.
తెలుగు రాష్ట్రాల్లో క్రమేపీ ప్రజలను ఓ భయంకరమైన నిశ్చేష్టత ఆవరిస్తున్నదా..? మన పరిసరాలు, మన సమాజం, మన బాగును కూడా వదిలేసి, జరుగుతున్న ప్రమాద పరిణామాలను కూడా నిశ్శబ్దంగా, విధిలేక, అనివార్యంగా కళ్లప్పగించి చూడాల్సి వస్తోందా…?
‘సాక్షి’లో కర్నూలు నుంచి వచ్చిన ఓ స్టోరీ ఈ భావననే కలిగిస్తోంది… విషయం ఏమిటంటే..? టీజీ గ్రూపు ఓ ప్రమాదకరమైన రసాయనాల్ని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతోంది… అంటే మంత్రి, అదీ పరిశ్రమల మంత్రి టీజీ భరత్ సొంత ఫ్యాక్టరీ…
Ads
నిజానికి పరిశ్రమల మంత్రి బాధ్యతే కాలుష్య కారక పరిశ్రమల్ని అడ్డుకోవడం, రాకుండా చూడటం,.. మరి తనే ఓ అత్యంత ప్రమాదకర ఫ్యాక్టరీని నిర్మించడం ఏమిటి..? ఇదీ ఆందోళనకర అంశం…
సారు టీడీపీ, తండ్రి బీజేపీ… వివరాల్లోకి వెళ్తే… వాళ్లకు ఆల్రెడీ ఓ ఆల్కలీన్ ఫ్యాక్టరీ ఉంది… సాంకేతిక భాషలో గాకుండా కాస్త సరళంగా చెప్పుకోవాలంటే… విస్తరణ ప్రాజెక్టులో ఉత్పత్తుల కోసం ప్రమాదకరమైన రసాయనాల్ని వాడతారు… వాటిని ఆల్రెడీ చాలా దేశాల్లో నిషేధించారు…
ఈ ఫ్యాక్టరీతో ప్రమాదం ఏమిటో 27 మంది శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారనీ, ఐదుగురు సైంటిస్టులు ఓ నివేదిక కూడా ఇచ్చారని సాక్షి స్టోరీ చెబుతోంది… ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది… సాక్షి స్టోరీ సవివరంగా ఉంది…
ఇక్కడ ప్రస్తావనార్హం ఏమిటంటే..? మరి తనే స్వయంగా పరిశ్రమల మంత్రి కదా, ఇక ప్రజాభిప్రాయ సేకరణ జస్ట్ ఓ తంతు మాత్రమే కాబోతుందా అనేది వేరే విషయం… ఇంతటి సీరియస్ సమస్య మీద ఎలాగూ టీడీపీ, బీజేపీ, జనసేన మాట్లాడవు… కూటమి మిత్రధర్మమో మరొకటో చెప్పి నోళ్లు మూసుకుంటాయి…
వైసీపీ స్టాండ్ ఏమిటో, ఏం డిమాండ్లు చేస్తున్నదో పెద్దగా వార్తల్లో కనిపించలేదు… జగన్‌కు ఇంకా విషయ తీవ్రత ఎవరూ చెప్పినట్టు లేరు… తుంగభద్ర, కృష్ణా పరీవాహక ప్రాంతాలు ఆ ప్రమాదకర రసాయనాలతో కలుషితమైతే రెండు రాష్ట్రాల ప్రజలకూ తాగునీరు ప్రమాదమే కదా… తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా సోయి ఉందా..? ఎహె, ఇది ఏపీ సమస్య, మనది కాదులే అనే నిర్లక్ష్యమా..? తేలికతనమా..?
సాక్షిలో అంత పెద్ద స్టోరీ వచ్చాక… అందులో వివరాలు చదువుతుంటే… కావాలని కూటమి ప్రభుత్వం మీదో, మంత్రి మీదో ఉద్దేశపూర్వకంగా రాసినట్టుగా కూడా ఏమీ లేదు… పోనీ, ప్రభుత్వం తరఫున వివరణ వచ్చిందా..? అదీ ఎక్కడా కనిపించలేదు… పోనీ, ఆ సైంటిస్టుల స్టడీ ఫేక్, ఆ రసాయనాలు సేఫ్ అనైనా చెప్పారా..? అదీ లేదు… ఎవరైనా ప్రజోపయోగ పిటిషన్ గనుక వేస్తే ఫలితం ఉంటుందా..? ఎవరు వేయాలి..?
ఏమో, సాక్షి రాసింది కాబట్టి ఖండఖండాలుగా ఖండించాలనే పిచ్చి ధోరణితో ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏమైనా రాసి, మంత్రికి మద్దతుగా నిలుస్తాయో తెలియదు… ఈరోజు ఆ పత్రికల ఏపీ ఎడిషన్లలో మాత్రం ఆ కథలు లేవు…
ప్రజల ఆరోగ్యాలను పణంగా పెట్టే పరిశ్రమలపై జనంలో కూడా ఏ స్పందనా లేదు… అందుకే మొదట్లోనే చెప్పుకున్నది… తెలుగు ప్రజల్లో చైతన్యం కొరవడి, కొడిగట్టి క్రమేపీ… వేగంగానే అసహాయతతో కూడిన ఓ నిశ్చేష్టత వేగంగా ఆవరిస్తున్నట్టుగా ఉందని..!!
Share this Article