‘‘ఇడ్లి 1/-, బజ్జి 1/-….., ఈ రోజు మారేడుమిల్లి వెళ్తూ RB కొత్తూరు, పెద్దాపురం పక్కన ఒక టిఫిన్ సెంటర్ దగ్గర (యజమానిగారి పేరు రాంబాబు) ఆగాం, రుచి అమోఘం, గత 16 సంవత్సరాలుగా ఇడ్లి, బజ్జి 1/- మాత్రమే, 3 రకాలు చెట్నీలు… వాటి గురించి ఎంత చెప్పినా తక్కువే… బయట వాళ్ళను పెట్టుకుంటే శుభ్రతలో ఎక్కడ తేడా వస్తుందో అని వాటిని కూడా వాళ్లే శుభ్రపరుస్తున్నారు… పర్యావరణానికి నష్టం కలగకుండా అడ్డాకులలో టిఫిన్ పెడుతున్నారు… వ్యాపార దృష్టితో కాకుండా మంచి ఆహారం తక్కువ ధరలో ఇవ్వాలి అనే వాళ్ల ముఖ్య ఉద్దేశ్యం… ఉదయం 9 దాటితే అక్కడ టిఫిన్ దొరకడం కష్టం… ఈ రోజుల్లో కూడా ఇటువంటి వ్యాపారస్తులు ఉండటం చాలా గొప్ప విషయం… మీలో ఎవరికైనా కుదిరితే ఒకసారి వెళ్ళండి అద్భుతమైన టిఫిన్. అడ్రెస్ : రాంబాబు గారి టిఫిన్ సెంటర్, RB కొత్తూరు, (పెద్దాపురం హైవే కి 2 km) పెద్దాపురం మండలం, తూ. గో. జిల్లా ……’’
పైన పోస్టు ఫేస్ బుక్‌లో కనిపించిందే… ఆశ్చర్యమేసింది… నిజమేనా..? ఒక ఇడ్లీ ఒక రూపాయికి ఇవ్వడం సాధ్యమేనా..? పైగా మూడు చెట్నీలు… డౌటొచ్చింది… ఆరా తీస్తే వార్త నిజమే… పాత వార్తేమీ కాదు, తాజాదే… ఆధాన్ టీవీలో ఓ వీడియో కనిపించింది… ఇది గత ఏప్రిల్‌లో అప్‌లోడ్ చేసింది… గత నెలలో బీబీసీ కూడా ఓ వీడియో స్టోరీ చేసింది… ఇంకొన్ని సోషల్ పోస్టులు కూడా కనిపించాయి… అయితే ఎలా సాధ్యం..? పదహారేళ్లుగా ఇదే రేటుతో అమ్ముతున్నారట… ఒకప్పుడు రూపాయికి ఇడ్లీ ఇవ్వవచ్చుగాక… కానీ ఇప్పుడు మినుములు, బియ్యం, నూనె, పప్పుల ధరలు చూస్తున్నాం కదా, మరీ కరోనా waves అనంతరం విపరీతంగా పెరిగాయి… వేరే వాళ్లతో పోలిస్తే రాంబాబుకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నయ్… సొంత ఇల్లు, దాని ముందే ఓ టార్పాలిన్ కప్పేసి నడిపిస్తున్నాడు… తను, భార్య, అత్త, అమ్మ పనిచేస్తారు… సో, అద్దెల్లేవ్ జీతాల్లేవ్… లార్జ్ స్కేల్ సేల్స్ ఉన్నప్పుడు తక్కువ మార్జిన్ కూడా వర్కవుట్ అవుతుంది… కానీ ఆ ఊళ్లో గిరాకీ ఎంతో ఎక్కువ ఉండదుగా, పైగా కేవలం ఉదయం తొమ్మిది వరకే… ఇడ్లీ, బజ్జి రూపాయికి ఒకటి అమ్ముతాడు, కానీ పూరీ రెండింటికి పది రూపాయలు… ఐనా సరే, ఎలా చూసుకున్నా ఆ రేటు చాలా చాలా తక్కువ…
Ads
రాంబాబు చాలా పనులు చేశాడు, ఏదీ కలిసి రాలేదు, ఒకప్పుడు బాగా బతికిన కుటుంబమే… తరువాత చితికిపోయాడు… ఒక దశలో హుండీలో అర్ధరూపాయి, రూపాయి కర్రలతో తీసుకుని, పిల్లల కడుపులు నింపుకున్న రోజులున్నయ్ అంటున్నాడు… గొడ్డుకారం కలిపిన అన్నం పెట్టి పిల్లల్ని స్కూల్‌కు పంపిన రోజుల్ని ఆయన భార్య గుర్తుచేసుకుంటోంది… చివరకు 16 ఏళ్ల క్రితం ఇలా హోటల్ పెట్టుకున్నాడు… మొదట్లో అర్ధరూపాయికి ఇడ్లీ… తరువాత రేట్ రూపాయి చేశాడు, ఇక అంతే, మిగతా అందరు రేట్లు పెంచినా తను పెంచలేదు… రెండు రూపాయలు గనుక చేస్తే బోలెడు లాభం… కానీ కళ్ల ముందు కనిపించే లాభాన్ని, డబ్బును కూడా వద్దనుకుంటున్నాడు… ఒక దశలో కటిక పేదరికాన్ని అనుభవించి కూడా, ఇలా వచ్చే డబ్బు మీద ఆశల్ని వదిలేసుకోవడం విశేషమే… గ్రేట్… నిజానికి చాలా పట్టణాల్లో, హైదరాబాద్ సహా… మోపెడ్లపై ఇడ్లీలు, బజ్జీలు తీసుకెళ్లి లేబర్ అడ్డాల్లో, ఇంకా ఇతర రద్దీ ప్రదేశాల్లో చౌక టిఫిన్లు అమ్ముకునేవాళ్లు బోలెడు మంది… వేలల్లో ఉంటారు… వాళ్లు కూడా ప్లేటు 15, 20 రూపాయలకు ఇస్తారు… కానీ వాటి సైజు చిన్నవి… మూడో నాలుగో ఇస్తారు… ఒక్కొక్కటీ కనీసం 4, 5 రూపాయలు పడుతుంది… ఓ మోస్తరు హోటళ్లలో రేట్ల గురించి చెప్పే పనిలేదు… అలాగని రాంబాబు అమ్మే ఇడ్లీ మరీ బటన్ ఇడ్లీ సైజేమీ కాదు, ఓ మోస్తరుగానే ఉంది… ఐనా అదే రేటు కంటిన్యూ చేస్తున్నాడు అంటే… గొప్పే… అభినందించి తీరాలి… ‘‘టేక్ ఇట్ ఈజీ (జీవితంలో ఏదొచ్చినా స్వీకరించాలి), నథింగ్ ఈజ్ ఇంపాజిబుల్ (ఏదీ అసాధ్యం కాదు), వెయిట్ అండ్ సీ (మంచి రోజుల కోసం నిరీక్షించాలి)…’’ ఇవీ రాంబాబు నమ్మిన సూత్రాలు… రాంబాబూ… “చౌక ఆహారం” విలువ తెలిసిన నీకు ‘ముచ్చట’ అభినందనలు..!! అన్నట్టు, పలుచోట్ల ఈరేటుకు ఇడ్లీ అమ్మేవాళ్లు ఉండొచ్చు… కానీ కొనసాగింపు కష్టం… గత ఏప్రిల్‌లోనే ‘ముచ్చట’ తమిళనాట ఓ బామ్మ అమ్మే రూపాయి ఇడ్లీ మీద, ఆమెకు ఆనంద్ మహేంద్ర చేసిన సాయం మీద ఓ స్టోరీ ఇచ్చింది… అదీ చదవండి ఓసారి… ఇదీ లింకు… idli amma..! ఈ అమ్మ గుర్తుందా..? ఆనంద మహేంద్రుడు కూడా మరిచిపోలేదు…
Share this Article