ఓ ఇంట్రస్టింగు తీర్పు… డిబేటబుల్ కూడా… ఎందుకంటే..? కొంతకాలంగా చాలామంది జంటలు పెళ్లి తంతు అవసరం లేకుండా, సహజీవనం చేస్తున్నారు… కలిసి ఉన్నంతవరకూ వోకే… ఒకరికొకరు తోడుగా, భరోసాగా, ఆసరాగా, అన్యోన్యంగా ఉంటే సమాజానికి ఏ అభ్యంతరం ఉండదు… పైగా ఆమధ్య సుప్రీంకోర్టు ఏదో దీనికి సానుకూల తీర్పు కూడా ఇచ్చినట్టు గుర్తు…
కానీ… కొన్నాళ్లకు ఆ సహజీవనం విఫలమై, వాళ్లిద్దరికీ పొసగక… విడిపోయే పరిస్థితి వస్తే..? ఇది పెద్ద ప్రశ్న… ఈ ప్రశ్న అనేకానేక నైతిక, సామాజిక, చట్టపరమైన సందేహాలకు తావిస్తోంది కూడా… వాళ్లకు పిల్లలుంటే వాళ్లేమైపోవాలి.,.? పెద్దల ఆస్తుల సంగతేమిటి..? పిల్లలకు కూడా సరైన కుటుంబం అనేది ఓ హక్కు కాదా..? చట్టబద్ధమైన తంతులో పెళ్లి జరిగి ఉంటే, రికార్డయి ఉంటే విడాకుల తరువాత భరణం, మెయింటెనెన్స్, విడిపోవడానికి కూడా ఓ పద్ధతి ఉంటాయి…
మరి సహజీవనంలో..? పెళ్లి అనే తంతే జరగదు కాబట్టి, విడాకులు అనే ప్రశ్నే ఉండదు కదా… మీకు గుర్తుందా..? ఆమధ్య బెంగాల్ ఎంపీ ఒకావిడ టర్కీలో డెస్టినేషన్ మ్యారేజీ చేసుకుంది, కొన్నాళ్లకే తన వివాహబంధం మీద విరక్తి వచ్చి, అతన్ని విడిచిపెట్టేసింది… అసలు టర్కీలో జరిగిన పెళ్లికి మన దేశంలో చట్టబద్ధత ఏముంటుంది, సో, విడాకులు కూడా అక్కర్లేదు అనేసింది… నిజమే కదా, కోర్టులు ఇంకేం అనగలవు..? పైగా మతాలవారీగా, కులాల వారీగా, ప్రాంతాల వారీగా కూడా పెళ్లి తంతులో, చట్టాల్లో తేడాలు సరేసరి…
Ads
సో, సహజీవనానికి ఇండియా వంటి విశిష్ట సంప్రదాయ – సాంస్కృతిక వాతావరణంలో చిక్కులే ఎక్కువ… ఎస్, అలహాబాద్ హైకోర్టు కూడా అదే చెప్పింది తాజాగా… సహ జీవన సంబంధాలను (లివిన్ రిలేషన్‌షిప్) నెరపడానికి ఇండియా పాశ్చాత్య దేశమేం కాదని, భారత దేశ సంప్రదాయాలు, సంస్కృతిని ప్రజలు గౌరవించాల్సిందేనని న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అహ్మద్ పేర్కొన్నారు…
తనతో సహ జీవనం చేస్తున్న 29 ఏళ్ల మహిళను ఆమె కుటుంబం బలవంతంగా నిర్బంధించిందని ఆరోపిస్తూ 32 ఏళ్ల ఆశిష్ కుమార్ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశంలో మనం జీవించడం లేదని గుర్తుంచుకోవాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి హితవు పలికారు… సంస్కృతి, సంప్రదాయాలు భారత దేశానికి కిరీటం లాంటివని, వాటిని గౌరవించాలని సూచించారు…
సమాజంలో సదరు మహిళ, ఆమె కుటుంబం పరువును తీసే దురుద్దేశంతో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని జస్టిస్ షమీమ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు… మహిళ కుటుంబంపై ఒత్తిడిని పెంచి, అవమాన భయానికి గురి చేసి, రాజీని కుదుర్చుకునేందుకే ఈ పిటిషన్ దాఖలు చేసినట్లుగా అనిపిస్తోందన్నారు… ఇతరుల పరువు, ప్రతిష్ఠలు తీసే ఇలాంటి పిటిషన్‌ను కోర్టు సమర్ధించబోదని స్పష్టం చేశారు… హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టి వేయడంతో పాటు పిటిషనర్‌పై రూ. 25 వేల జరిమానా కూడా విధించారు…
సరే, ఇక్కడ కేసు స్వభావం కూడా డిఫరెంట్… కానీ మరోసారి సహజీవనానికి ఉన్న చిక్కులనే కాదు… సామాజిక ఆమోదం, చట్టపరమైన ఆమోదం కూడా సమస్యలే… మేం ఇష్టపడ్డాం, మాఅంతట మేముంటాం, సమాజంతో మాకు పనిలేదు అనడానికి వీల్లేదు… మనిషి సంఘజీవి… మనిషి వ్యవహారశైలికి సంఘం ఆమోదం కూడా అవసరం… అందుకే అంతా బాగున్నన్ని రోజులు సహజీవనం పర్లేదు, ఇదుగో ఇలాంటి చిక్కులు ఎదురైతే ఏమిటి..? ఈ తీర్పు మరోసారి ఈ ప్రశ్నను లేవనెత్తింది… అందుకే తీర్పు ఇంట్రస్టింగు అని వ్యాఖ్యానించింది…
మరి ఇతర దేశాల్లో ఏమిటీ అంటారా..? సహజీవనం సాధారణంగా కనిపించే దేశాల్లో మనిషికి సోషల్ సెక్యూరిటీ లెవల్స్ చాలా ఎక్కువ… ఒంటరిగా బతకడానికి కూడా సొసైటీ అండ ఉంటుంది… మరి మన దేశంలో..? పిల్లలుండి, భర్త వదిలేసిన ఆడదాని పరిస్థితేమిటి..? సొంతంగా ఉపాధి పొందే అవకాశాల్లేకపోతే మరేమిటి..? లీగల్ సపోర్ట్ ఎలా..?
Share this Article