KN Murthy………… హీరో అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప- 2 లో గంగమ్మ జాతర నేపధ్యాన్ని వాడుకున్నారు. ఈ జాతర సందర్భంగా మగవాళ్ళు ఆడవాళ్ళ వేషంలో .. ఆడవారు మగాళ్ల వేషాల్లో తిరుగుతారు. అల్లు అర్జున్ గెటప్ అలాంటిదే. బూతులు తిట్టుకునే ఈ జాతర గురించి చాలామంది విని ఉండరు . కొత్త వాళ్లకు ఇది చిత్రంగా ఉండొచ్చు. కానీ రాయలసీమ వాసులకు ఈ జాతర గురించి బాగా తెలుసు.
తిరుపతి ఈనాడు , ఆంధ్ర జ్యోతి పత్రికల్లో నేను పని చేస్తున్నపుడు ఈ జాతరలో చాలాసార్లు పాల్గొన్నాను. ఈ జాతర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో జరుగుతుంది. బూతులు తిట్టుకున్నా ఎవరి మనసూ చివుక్కుమనదు. పైగా పులకించిపోతుంది. అంతేనా.. కొత్త పాత తేడా లేకుండా చీపుర్లు, చాటలతో కొట్టుకుంటూ మురిసిపోతారు. ఆడాళ్లు మగాళ్లుగానూ.. పురుషులు స్త్రీలుగానూ వేషాలేసుకొని జంబలకిడి పంబ అంటూ సరదాగా తిరుగుతారు.
ఏటా ఎండాకాలంలో వ్యవసాయ పనులన్ని ముగిసి పంటలన్నీ ఇండ్లకు చేరిన తర్వాత ఈ జాతర చేసుకుంటారు. గంగమ్మ పుట్టిన తాతయ్యకుంటలో జాతర జరిగే రోజుల్లో సాయంత్రం ఏడుగంటల తరువాత గ్రామంలో రెండు తరాలుగా బ్రతుకుతున్న కుటుంబాల వారెవరూ గ్రామ పొలిమేర దాటరు. ఏదైనా అత్యవసరమైన పనిమీద వెళ్లినా సాయంత్రానికి తిరిగి వచ్చేస్తారు.
Ads
వారం రోజుల పాటు ఆ కుటుంబాలవారు ఎలాంటి శుభకార్యాలూ చేయరు. వారు చేసేదల్లా వయసుతో నిమిత్తం లేకుండా వర్ణం, కులంతో పనిలేకుండా అందరూ బండ వేషాలేసుకుని బండబూతులు తిట్టుకోవడమే. ఇది వినడానికి సరదాగానే ఉన్నా దీని వెనుక ఓ కధ వుంది.
ప్రజలంటే బానిసలుగా, మహిళలంటే వాడుకునే వస్తువుగా భావించి పెట్రేగిపోతున్న ఓ పాలేగాడిపై వీరోచితపోరాటం సాగించిన ఓ మహిళ విజయగాధ ఈ జాతర వెనుక దాగి ఉంది. ఆ పాలేగాడి కబంధ హస్తాల నుంచి ప్రజలకు విముక్తిని ప్రసాదించిన వీరవనితను స్మరిస్తూ ఈ జాతర చేసుకుంటారు. అందుకే వందల సంవత్సరాలు కావస్తున్నా నేటికీ ఈ సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. ఆ మహిళ గ్రామదేవతగా పూజలందుకుంటోంది. ఆమే తిరుపతి గంగమ్మ.
వందల సంవత్సరాల క్రితం తిరుపతి పాలేగాండ్ల ఆధీనంలో ఉండేది. పాలేగాడి కన్నుపడితే ఏ మహిళయినా అతనికి దాసోహం కావాల్సిందే. అలాంటి తరుణంలో పాలేగాడిపై తిరగబడి చంపిన వీరవనిత గంగమ్మ. రోజుకో మారు వేషం వేసుకుని గాలించి ఆ పాలెగాడిని పట్టుకుని గంగమ్మ సంహరించింది. గంగమ్మ పేరుతో జరిగే ఈ జాతర రాయలసీమలో ప్రసిద్ధి. జాతరంటే కొత్త బట్టలు వేసుకొని గుడికెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడం చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒంటి నిండా రంగులు పూసుకుని వేపాకు చేతబట్టి బూతులు తిట్టే సాంప్రదాయం చూస్తాం.
బూతులు పలకడం వెనుక ఎంతో చరిత్ర ఉంది. సాంప్రదాయంలో దీనికి ఎంతో ప్రాధాన్యత ఉందట. ఒకప్పుడు గ్రామానికే పరిమితమైన ఈ జాతరకు ఇతర ప్రాంతాల నుంచి కూడా వేల మంది భక్తులు వస్తారు. జాతర ప్రధాన ఘట్టం రోజున లక్ష మంది వరకు హాజరవుతారు. తిరుపతి నగరంలోని కైకాల కులానికి చెందిన వారు చాటింపు చేయడంతో జాతర ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి ఏడు రోజుల పాటు గ్రామంలోని వారు బయటకు వెళ్ళకూడదని, బయటివారు గ్రామంలోకి రాకూడదని చాటింపు చేస్తారు.
గ్రామంలోని మహిళల మానప్రాణాలను కాపాడిన గంగమ్మ తల్లి గ్రామాన్ని కాపాడుతుందన్న విశ్వాసంతో ఈ జాతర నిర్వహిస్తున్నారు. గతంతో పోలిస్తే బూతులు తిట్టుకోవడం కొంత తగ్గింది. జాతర మాత్రం హుషారుగానే పెద్ద ఎత్తున జరుగుతుంది. గంగమ్మతల్లి తిరుమల శ్రీవారి చెల్లెలని ప్రతీతి. అందుకే ఏటా జాతర సమయంలో టీటీడీ నుంచి గంగమ్మకు సారె అందుతుంది.
జాతర నాలుగోరోజున శ్రీవారి ప్రతినిధులుగా అధికారులు, అర్చకులు కలిసి పసుపు కుంకుమలూ శేషవస్త్రాలూ గంప, చేటల్లో మంగళద్రవ్యాలను మేళతాళాలతో తీసుకొచ్చి పుట్టింటి సారెగా అందజేస్తారు. 2020 లో లాక్ డౌన్ కారణంగా ఈ జాతర జరగలేదు. అమ్మకు పూజలు జరిగేయి. 91 లో రాజీవ్ గాంధీ హత్య జరిగినపుడు కూడా జాతర పూర్తిగా జరగలేదు…
Share this Article