.
ఇది మొన్నటి వార్త… నిజానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ముఖ్యమైన వార్తే… కానీ పెద్దగా డిస్కషన్ జరిగినట్టు కనిపించలేదు… మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు ఎందుకో మరి…
హైకోర్టులో ఒక పిల్ (ప్రజాప్రయోజన వ్యాజ్యం) దాఖలైంది… పుష్ప-2 లాభాలను చిన్న బడ్జెట్ చిత్రాల రాయితీలకు, జానపద కళాకారుల పింఛన్లకు వినియోగించాలని న్యాయవాది నరసింహారావు ఆ పిల్ వేశాడు…
Ads
బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు వల్ల ఆ సినిమాకు అపరిమిత లాభాలు వచ్చాయనీ, హోం శాఖ ప్రత్యేక అనుమతులు ఇచ్చిందనీ, కానీ ఆ షోలు, రేట్ల పెంపు కారణాలు మాత్రం చెప్పలేదని తన పిల్ సారాంశం…
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం చిత్రాల లాభాలను కళాకారుల సంక్షేమానికి వినియోగించాలని తన వాదన… ఆ షోలు, రేట్ల పెంపు అయిపోయాయి కదా అని జడ్జి అడిగితే వచ్చిన లాభాల గురించే వ్యాజ్యం వేసినట్టు ఆ న్యాయవాది పేర్కొన్నాడు… సరే, ఆ సుప్రీంకోర్టు తీర్పు కాపీ సబ్మిట్ చేయాల్సిందిగా చెప్పి కేసు వాయిదా వేశారు… అంటే పిల్ విచారణకు స్వీకరించినట్టే కదా… ఇదీ ఈనాడులో వచ్చిన వార్త లింకు…
ఒక స్థూల కోణంలో న్యాయవాది లేవనెత్తిన పాయింట్స్ విలువైనవే… అయితే కొన్ని సందేహాలు… (జస్ట్, ఓ అకడమిక్ డిస్కషన్‌లాగా…) సినిమా నిర్మాణం అనేది పక్కా వ్యాపారం… కళాసేవ, సామాజిక బాధ్యత అనేవి ప్రస్తుత ఇండస్ట్రీలో జీరో… బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు కూడా అడ్డగోలు లాభాల్ని దండుకోవడం కోసమే…
ప్రభుత్వాలు గుడ్డిగా అనుమతులిస్తున్నాయి… కానీ తప్పు ప్రభుత్వానిదా..? లేక నిర్మాతదా..? తన పెట్టుబడి, తన లాభం అంటాడేమో నిర్మాత… కళాకారుల పింఛన్లు, చిన్న బడ్జెట్ చిత్రాల రాయితీలు అనేవి ప్రభుత్వ బాధ్యత, నాకేం సంబంధం అంటాడు రేపు… తన వసూళ్లపై జీఎస్టీ, ఆదాయపు పన్ను కూడా కడుతున్నట్టు కూడా చెబుతాడు… అంటే లీగల్ అని చెప్పడానికి…
కానీ సుప్రీం కోర్టు ఏ కేసులో ఈ తీర్పు చెప్పిందనే క్లారిటీ కావాలి… పైగా బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు సమయానికి ఆ తీర్పు వచ్చిందా..? ఐనా ఒక్క పుష్ప-2 సినిమా లాభాల్నే ఎందుకు పంచాలి…? ఇలాంటి పలు సందేహాలు వస్తాయి…
ఐతే సుప్రీంకోర్టు తీర్పు గనుక ఈ పిల్‌కు అనుగుణంగా ఉన్నట్టయితే సీరియస్ విచారణ ఖాయం… మాకు నిర్మాణ వ్యయం పెరిగింది, రేట్లు పెంచుకుంటాం అనేది నిర్మాతల వాదన ఎప్పుడైనా… ఐతే ఈ ప్రత్యేక షోలు, రేట్ల పెంపు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు ఆయా సినిమాల నిర్మాణ వ్యయాల్ని ఎవరు ఆడిట్ చేసి, నిర్ధారిస్తున్నారనే కీలక ప్రశ్న ముందుకు వస్తుంది…
ఎవరెంత పారితోషికాలు తీసుకున్నారో (వైట్) నిర్మాతలు బహిరంగం చేస్తారా..? అసలు నిర్మాణ వ్యయాల లెక్కల విశ్వసనీయత ఎంత..? ఆర్టిస్టులు ఆ పారితోషికాలు తమ పన్ను రిటర్నులలో చూపిస్తున్నారా..? ఇదుగో ఇన్ని ప్రశ్నలు తెర మీదకు వస్తాయి… ఎస్, ఈ పిల్ ఓ డిబేట్‌కు దారితీస్తే మంచిదే… కానీ అదే జరగడం లేదు ప్రస్తుతానికి..!!
Share this Article