అసలే ఒకప్పటి బోల్డ్ బాంబ్ షకీలా… పక్కన మరో బోల్డ్ డాన్సర్ అనూరాధ.,. అప్పుడప్పుడూ నాలుక అదుపు తప్పే ఆలీ… ఇలాంటివే ఇష్టపడే ఈటీవీ… ఇంకేముంది..? ఏమిటీ స్టార్టింగ్ ట్రబులా..? బండి స్టార్ట్ కాకపోతే వంచి, పడుకోబెట్టి, మళ్లీ కొడతారు తెలుసు కదా…? అంటూ తిక్కతిక్క పంచులు వేశాడు ఆలీ… సింపుల్‌గా షకీలా… ఐనా సరే, నేను రెడీ అనేసేసరికి, అంతటి ఆలీ నోటి వెంట మళ్లీ మాట రాలేదు… రాబోయే ఆలీతో సరదాగా ఎపిసోడ్ ప్రోమోలో కనిపించింది… అఫ్ కోర్స్, ప్రొమోల్లో ఉండేది వేరు, అసలు ఎపిసోడ్లలో ఉండేది వేరు కాబట్టి… అక్కడ రియల్ సంభాషణ ఏమిటనేది వదిలేద్దాం… షకీలా ఒక్కదాన్నే ఈ చిట్‌చాట్‌లో ఉంచితే బాగుండేది, అనూరాధతో జాయింటుగా అవసరం లేదు… కావాలంటే అనూరాధతో వేరే ఎపిసోడ్ ప్లాన్ చేయాల్సింది…
షకీలా బోల్డ్… ఇక్కడ బోల్డ్ అంటే భోళా అని..! చిన్నప్పుడే తల్లి ద్వారా ఆ వృత్తిలోకి నెట్టబడి, అందరూ మోసగించి, టాప్ స్టార్‌గా మస్తు సంపాదించీ, ఇప్పుడు ఏమీ లేని స్థితిలో మిగిలిపోయింది… చాలామంది చాలా ఇంటర్వ్యూలు చేశారు… ఇంకా ఆలీ ఆమెతో కొత్త విషయాలు ఏం చెప్పించగలడో చూద్దాం కానీ… కొన్ని అంశాల్లో ఆమె చెప్పిన స్ట్రెయిట్ జవాబులు, వేసిన కొన్ని ప్రశ్నలు ఆలోచనల్ని రేపేవే… ఆమె కడుపులో ఉన్నది చెప్పేస్తుంది… దాపరికాలు, నర్మగర్భ మాటలు గట్రా ఏమీ ఉండవ్… అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం గురించి, బోలెడు మంది బాయ్ ఫ్రెండ్స్ యవ్వారాల్నీ ఏమీ దాచుకోలేదు… ఆలీ నోరు ఊరుకోదు కదా… ఓహో, హోెటల్ దగ్గర క్యూలు ఉండేవా అని ఓ పిచ్చికూతకు కూడా దిగాడు…
Ads
సిల్క్ స్మిత అంటే తనకు ఇష్టం లేదని కుండబద్ధలు కొట్టేసి, డర్టీ పిక్చర్ గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు ఆమె… స్మిత ఈమెను పొగరుతో కొట్టేది… కానీ మహానటి సావిత్రి విషయంలో షకీలా వెలిబుచ్చిన ధర్మసందేహం మాత్రం మన ఆలోచనల్ని కూడా కాస్త కుదిపేసేవే… ‘‘ఆమె ఎన్నో దానాలు చేసింది, అడిగితే చాలు ఏదైనా ఇచ్చేసేది, కానీ చివరకు ఎలా చచ్చిపోయింది… ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో… ఆమె ధర్మం, ఆమె పుణ్యం ఏం ఆదుకున్నాయి…?’’ ఇదీ ఆమె ప్రశ్న… ఉండొచ్చు, తాత్వికంగా దీనికి బోలెడన్ని సమాధానాలు ఉండొచ్చుగాక… ఈ జన్మ పుణ్యం వచ్చే జన్మకు బదిలీ అవుతుంది, ఫలితం ఆశించని దానాలే సత్కర్మఫలాన్ని ఇచ్చి, విముక్తిపథం వైపు నడిపిస్తాయి వంటి సమర్థనలో, శుష్కవేదాంతాలో వినిపించవచ్చుగాక… కానీ ఒకసారి స్థూలంగా పరికిస్తే, షకీలా ప్రశ్న నిజమే కదా అనిపిస్తుంది… జీవితమంతా బోలెడు దానాలు చేసి, ఎందరినో ఆదుకుని, తనకుతాను మునిగిపోయి, కాలిపోయి సంపాదించుకున్న అంతులేని పుణ్యం ఆమెకు ఈ జీవితంలో ఎందుకు ఉపయోగపడలేదు..? బహుశా షకీలా కూడా అలాగే చాలా నష్టపోయి ఉంది కాబట్టి, ఈ ప్రశ్న ఆమెలో తరచూ తొలిచేస్తూ ఉండవచ్చు… ఎంత సంపాదిస్తేనేం..? ఎందరి కడుపులు నింపితేనేం..? చివరకు నేనెందుకు ఇలా మిగిలిపోయాను అనే ఆమె ఆవేదన అప్పుడప్పుడూ ఇలా బయటికి తన్నుకొస్తున్నదేమో…! నిజమేనా… మన పాపం, మన పుణ్యం ఈ లైఫులో ఫలితాన్ని చూపిస్తాయీ అనే మాట అబ్సర్డేనా..?!
Share this Article