రాజకీయ నాయకుల పాదయాత్రలు ఇప్పుడు కామన్… చిన్న చిన్న లీడర్లు కూడా పాదయాత్రలు ప్లాన్ చేసి, నడిచేస్తున్నారు… రాహుల్ గాంధీ కూడా ఓ సుదీర్ఘ యాత్ర ప్రారంభించేశాడు… భారత్ జోడో యాత్ర దాని పేరు… నిజానికి ఎప్పుడో జరగాల్సిన యాత్ర ఇది… 3570 కిలోమీటర్లు… కన్యాకుమారి నుంచి కాశ్మీరం దాకా… 5 నెలలు… 12 రాష్ట్రాలు…
ఓ పెద్ద ప్రశ్న… తనకు ఎఐసీసీ అధ్యక్ష పదవి వద్దంటాడు… కానీ కాంగ్రెస్ నిర్ణయాలన్నీ తనవే… హైకమాండ్ అంటే తనే… నెహ్రూ కుటుంబ వారసుడిగా తనను తాను అంగీకరిస్తున్నాడా లేదా..? లేదంటే మరి ఈ పాదయాత్ర దేనికి..? ఏ హోదాలో..? అవునంటే… మరి ఇన్నాళ్లూ అధ్యక్ష పదవిని ఎందుకు వద్దంటున్నావు..? రాహుల్ గాంధీని ఓ ‘అపరిచితుడు’లా భావించాలా..? ఈ పాదయాత్ర ద్వారా తనకు తానే స్పష్టంగా చెబుతున్నాడు… కాంగ్రెస్ అంటే నేనే… కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబమే అని… సరే, ఇదంతా ఒక చర్చ…
నిజంగా ఈ పాదయాత్రలతో ఫాయిదా ఎంత..? నాయకుడికి ప్రచారం మాత్రమేనా..? వాస్తవంగానే నాయకుడికి ఫీల్డ్‌లో ప్రజల అవస్థలు అర్థమవుతాయా..? వ్యక్తిగతంగా ఎక్స్‌పోజర్ వస్తుందా..? గోధుమపిండిని లీటర్లలో కాకుండా కిలోల్లో అమ్ముతారని తెలుస్తుందా..? బియ్యం అంటే ఫ్యాక్టరీ ఉత్పత్తి కాదని, పొలంలో పండే వరిధాన్యం నుంచి బియ్యం వస్తుందనే అవగాహన కలుగుతుందా..? నిజంగా ప్రజల అవస్థలు, భిన్న ప్రాంతాల పరిచయం కావడానికి ఈ పాదయాత్ర ఉపయోగమేనా..? నానాటికీ కొడిగడుతున్న కాంగ్రెస్ దీపానికి ఈ పాదయాత్ర కాస్త చమురు పోస్తుందా..? సీనియర్ల పీడ పూర్తిగా విరగడ అయిపోతుందా..?
Ads
సరే, అదంతా పెద్ద చర్చ… దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ బలపడాలి… బలమైన ప్రతిపక్షంగా నిలవాలి… అది దేశ అవసరం… అధ్యక్షుడిగా రాహుల్ ఉంటాడా..? మరొకరు ఉంటారా..? అది వేరే చర్చ… ప్రాంతీయ పార్టీలన్నీ అతుకుల బొంత సర్కారును ఏర్పాటు చేస్తే, ఆ దరిద్రం ఎలా ఉంటుందో మనం గతంలో చూశాం… సో, బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే… అధికార, ప్రతిపక్ష స్థానాల్లో ఉండాలి… రాహుల్ ప్రసంగాల కంటెంటు మీద బీజేపీ ఏమైనా మాట్లాడొచ్చు, కానీ పాదయాత్రనే వ్యతిరేకించడం, వెటకారం చేయడం రాజకీయ మూర్ఖత్వం…
ఇక పాదయాత్ర సంగతికొద్దాం… ఓ నాయకుడు, వెనుక పది మంది అనుచరులు, అక్కడక్కడా ఆగుతూ, సేద తీరుతూ, కనిపించిన ప్రజలతో మాటామంతీ నిర్వహిస్తూ సాగే అల్లాటప్పా పాదయాత్రలు కావివి… ఇది చాలా పెద్ద టాస్క్… చోటామోటా లీడర్ల పాదయాత్రలకే కోట్ల ఖర్చు… ఆ ఏర్పాట్లు ఓ ప్లాన్డ్ ఆపరేషన్… అలాంటప్పుడు మరి రాహుల్ గాంధీ పాదయాత్ర బాహుబలి టైపే కదా… తప్పదు…
తనకు ఎస్పీజీ ప్రొటెక్షన్ తీసేసినా సరే, ఇప్పటికీ అత్యున్నత జెడ్ ప్లస్ సెక్యూరిటీ… తనకు తోడుగా 118 మంది లీడర్లు… వండిపెట్టడానికి, ఏర్పాట్లు చూడటానికి, ఇతర అవసరాలకు బోలెడు మంది సిబ్బంది… వాటి మీద ఓ కన్నేద్దాం…
పాదయాత్ర రూట్‌లో ముందే ఓ టీం వెళ్లి, విడిదికి అనువైన స్థలం వెతికి, పెద్ద పెద్ద డేరాలు వేసి, అప్పటికప్పుడు అన్నీ సమకూర్చి, మళ్లీ తెల్లారగానే అవన్నీ సర్ది, మరోచోటకు ప్రయాణించడం పెద్ద టాస్క్… అందుకని రాహుల్ పాదయాత్ర టీం తెలివైన పని చేసింది… కంటైనర్ల యాత్రగా మార్చింది… మొత్తం 59 కంటైనర్లు… అన్నీ ట్రక్కులపై బిగించబడి ఉంటాయి… అవన్నీ ఎక్కడ ఆగితే అక్కడ 59 ఇళ్ల ఊరు వెలుస్తుంది… టెంట్లయితే గాలిదుమారాలు, భారీవర్షాలతో తీవ్ర ఇబ్బంది… కంటైనర్లు సరైన ఎంపిక…
ప్రతి కంటైనర్‌కూ కోడ్ ఉంటుంది… అందులో ఎవరు ఉండాలి, ఎన్ని బెడ్లు ఉన్నాయనే అంశాలను బట్టి వర్గీకరించారు వీటిని… ఏసీలు, ఆధునిక సౌకర్యాలు ఉంటాయి కంటైనర్లలో… ఉత్త ఇనుప డబ్బాలు అనుకోవద్దు సుమా… ఒక్క ముక్కలో చెప్పాలంటే టీవీ, సినిమా పర్సనాలిటీలు ఎడాపెడా వాడేస్తున్న క్యారవాన్ల టైపే ఇవి… ఒక కంటైనర్ పూర్తిగా కాన్ఫరెన్స్ హాల్… అంటే ప్రతి కంటైనర్‌ను అవసరానికి తగినట్టు ఎలా మార్చారో అర్థం చేసుకోవచ్చు…
నంబర్ వన్ లేబుల్ ఉందంటే అది రాహుల్ ప్రత్యేకం… దాన్ని యెల్లో జోన్‌లో నిలబెడతారు… బెడ్, అటాచ్డ్ బాత్రూం ఎట్సెట్రా అన్నీ ఉంటాయి… తన సెక్యూరిటీ నంబర్ 2 కంటైనర్‌లో ఉంటారు… రాహుల్ వ్యక్తిగత సిబ్బంది అలంకార్ సవాయ్, కేబీ బైజు కంటైనర్ నంబర్ 4లో ఉంటారు…
ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షించే పార్టీ కార్యదర్శి వంశీచంద్, మరో ప్రధాన కార్యదర్శి కంటైనర్ నంబర్ 3లో… బ్లూజోన్ కంటైనర్లు ఇంకాస్త భిన్నం… అలాంటిదే కంటైనర్ నంబర్ 5లో జైరాంరమేష్ కూడా ఉంటాడు… రెండు లోయర్ బెర్తులు, రెండు అప్పర్ బెర్తులు ఉండే పింక్ జోన్ కంటైనర్లను లేడీస్‌కు కేటాయించారు… కాస్త స్టోరేజీ స్పేస్, అటాచ్డ్ వాష్‌రూమ్స్ ఉంటాయి… వంట, ఇతర పనులు చేసే హౌజ్ కీపింగ్ సిబ్బంది కోసం రెడ్, ఆరెంజ్ జోన్ కంటైనర్లు ఉన్నయ్… వాటిల్లో టాయిలెట్స్ ఉండవు…
వాళ్ల కోసం కొన్ని కంటైనర్లను కామన్ వాష్‌రూమ్స్‌గా మార్చారు… టీ అనే అక్షరం రాసి ఉంటుంది వాటిపైన… ఎవరైనా సరే కంటైనర్లలో తినొద్దు, బయట ఫుడ్ తీసుకురావద్దు… కామన్ ఏరియాలో, అక్కడ వండిపెట్టింది తినాలి… మద్యసేవనం నిషిద్ధం… మంచి నిర్ణయమే… ఇక్కడ ఖర్చు అనేది ఇష్యూ కాదు… సరైన ప్లానింగ్… రాజకుమారుడి 5 నెలల దేశపర్యటన అంటే మామూలు విషయం కాదు కదా మరి…!!
Share this Article