నిన్న లగడపాటి రాజగోపాల్ శ్రీమతి జానకి ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకున్న ఓ వీడియో, ఓ పోస్ట్ ఇంట్రస్టింగుగా అనిపించింది… అందులో ఆమె ఆకు గానీ, విస్తరి గానీ, ప్లేటు గానీ లేకుండా… తను నేల పైనే కూర్చుని.., ఉత్త నేల మీదే వడ్డన చేసిన ఆహారాన్ని భోంచేస్తోంది… మన తెలుగు జనానికి కొత్తగా అనిపించవచ్చుగాక… కానీ తమిళనాడులో.., కేరళ, కర్నాటకల్లోని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని గుళ్ల దగ్గర చాలాకాలంగా ఉన్న ఆచారం ఇది… దేవుడికి మరింత సరెండర్ కావడం… సేమ్, నిలువు దోపిడీ ఇవ్వడం, గుండు చేయించుకోవడం వంటిదే… చాలామందికి ఈ మొక్కు అలవాటు కూడా..! జానకి మణిపాల్‌లో తన కూతురు చదువు, పెళ్లి గుర్తుచేసుకుంటూ కాస్త ఎమోషనల్ పోస్టు పెట్టింది… ఉడుపిలోని శ్రీకృష్ణుడు, మూడ్‌బిద్రి ఆంజనేయుడి దయ తన పిల్లలపై ఉందని రాస్తూ ఈ వీడియోను జతచేసింది… ఈ మొక్కు పేరు మన్ సొరు…
నిజానికి చాలాకాలంగా ఉన్న పద్ధతే ఇది… కాకపోతే క్రమేపీ తగ్గిపోతోంది… ప్రత్యేకించి గుళ్లలో దర్శనానంతరం ప్రసాదంగా మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడతారు కదా… చాలామంది ప్లేట్లను కాదని ఫ్లోర్ పైనే తింటుంటారు… అన్నం, అందులోకి సాంబార్ లేదా రసం, కాస్త స్వీట్ పొంగల్ లేదా పాయసం… కావాలని దోసిలి పడితే కాస్త మజ్జిగ… గతంలో అయ్యవార్లు తిని లేచిన అరిటాకులపై భక్తులు పొర్లుదండాలు పెట్టడం అనే పద్ధతి ఉండేది, కర్నాటక ప్రభుత్వం ఓ చట్టం తీసుకొచ్చి ఇలాంటివన్నీ డిస్కరేజ్ చేస్తోంది… సో, ఈ మన్ సోరు కూడా కర్నాటకలో తగ్గిపోయింది… తమిళనాట ఇంకా అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది… తెలంగాణ ఉద్యమంలో వంటావార్పు అని ఉధృతంగా ఓ కార్యక్రమాన్ని చేపట్టేవాళ్లు కదా… రోడ్డు మీదే వండాలి, తినాలి… సామూహికంగా…! తమిళనాట మన్ సోరు కూడా అలా చేపడుతుంటారు…
Ads
ఈ ఫోటో చూశారు కదా… ఈమె పేరు ప్రేమలత, డీఎండీకే చీఫ్ విజయకాంత్ భార్య… 2017లో రైతులకు మద్దతుగా మన్ సోరులో పాల్గొన్న ఫోటో… ఫ్లోర్ మీదే అన్నాన్ని పరుస్తూ వెళ్తారు… దానిపై సాంబార్ పోస్తారు… వరుసగా కూర్చుని ఉద్యమకారులు తినేయడమే… సంఘటిత ఆందోళనలకు ఓ ప్రేరణగా కూడా మన్ సోరు నిర్వహించడం ఆసక్తికరమే… కాకపోతే ఈ పద్దతి ఎక్కువగా దేవుడికి ఒకరకమైన అర్చన… అన్నట్టు జానకి లగడపాటి వీడియో చూశారా..? ఇదుగో…
ఎల్ఎల్‌బి, ఎల్ఎల్ఎం, ఆక్స్‌పర్డ్‌లో బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో పీజీ డిప్లొమా తదితరాలు చదివిన ఆమెకు దైవభక్తి ఎక్కువ… ప్రత్యేకించి కృష్ణ భక్తురాలు… ఉడుపిలో తన మన్ ఓరు మొక్కును తీర్చుకుంది తాజాగా… ఆమె వీడియో చూడగానే ఈ మన్ ఓరు గురించిన సంగతులు కొన్ని చకచకా గుర్తొచ్చాయి… సరే, ఆ సబ్జెక్టుకు వద్దాం… తమిళనాట గుళ్ల నుంచి ఈ మొక్కులు, ఈ పూజ, ఈ పద్ధతిని బజారుల్లోకి తీసుకొచ్చేశారు ఆల్ రెడీ… ఆ దిగువ ఫోటో చూడండి… హీరో విజయ్ తెలుసు కదా… అప్పట్లో బిజిల్ అనే సినిమా విడుదలకు విఘ్నాలు ఎదురైతే… ఇదుగో అవన్నీ తొలగిపోవాలంటూ ఫ్యాన్స్ నిర్వహించిన మన్ సోరు కార్యక్రమం ఇది…
తమిళనాట వ్యక్తిపూజ మరీ ఎక్కువ… ఆ ఫ్యానిజం తీవ్రత ముందు ఏదీ నిలబడదు… నాయకులు, హీరోలకైతే చెప్పనక్కర్లేదు… వాళ్లకు ఏ సమస్య వచ్చినా సరే ఫ్యాన్స్ బజారుల్లోకి వచ్చేస్తారు… మన్ సోరు పెట్టేస్తారు… ఇంకో ఉదాహరణ కావాలా..? ఇదుగో… అప్పట్లో రజినీకాంత్ ఆరోగ్య సమస్యలు ఎదురుకున్నాడు కదా… అనేక చోట్ల మన్ సోరు నిర్వహించేసి, బోలెడు మంది దేవుళ్లకు మొక్కులు సమర్పించుకున్నారు… దిగువన ఓ ఫోటో ఉంటుంది చూడండి… విజయనగర సామ్రాజ్యంలో వేల మంది సైనికులకు ఇలాగే నున్నటి రాతిబండలపై భోజనాన్ని వడ్డించేవారని ఎక్కడో చదివినట్టు కూడా గుర్తు… రోజూ రెండు పూటలా అంతమందికి అన్ని విస్తళ్లు సాధ్యం కావు కదా… సరే, ఈ ఫ్లోర్ భోజనాలపై చెబుతూ పోతే ఒడవదు, తెగదు… ఇక ముగిద్దాం… (స్టోరీ మీకు నచ్చినట్టయితే దిగువన కోడ్ స్కాన్ చేసి, ముచ్చటకు అండగా నిలవండి… అలాగే చీప్ కామెంట్స్‌కు దూరంగా ఉండండి…)
Share this Article