అసలు బెల్ బాటమ్ ప్యాంటు అంటే మజాకా..? ఎన్టీయార్ డ్రెస్సుల బెల్ బాటమ్ సైజు, అంటే పాదాల దగ్గర వెడల్పు… అదో విశేషం అప్పట్లో… అది రోడ్డును ఊడ్చీ ఊడ్చీ పోగులు బయటపడకుండా… జిప్పులు కింద ఫాల్లాగా కుట్టించేవాళ్లు… నిజం, అప్పట్లో ప్యాంట్లకూ జిప్ పాల్స్… హహహ… ఎయిటీస్‌లో లెండి… న్యారో ప్యాంటు వేసుకుంటే వాడిని అన్నాడీ కింద చూసేవాళ్లు… తెలుగులోకి అనువదింపబడిన ఓ కన్నడ డిటెక్టివ్ సినిమా ‘బెల్ బాటమ్’ పేరు చూడగానే గుర్తొచ్చేది ఆ ప్యాంట్లే… అంటే ఆనాటి కాలం… నిజమే, ఈ చిత్రకథాకాలం కూడా ఎయిటీసే…
వాస్తవానికి మనల్ని వెనక కాలంలోకి సమర్థంగా గనుక తీసుకుపోగలిగితే… సినిమా ఆసక్తికరంగా ఉంటుంది, మనల్నీ నాస్తాల్జిక్ ఫీల్‌లోకి తీసుకుపోతుంది… ఎక్కడో కనెక్టయిపోతాం… కానీ అది అందరివల్లా కాదు… ఈ బెల్ బాటమ్ సినిమాయేమో ప్యూర్ కన్నడ సినిమా… మనకు తెలిసిన నటులు లేరు… డబ్బింగ్ అంటే డబ్బింగే… పైగా కాస్త మళయాళ, తెలుగు, తమిళంతో పోలిస్తే కాస్త నిర్మాణ విలువలు కూడా అంతంతమాత్రమే… అఫ్ కోర్స్, కేజీఎఫ్ వంటి కొత్తతరహా సినిమాలు ఈమధ్య దుమ్మురేపుతున్నాయి అనుకొండి…
Ads
ఎయిటీస్ అంటే డిటిక్టివ్ నవలలు, మధుబాబు షాడో, యుగంధర్, జేమ్స్ బాండ్ గట్రా మన కలల్ని, మన ఆలోచనల్ని, మన అభిరుచుల్ని, మన ముచ్చట్లను కమ్మేసిన కాలం… ఈ సినిమా కూడా డిటెక్టివ్ కథే… పైగా ఎయిటీస్ నాటి కథ… కాస్త హీరో హీరోయిన్ లవ్ ట్రాకు సోది అనిపించినా… అక్కడక్కడా సినిమా కాస్త లాగ్ అయినా సరే… ఓవరాల్‌గా సినిమా మరీ నిరాశపరచదు మనల్ని… కారణం… దర్శకుడు పూర్తిగా కథను, కథనాన్ని నమ్ముకుని, కథ ఎక్కడా పక్కదోవ పట్టకుండా, మంచి లాజిక్కులతో నడిపించడం… మనల్ని కథలో ఇన్వాల్వ్ చేయగలగడం… అదే కథ, కథనాల ప్రభావం…
అసలు మనకు డిటెక్టివ్ కథలే తక్కువ… అంటే ప్రొఫెషనల్ నేరదర్యాప్తు ఎప్పుడూ సగటు సీనిమా ప్రేక్షకుడికి ఇంట్రస్టింగే… సరిగ్గా చెప్పగలిగితే…! అది ఏ భాషలో ఉన్న సినిమా అయినా సరే…! రొమాన్స్, క్రైం, స్పోర్ట్స్ కథాంశాల అడ్వాంటేజ్ అది… కన్నడంలో హిట్టయింది కదాని ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి, ఆహా ఓటీటీకి అమ్మేశారు… కంటెంటు నింపడం కోసం నానా తిప్పలూ పడుతున్న సదరు ఓటీటీ ఓనర్ అన్నీ అకామిడేట్ చేసేస్తూనే ఉన్నాడు…
నిజానికి కరోనా శకం వచ్చాక… ఓటీటీలో బోలెడు సినిమాలు విడుదలయ్యాయి… ఇప్పటికీ అవే దిక్కు… కానీ ఆకాశం నీ హద్దురా అనే సినిమా తప్ప ఇక ఏ సినిమా ఓటీటీల్లో క్లిక్ కాలేదు… అయినా అన్నీ నాసిరకం సినిమాలే ఓటీటీకి ఎక్కుతున్నాయి లెండి… కన్నడంలో వేరే భాషల డబ్బింగ్ సినిమాలు నిషిద్ధం… కానీ ఆ సినిమాలు మాత్రం ఎంచక్కా అందరూ డబ్బింగ్ చేసుకుని చూసుకోవచ్చు…. సరే, అది వేరే చర్చ… ఈ సినిమా విషయానికొద్దాం…
సహజంగానే క్రైం ఇన్వెస్టిగేషన్, అదీ ఎయిటీస్ కథ, ఓ సాధారణ సెంట్రీ చిక్కుముడిలాంటి కేసు పరిష్కరించడం ఆసక్తికరమే కదా… కథానాయకుడికి నేరదర్యాప్తు అంటే పిచ్చి… ఆ బుర్ర కూడా ఉంది… పోలీస్ స్టేషన్ లాకర్లలోనే మాయమయ్యే డబ్బు గురించిన కేసు తనకు అప్పగిస్తారు… ఎవరెవరిపైకో అనుమానాలు మళ్లేలా ప్రేక్షకుడిని డైవర్ట్ చేసీ చేసీ, మెల్లిమెల్లిగా ముడివిప్పడం అనేది పాత టెక్నికే… కానీ ప్రతి కొత్త కథా కొత్తగానే ఉంటుంది కదా… అదుగో అదొక్కటే ఈ సినిమాకు ప్లస్ పాయింట్… పాటలు తీసిపారేస్తే ఇంకాస్త బాగుండేదేమో… మనకు ఆనవు అవి…
ఏదో ఓ కన్నడ పాపులర్ డిటెక్టివ్ నవలను తెలుగులోకి అనువదిస్తే… చదివినట్టుగా ఉంటుంది సినిమా… అఫ్ కోర్స్, తీసిపారేయొద్దు… అలాగని గొప్పగా కూడా ఏమీ లేదు… చూడొచ్చు…! మరి మనలోని డిటెక్టివ్ అభిమానికి ఎప్పుడో ఓసారి ఫుల్ మీల్స్ పెట్టకపోతే ఎలా…!! అన్నట్టు దీన్నేనా అక్షయ్‌కుమార్ ఇదే పేరుతో హిందీలో రీమేక్ చేస్తున్నది..?!
Share this Article