన కేసు, దీనిని మొదటి ప్రయారిటీ గా భావించి వేగంగా దర్యాప్తు చేయాలి. వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. మొత్తం 10 సంస్థలకి ఈ మోసంలో భాగం ఉంది. పేద ప్రజల బాధ మీకు అవసరం అని అనిపించడం లేదా ? సిబిఐ దర్యాప్తు చేపట్టిన తరువాత ఎంత మొత్తం మోసం చేసిన సంస్థల నుండి రాబట్టి బాధితులకి ఇచ్చారు ? మీరు కోర్టుకి ఈ విషయం తెలపాలి.
స్కీమ్ ఏమిటని కాదు, మేము అడుగుతున్నది బాధితుల సొమ్ము ఎంత రికవరీ చేసి తిరిగి ఇచ్చారు అని ? ఆ డబ్బు పేద ప్రజలది. బాధితులు 10, 20, 30 సంవత్సరాలు వేచి చూడాలని మేం అనుకోవడం లేదు. మోసం చేసిన సంస్థల యజమానులు ప్రస్తుతం జైల్లో ఉండవచ్చు కానీ వాళ్ళు జైల్లో ఉంటూనే బాధితుల సొమ్ము కోర్టులో కేసు వాదించుకోవడానికి వాడుకుంటున్నారు. రేపో మాపో బెయిల్ కూడా వస్తుంది. దర్జాగా, లీగల్ గా ప్రజల సొమ్ముతో కాలం గడుపుతూ ఉంటారు, కానీ మీరు 10 ఏళ్లు అయినా శిక్ష పడ తగ్గ ఆధారాలు కోర్టుకి సమర్పించరు. ఇలా ఎంత కాలం ప్రజలు మోసపోతూ ఉంటారు ?
మాకు తెలుసు, సిబిఐలో సంస్థాగత సిబ్బంది ఉండరు. అందరూ వివిధ డిపార్ట్మెంట్ల నుండి డిప్యుటేషన్ మీద వచ్చి సిబిఐలో పనిచేస్తూ ఉంటారు. మీకు తగినంత సిబ్బంది ఉండరు. డిప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళలో చాలా వరకు ఎక్సైజ్, కస్టమ్స్ శాఖలకి చెందిన వారే ఉంటారు. కానీ వాళ్ళకి ఇలాంటి నేరాల మీద, వాటిని ఎలా దర్యాప్తు చేయాలో అవగాహన ఉండదు. నేను అడ్వొకేట్ గా ఉన్న సమయంలో సిబిఐ తరపున పనిచేసిన అనుభవం ఉంది. నేను 5 ½ సంవత్సరాలు సిబిఐ తరపున అడ్వొకేట్ గా చేశాను. ప్రతిసారీ రిప్లై ఫైల్ చేయాల్సి ఉంటుంది. ప్రతి విషయం సిబిఐ డైరెక్టర్ కి తెలియచేయాల్సి ఉంటుంది. చిన్న చిన్న విషయాలని కూడా డైరెక్టర్ కి తెలియాల్సి ఉంటుంది. ఇది చాలా తీవ్ర జాప్యానికి దారి తీస్తుంది.
మీరు సిబిఐ పని చేసే సిస్టమ్ మార్చాల్సి ఉంటుంది. మీరు చెప్పండి ఎన్ని ఆర్ధిక నేరాల కేసులలో నిందితులకి శిక్షలు పడ్డాయి ఇంతవరకు ?మీరు తరువాత వాయిదా ఎప్పుడో మాకు సూచిస్తారా ? ఇది చెల్లదు! శనివారంకల్లా అమికస్ క్యూరీకి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది మీరు. పేద ప్రజల కష్టార్జితం మీద మీకు కాస్తంత కూడా కనికరం లేదా? సోమవారం మేము విచారణ కొనసాగిస్తాము. వాయిదాలు అడిగితే ఇవ్వము. వాయిదాల మీద వాయిదాలు వేయవద్దు.
ఇలాంటి తీవ్ర ఆర్ధిక నేరాల కేసులలో మేము ఎప్పుడూ తెలుసుకోవాలి అనుకొనేదేమంటే… మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోతున్నది అని ! చాలా కేసులలో డబ్బు టాక్స్ హెవెన్ దేశాలకి వెళుతున్నది. ఇక నిందితుడు ఏ లండన్ కో లేదా ఆమెరికాకో వెళ్ళిపోతాడు. ప్రజల సొమ్ముతో లండన్ కోర్టులలో నిందితుడిని లండన్ నుండి తిరిగి తీసుకురావడానికి కోట్లు ఖర్చు పెడుతున్నారు. లండన్ లో కింది కోర్టు, ఆ తరువాత అప్పీలేట్ కోర్టు, ఇలా సమయం వృధా అవుతూ వస్తున్నది. మేము ఫలానా A, B, C పేర్లని ఉదహరించడం లేదు. ప్రజల కష్టార్జితం విలువని లెక్క గడుతున్నాము. మేము మీరు తరచూ చెప్పే కారణాలు ఒప్పుకోము.. మాకు రిజల్ట్ కావాలి….’’
Share this Article