సరిగ్గా అరవై ఏళ్ల క్రితం… అంటే అప్పట్లో ప్లవ నామ సంవత్సరం ప్రవేశించిన కాలం… అప్పటి ఇష్యూస్, సాహిత్య ధోరణులు, ప్రపంచ స్థితిగతులు ఎలా ఉంటాయో తెలియాలంటే అప్పటి పత్రికలే శరణ్యం… అప్పట్లో పండుగల సందర్భంగా పత్రికలు ప్రత్యేక సంచికల్ని వెలువరించేవి… శ్రద్ధగా తీర్చిదిద్దేవి… ఆ సంచికల్లో తమ కథలో, నాటికలో, వ్యాసాలో రావాలని ప్రముఖ రచయితలు ఆశపడేవారు… అన్ని పత్రికలూ పోటీపడేవి కూడా… ఇప్పుడు నాటి ఆంధ్రపత్రిక ఉగాది ప్రత్యేక సంచిక వాట్సప్ గ్రూపుల్లో బాగా సర్క్యులేట్ అవుతోంది… ప్రజెంట్ పాఠకులకు పెద్దగా ఆసక్తికరం అనిపించకపోవచ్చుగాక… కానీ కాస్త పాత తరానికి ఆసక్తికరంగానే ఉంటుంది… ఇప్పుడు పత్రికల ప్రత్యేక సంచికల్లేవ్… తీసుకొచ్చినా చదివే పాఠకుల్లేరు… అసలు ప్రింటే మానేసి చిన్నాచితకా పత్రికలు వాట్సప్ ఎడిషన్లకు దిగుతుంటే, ఇంకా ప్రత్యేక సంచికలేమిటి..? పెద్ద పత్రికలే సగం ప్రింట్, సగం డిజిటల్ దశకు వచ్చేశాయి కదా… ఫిజికల్ పేపర్ అనేదే సంక్షోభంలో చిక్కుకున్నాక ఈ స్పెషల్ సంచికలేమిటి..? ఆ పాత సంచికను ఓసారి పరిశీలిస్తే…
మూడు పేజీల అవలోకనంతో అప్పటి పరిస్థితుల మంచీచెడూ చర్చించుకుంటూ సంపాదకీయం… అప్పట్లో ఏదో ఇష్యూ తలెత్తి, అసలు రాష్ట్రపతి అధికారాల మీద వాదోపవాదాలు జరిగేవి… దాని మీద ఓ ప్రత్యేక వ్యాసం… నాగార్జునసాగర్ నిర్మాణం వల్ల నాగార్జున కొండ మీది ప్రాచీన పురావస్తు సంపద పరిరక్షణ ఎలా అనే వాదోపవాదాలు జరిగేవి… దాని మీద కూడా మరో ప్రత్యేక వ్యాసం… పాఠ్యపుస్తకాల మీద, అంటే కరెంట్ టాపిక్స్… పండుగ ప్రత్యేక సంచిక అనగానే నాలుగు కవితలు, పది కథలు అచ్చు గుద్దేసి వదిలేయడం కాదు… ఉగాది పచ్చడిలా అన్ని రుచులనూ కలిపేసే సంచికగా తీర్చిదిద్దడం ఆసక్తికరంగా అనిపిస్తుంది… కరెంట్ టాపిక్స్ మాత్రమే కాదు పదేళ్ల సాహిత్య ధోరణుల మీద ఆరుద్ర వ్యాస విశ్లేషణ… అసలు మన కథల్లో సహజత్వం పాలు ఎంత అని మరో వ్యాసం… చారిత్రిక నవలల ప్రామాణికత మీద ఇంకొకటి… ఆ సంవత్సరం ఆర్థిక స్థితి ఎలా ఉండనుందో మరో విశ్లేషణ… ఇలా రకరకాల టాపిక్స్…
Ads
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చలిచీమలు కథ… ఆయన రాసిన చివరి కథ, కాస్త పెద్దదే… మరణానంతరం ప్రచురణ… శ్రీశ్రీ రాసిన చతురస్రం నాటిక, గొల్లపూడి మారుతీరావు రాసిన ఆశయాలకు సంకెళ్లు నాటిక… బాలగంగాధర తిలక్, మధురాంతకం రాజారాం రాసిన కథలు… ప్రముఖుల కవితలు సరేసరి… వెల కూడా కేవలం రెండు రూపాయలే… అప్పట్లో రెండు రూపాయల వెల ఎక్కువే కావచ్చుగాక… కానీ దాని కోసం శ్రమ, దాని విలువకు అది సమంజసమే అనిపిస్తుంది… ఇందులో ఎక్కువగా మద్రాస్ బేస్డ్ ప్రకటనలే కనిపిస్తయ్… అప్పట్లో మన కేంద్ర కార్యస్థానం మద్రాసే కదా మరి… అసలు వాణిజ్య ప్రకటనల ఇండెక్స్ చూస్తే ఎంత ముచ్చటేసిందో… ఇవ్వాళారేపు ఏది ప్రకటనో, ఏది వార్తో కూడా తెలియకుండా పాఠకుల చెవుల్లో పువ్వులు పెట్టడం కూడా ట్రెండ్… ఈ పత్రిక యాడ్స్ చూస్తే అప్పట్లో ప్రధానంగా మార్కెట్ ఏయే సరుకులకు ఉండేదో కూడా అర్థమవుతుంది… ముక్కున పెట్టుకునే నశ్యం ప్రకటన కూడా ఉంది… తెలుగు అంకెలతో కూడిన పంచాంగం… ఆ సంచిక ఇదుగో… Andhra_Patrika_Varshika_1961
Share this Article