Narendra G……..  మర్రిమాను క్రింద చిన్నచెట్లు మొలవవు.. మల్కాజ్‌గిరి రాజకీయాల్లో మైనంపల్లి హనుమంత్ రావుది ఏకఛత్రాధిపత్యం. స్వయంగా ప్రజలకు దగ్గర మనిషి, పైగా అధికార పార్టీలో రాడికల్ లీడర్. అందుకే మల్కాజ్‌గిరిలో మైనంపల్లి ఓ మర్రిమానులా ఎదిగిపోయారు. పెద్దమర్రి కింద చిన్న చెట్లు నిలబడవు అన్నట్టు అతని ధాటికి వేరొక లీడర్ బలంగా ఎదగలేకపోయారు.

ఇప్పుడు కొడుకుకి మెదక్ టికెట్ రాలేదన్న కారణంతో, మంత్రి హరీష్ రావుతో ఏర్పడిన కోల్డ్ వార్‌తో మైనంపల్లి బీఆర్ఎస్ పార్టీ నుంచి వైదొలిగారు. దీంతో మల్కాజ్‌గిరి ఎవరి సొంతం కానుందనే ఆసక్తి మొదలైంది. పార్టీలో ఉన్నప్పుడు ఎంత ఎదగడానికి అవకాశం ఉంటే అంత ఎదగనిచ్చే కేసీఆర్.. పార్టీని వీడి వెళ్ళినవాళ్ళని, బయటికి నెట్టినవాళ్ళని ఏ విధంగా డమ్మీలను చేసే ప్రయత్నాలు చేస్తారో అందరికీ తెలిసిందే.

హుజూరాబాద్ ఎన్నికల సమయంలో బిజేపిలో చేరడంతో ఆ పార్టీ క్యాడర్ చేసిన విశేష యుద్ధంతో ఈటల రాజేందర్ కేసీఆర్ వ్యూహాలని ఛేదించగలిగారు. హుజూరాబాద్ ఫలితాల తర్వాత ఈటల బిజేపి పార్టీ ఫాలోవర్ల గురించి ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు కూడా! అది ఒక్కటే బీఆర్ఎస్ చేయిదాటిపోయిన నియోజకవర్గం. అంతకుముందు జరిగిన నాగార్జునసాగర్ ఎన్నికలలో, ఆ తర్వాత జరిగిన మునుగోడు ఎన్నికలలో ఏ విధంగా కేసీఅర్ గెలిపించుకున్నారో జగద్విదితం..

మల్కాజ్‌గిరి ఓవైపు హుజూరాబాద్, మరోవైపు మునుగోడు తరహా సెంటిమెంట్లను ప్రదర్శిస్తుంది. తనకు అన్యాయం జరిగింది‌‌.. తన కొడుకుకి టికెట్ ఇవ్వలేదనే కోపంతో, హరీష్ రావ్, మైనంపల్లిలకు జరిగిన వివాదంతో అతను బయటికి వచ్చాడు. ఇప్పుడు రాబోయేది బై ఎలక్షన్ కాకుండా.. రెగ్యులర్ ఎన్నికలే కాబట్డి ఇమేజ్ గేమ్‌కి పెద్దగా ఆస్కారం ఉండదు. ఇన్నేళ్ళూ మైనంపల్లికి అండగా నిలిచిన మల్కాజ్‌గిరి ప్రజలు ఇప్పుడు అతనికి అండగా ఉంటారా అనేది ఓ పెద్ద ప్రశ్న‌. పార్టీకి రాజీనామా చేయడం హనుమంత్ రావు గారి వ్యక్తిగత నిర్ణయం కాబట్టి ప్రజల్లో సింపతీ ఏర్పడుతుందా లేదా అనేది ప్రస్తుతం క్వషన్ మార్క్.

రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్డీ పై నెలకొన్న వ్యతిరేకత, అనిశ్చితి మల్కాజ్‌గిరిలో అంతగా కనిపించదు. మైనంపల్లి ఇక్కడ ప్రజల ఫేవరెట్ కనుక పార్టీకి కూడా ఢోకా లేకుండా ఉంది‌. డబల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు కమిషన్, ట్రాఫిక్ సమస్యలు వంటి సమస్యలు పార్టీకి మైనస్‌. కానీ ప్రజలకు మైనంపల్లి హనుమంత్ రావు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటంతో.. పై సమస్యలేవీ పెద్దగా అతని వ్యక్తిగత ఇమేజీ మీద పనిచేయలేదు. ఆ కారణంతో వచ్చే ఎన్నికలలో మైనంపల్లి గెలుస్తారా అంటే.. మునుగోడు ఫలితాలను ఓసారి జ్ఞప్తికి తెచ్చుకోవాల్సి వస్తుంది. దశాబ్దాల కాలంగా జిల్లాను కాపాడుకుంటూ వచ్చిన కోమటిరెడ్డి సోదరుల్లో ఒకరు.. మునుగోడు ఉప ఎన్నికలో ఓడిపోయారు‌. రాష్ట్ర ప్రభుత్వాన్ని బెంబేలెత్తించిన బిజేపి క్యాడర్.. మునుగోడులో చతికిలపడిపోయింది.

మునుగోడులో గెలుపుకోసం కేసీఆర్ స్వయంగా ఓ డజన్ స్ట్రేటజీలు వేశారు. హుజూరాబాద్ లో జరిగిన తప్పు మునుగోడులో జరగకూడదని.. దాదాపు మూడు వేల మంది ప్రజాప్రతినిధులను వార్డ్‌కి పదిమంది చొప్పున కేటాయించి.. ఆరెస్సెస్ తరహా స్ట్రేటజీతో ఆ ఎన్నికను సొంతం చేసుకున్నారు‌.అది బై ఎలక్షన్ కాబట్టి రాష్ట్రం మొత్తాన్ని తీసుకొచ్చాడు పెద్దాయన అనుకుందాం.. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ ఖచ్చితంగా గెలిచే.. గెలిపించుకోవాలి అనుకున్న ఓ నలభై నియోజకవర్గాల్లో మల్కాజ్‌గిరి కూడా ఉంది.

అది ఇవాల్టివరకూ పార్టీలో కొనసాగిన మైనంపల్లి మీద గౌరవమో లేక నమ్మకమో అయి ఉండేది. ఇవాళ కొడుకుపై ప్రీతితో హనుమంత్ రావు.. ప్రభుత్వానికి ఎదురెళ్ళే సంకల్పానికి పూనుకున్నారు. ఈ ప్రాంతంపై పట్టుకోసం ఆ ఇరువురూ సమవుజ్జీలుగా వెళ్తారనే అనిపిస్తోంది. అలా జరిగితే మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ ఎవరైనా సరే.. జరిగే పోటీ మాత్రం కేసీఆర్ హనుమంత్ రావుల నడుమే అనిపిస్తుంది.

మల్కాజ్‌గిరిలో ఇప్పటివరకూ ఉన్న ఆశావహులలో బిజేపి లీడర్లు శ్రవణ్ యురవల్లి, ఆకుల రాజేందర్, ఎన్ రామచందర్ రావు.. కాంగ్రెస్ నేతలు నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్‌లో మర్రి రాజశేఖర్ రెడ్డిలు ఉన్నారు‌. వీళ్ళు మైనంపల్లికి సమవుజ్జీలుగా మారడానికి ఉన్న సమయం సరిపోతుందా అంటే అనుమానమే..!

వచ్చే ఎన్నికలలో జరిగేది ఇమేజ్ వార్. నియోజకవర్గాల్లో పార్టీ జెండాలకు ఉండే బలం.. లేదా నేతలకు స్థానికంగా ఉండే ఇమేజీలు మాత్రమే గెలిపిస్తాయి. మరి మల్కాజ్‌గిరిలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే! #Malkajgiri BRS Party KCR Harish Rao Thanneeru Mynampally Hanumanth Rao