ఫోటో చూసి… హబ్బ, ఎక్కడిదీ ఈ ఆవాసం… ఏ దేశంలో..? వెళ్లొస్తే బాగుండు కదా అనుకుంటున్నారా..? ఏ దేశమూ కాదు, మన దేశమే… ఆ రాష్ట్రంలో ఎటువెళ్లినా ఇలాగే రమణీయంగా ఉంటాయి దృశ్యాలు… ఇది మన చిన్న ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటి… పేరు సిక్కిం… చైనా, నేపాల్, భూటాన్ సరిహద్దులు… రక్షణ రీత్యా అత్యంత కీలకప్రాంతం ఇది… కొండలు, గుట్టలు, నదులు, ప్రవాహాలు, ప్రకృతి ఒడిలో జీవనం…
1975… ఏప్రిల్ 9… సిక్కిం పార్లమెంటు రాచరికానికి స్వస్తి పలికి, ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా భారతదేశంలో విలీనం అవుతున్నట్టు ప్రకటించింది… మే 16… సిక్కిం అధికారికంగా భారత దేశంలో ఒక రాష్ట్రంగా విలీనం అయిపోయింది… ఇదీ ఆ రాష్ట్ర ఘనత… (1975 వరకూ అది భారతదేశంలో భాగం కాదు)… (అక్కడి భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల వోట్ల లెక్కింపు నిన్ననే జరిగిపోయింది)…
మరెందుకు ఇది చెప్పుకోవడం అంటే… ఈ ఎన్నికల్లో ఓ అరుదైన విశేషం… నాయకులు, పార్టీల డెస్టినీ ప్రజాగ్రహంతో ఎలా తల్లకిందులవుతాయో చెప్పుకోవడం కోసం ఇది… సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్… చాన్నాళ్లుగా అక్కడ మంచి పట్టున్న పార్టీ… 32 సీట్లలో పోటీ చేస్తే కేవలం ఒకే ఒక సీటు గెలిచింది… బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పత్తాకు లేవు… 32 సీట్లకు గాను సిక్కిం క్రాంతికారీ మోర్చా ఏకంగా 31 సీట్లు గెలుచుకుంది… వాట్ ఏ విక్టరీ… దీన్నే ల్యాండ్ స్లయిడ్ అంటారా..?
Ads
2019 వరకు 25 ఏళ్లపాటు ఆ రాష్ట్రాన్ని పాలించింది సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్… ఈ స్థాయిలో జనం తిరస్కరించడం ఇదే తొలిసారి… 2019తో పోల్చినా ఈ పార్టీ 14 సీట్లను కోల్పోయింది… ఈ పార్టీ ఫౌండర్, 24 ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన పవన్ కుమార్ చామ్లింగ్ తను పోటీచేసిన రెండు స్థానాల్లోనూ ఓడిపోయాడు… అంటే, జనం ఆయన్ని గెటౌట్ ఫ్రమ్ సిక్కిం అన్నట్టే…
1985 నుంచి వరుసగా 8సార్లు ఎమ్మెల్యే… 1994 నుంచి 2019 వరకు అయిదుసార్లు సీఎం… ఐనా సరే, ఈ రేంజ్ ఓటమి అంటే చెప్పుకోదగిన విశేషమే… ఎమ్మెల్యేగా ఇది తనకు తొలి ఓటమి… సిక్కిం శాసనసభలో చామ్లింగ్ అడుగుపెట్టకపోవడం 39 ఏళ్లలో కూడా ఇదే తొలిసారి…
ప్రేమ్ సింగ్ తమాంగ్… ఈయన మొదట్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ సభ్యుడే… చామ్లింగ్ మంత్రివర్గంలో కూడా చేశాడు, ఎందుకో తనతో పడలేదు… దాంతో బయటికి వచ్చి సిక్కిం క్రాంతికార్ మోర్చా అని సొంత పార్టీ పెట్టుకున్నాడు… బీజేపీతో అప్పుడప్పుడూ కలుస్తాడు, అప్పుడే విడిపోతాడు… 2019 నుంచీ సీఎం…
నిజానికి మొదట్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు… తరువాత దానికి రిజైన్ చేసి ఫుల్ టైమ్ పాలిటిక్సులోకి వచ్చేశాడు… సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో శిక్ష పడి, అసెంబ్లీలో అనర్హతకు కూడా గురయ్యాడు… అలాంటిది 2019 నుంచి సీఎం… పైగా ఇప్పుడు క్లీన్ స్వీప్ విక్టరీ… కొడుకు కూడా ఎమ్మెల్యే… ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే… ప్రజలు ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో, ఎప్పుడు తన్నితగలేస్తారో తెలుసుకోవడం ఎవరి తరమూ కాదు… అవినీతి, అనర్హతలు వంటివి అస్సలు పట్టించుకోరు..!!
Share this Article