.
నిన్నటి ఏపీ ప్రభుత్వ ప్రకటన ఒకటి బాగా నచ్చింది… ప్రభుత్వం ఏ పార్టీదైతేనేం… గత ఏడాది జూన్ నుంచి ఈ నెల 15 వరకు ఏపీలో ప్రభుత్వ హాస్పిటళ్లు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు 3027 ప్రాణాల్ని కాపాడాయి… అదీ అత్యవసరమైన ఓ ఇంజక్షన్‌ను ఉచితంగా అందుబాటులో ఉంచడం ద్వారా..!
అదేమిటో వివరంగా చెప్పుకోవాలంటే..? గుండెనొప్పి వచ్చిన వారికి మొదటి గంటను గోల్డెన్ అవర్‌గా పరిగణిస్తారు తెలుసు కదా… ఆ సమయంలో సరైన వైద్యసాయం అందితేనే బతుకు… కానీ గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోట్లు వస్తే ఎలా..? లక్షణాలు తెలిసి, మంచి వైద్యం దొరికే చోటుకు చేరాలంటే సమయం కావాలి… కానీ ఆలోపు ప్రాణాలకు ప్రమాదం…
Ads
సో, ఏపీ ప్రభుత్వం 238 ప్రభుత్వ సామాజిక(CHC), ప్రాంతీయ(AH), జిల్లా ఆసుపత్రుల్లో(DH) ‘స్టెమీ’ (ST-segment elevation myocardial infraction) విధానం ప్రవేశపెట్టింది… అంటే ఖరీదైన ‘టెనెక్టెప్లస్’ ఇంజెక్షన్ ఉచితంగా ఇవ్వడం… ఛాతీనొప్పి లక్షణాలతో ఆసుపత్రులకు వచ్చిన వారిలో ‘టెనెక్టె ప్లేస్’ ఇంజక్షన్ అవసరమని గుర్తించిన 3,155 మందిలో 3,027 (95.94%) మంది ప్రాణాలు నిలబడ్డాయి…
ఎన్సీడీ-4.0 సర్వేలో భాగంగా స్టెమీ విధానం అమలుపై ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం.ల ద్వారా ఛాతీనొప్పి లక్షణాలు ఎలా గుర్తించాలన్న దానిపై శిక్షణ కూడా ఇవ్వబోతున్నారు… గుడ్…
ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ ఇంజక్షన్ ధర రూ. 40,000 నుంచి 45,000 వరకు ఉంది… ఇతర ఖర్చులు అదనం… ప్రభుత్వం ఒక్కొక్క ఇంజెక్షన్ కు రూ.19,000 ప్లస్ ఇతర మందుల కోసం రూ. 6,000 ఖర్చుపెడుతోంది… ప్రతి సీహెచ్సీలో 3, ఏరియా ఆసుపత్రిలో 4, జిల్లా ఆసుపత్రిలో 5 చొప్పున ఈ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచుతున్నారు…
స్టెమీ చికిత్స కింద ప్రతి నెలా సగటున 175 మంది ప్రభుత్వాసుపత్రుల్లో టెనెక్ట్ ప్లేస్ ఇంజెక్షన్ పొందుతున్నారు… అత్యధికంగా అనంతపురం జిల్లాలో 617 మందికి స్టెమీ చికిత్స లభించింది… గుంతకల్లు ఏరియా ఆసుపత్రిలో ఈ సంఖ్య 124 వరకు ఉంది…
అసలు ఏమిటీ టెనెక్టెప్లేస్ (Tenecteplase) ఇంజక్షన్..?
-
టెనెక్టెప్లేస్ అనేది ఒక ఫైబ్రినోలైటిక్ (లేదా త్రోంబోలైటిక్) ఔషధం… దీన్నే క్లాట్-బస్టింగ్ డ్రగ్ అని కూడా అంటారు…
-
గుండెపోటు అనేది సాధారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులలో (కరోనరీ ఆర్టరీస్) రక్తం గడ్డకట్టడం (బ్లడ్ క్లాట్) వలన ఏర్పడుతుంది…
-
ఈ ఇంజక్షన్, ఆ రక్తం గడ్డకట్టిన భాగాన్ని కరిగించి, మూసుకుపోయిన ధమనిలో రక్త ప్రసరణను త్వరగా పునరుద్ధరించడానికి సహాయపడుతుంది…
గోల్డెన్ అవర్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి?
-
గుండెపోటు లక్షణాలు ప్రారంభమైన మొదటి గంటను వైద్యపరంగా “గోల్డెన్ అవర్” అంటారు.
-
ఈ సమయంలో చికిత్స అందించడం అనేది అత్యంత కీలకం, ఎందుకంటే…
-
కండరాల రక్షణ: రక్తం గడ్డకట్టడం వల్ల ఆగిపోయిన రక్త సరఫరాను ఎంత త్వరగా పునరుద్ధరిస్తే, గుండె కండరాల (మైయోకార్డియం) నష్టం అంత తక్కువగా ఉంటుంది…
-
మెరుగైన ఫలితం: గోల్డెన్ అవర్‌లో చికిత్స మొదలుపెడితే, మరణాల రేటు, గుండె వైఫల్యం (Heart Failure) వంటి తీవ్రమైన సమస్యల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది…
-
టెనెక్టెప్లేస్ ఎలా పనిచేస్తుంది?
-
టెనెక్టెప్లేస్‌ను సాధారణంగా శరీర బరువుకు అనుగుణంగా కేవలం ఒకే బోలస్ ఇంజక్షన్ (సింగిల్ ఫాస్ట్ ఇంజక్షన్) గా ఇస్తారు… దీనివల్ల సమయం ఆదా అవుతుంది, చికిత్సను త్వరగా మొదలుపెట్టవచ్చు…
-
ఇది నేరుగా గడ్డకట్టిన రక్తంపై పనిచేసి, గడ్డను త్వరగా కరిగిస్తుంది…
-
ఇది రక్త ప్రసరణను వీలైనంత త్వరగా (రీఫర్ఫ్యూజన్) తిరిగి ప్రారంభిస్తుంది, తద్వారా గుండె కండరాలకు ప్రాణవాయువు (Oxygen) మరియు పోషకాలు అందుతాయి…
ముఖ్యమైన ప్రోటోకాల్ (Pharma-Invasive Strategy)
గుండెపోటు చికిత్సలో, PHCలు, ఇతర చిన్న కేంద్రాలు అనుసరించే విధానాన్ని “ఫార్మా-ఇన్వాసివ్ స్ట్రాటజీ” అంటారు…
-
గుండెపోటు వచ్చిన రోగిని పెద్ద ఆసుపత్రికి త్వరగా తరలించడం (Transfer) వీలు కాని సమయంలో, శిక్షణ పొందిన వైద్యులు ఉన్న కొన్ని ఎంపిక చేసిన సామాజిక ఆరోగ్య కేంద్రాలలో (CHCs – Community Health Centres) టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ అందుబాటులో ఉండవచ్చు…
-
అక్కడ ఇంజక్షన్ ఇచ్చి, వెంటనే రోగిని యాంజియోప్లాస్టీ (Angioplasty) సౌకర్యం ఉన్న ఉన్నత కేంద్రానికి తరలించడం జరుగుతుంది…
Share this Article