కొన్ని వార్తలు ఓ పట్టాన నమ్మబుద్ధి కావు… నిజమా అనిపిస్తాయి కాసేపు… ఇదీ అంతే… 1,448 కోట్ల రూపాయలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి… కానీ అవి చేతిలోకి రానంటున్నాయి… తనది అదృష్టమో, దురదృష్టమో… అసలేం జరిగిందో, ఏం జరగనుందో కూడా బాబు జార్జ్‌కు అర్థం కావడం లేదు… ఎప్పుడో 1978లో కొన్న షేర్లు… అనుకోకుండా ఇంట్లో దాచుకున్న లంకెబిందెల్లా బయటపడ్డయ్… అసలు కథలోకి వెళ్దాం…
ముందే చెప్పుకున్నట్టు… ఈ కథ 1978లో స్టార్టయింది… కేరళ, కొచ్చికి చెందిన బాబు జార్జి వలవి ఓ చిన్న ఇన్వెస్టర్… తను, నలుగురు రక్తబంధువులు కలిసి ఉదయ్‌పూర్‌కు చెందిన మేవార్ ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ అనే కంపెనీకి చెందిన 3,500 షేర్లను కొన్నారు… కానీ అప్పుడది అన్ లిస్టెడ్ కంపెనీ… అంటే ఆ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు సాధ్యం కావు… అప్పట్లో ఈ వలవి ఆ కంపెనీకే సెవన్టీస్, ఎయిటీస్‌లో డిస్ట్రిబ్యూటర్… అందుకే ఆ కంపెనీ గురించి తెలుసు తనకు… ఆ 3500 షేర్లు మొత్తం కంపెనీ అప్పటి విలువలో 2.8 శాతం… కంపెనీ ఫౌండర్ పీపీ సింఘాల్‌తో వ్యక్తిగత పరిచయం ఉండటం వల్ల కూడా ఆయన అడగ్గానే ఆ షేర్లు కొని, ఆమేరకు డబ్బు చెల్లించాడు… ఇదీ పూర్వరంగం…
Ads
క్రమేపీ ఆ కంపెనీ డివిడెండ్లు ఏమీ ఇవ్వలేదు… ఆ కంపెనీతో సంబంధాలు కూడా లేకుండా పోయాయి వలవికి… దాంతో ఈ కుటుంబం కూడా ఆ షేర్ల గురించి మరిచిపోయింది… ఎక్కడో ఆ కాగితాలు మాత్రం అలాగే భద్రంగా ఉండిపోయాయి… 2015… ఏదో అవసరం కోసం వలవి పాత డాక్యుమెంట్ల కట్టల్లో వెతుకుతూ ఉంటే ఈ కాగితాలు కనిపించాయి… వాటిని బయటికి తీసి చూశాడు… అసలు ఆ కంపెనీ ఉందా అని కాస్త తవ్వాడు… షాకింగ్ విషయాలు తెలిసొచ్చాయ్ ఆయనకు… ఈ మేవార్ ఆయిల్ అండ్ జనరల్ మిల్స్ కంపెనీయే పీఐ ఇండస్ట్రీస్ అని పేరు మార్చుకుంది… లిస్టెడ్ కంపెనీ ఇప్పుడు… ఒక్కో షేరు ధర ప్రస్తుతం మార్కెట్‌లో 3,460 రూపాయలు… కంపెనీ ఆగ్రోకెమికల్స్ రంగంలో చాలా పాపులర్…
వలవి ముందుగా ఆ కాగితాల్ని తీసుకుపోయి ఓ కార్పొరేట్ సర్వీస్ ఏజెన్సీ ద్వారా డీమ్యాట్ చేయించడానికి ప్రయత్నించాడు… కానీ సక్సెస్ కాలేదు… ఆ ఏజెన్సీ నేరుగా కంపెనీతో కంటాక్టులోకి వెళ్లాల్సిందిగా సూచించింది… వలవి వెళ్లి కలిశాడు… తన షేర్ల సంగతి ప్రస్తావించాడు… కానీ అవన్నీ ఎప్పుడో 1989లోనే ఎవరికో అమ్మేశారు కదా అన్నారు కంపెనీ పెద్దలు… ఈ కుటుంబం షాక్… మేం అప్పుడే అమ్ముకుంటే ఈ కాగితాల సంగతేమిటని ప్రశ్నించారు… మమ్మల్నేం చేయమంటారు అని దబాయించారు కంపెనీ వాళ్లు… సరే, చట్టపరంగానే వెళ్తాను అన్నాడు వలవి… సర్లె, వెళ్లు అని పంపించేశారు వాళ్లు… కానీ ఎందుకో ఆ కంపెనీ పెద్దలకే డౌటొచ్చింది, ఇది కాస్త కాంప్లికేటెడ్ యవ్వారం, తమకే తెలియకుండా ఏదో జరిగింది అని సందేహంలో పడ్డారు… నీ కాగితాలు చూపించు అనడిగారు… ఎంతోకొంత ఇచ్చి, వలవి నోరు మూసేయించాలని ప్రయత్నించారు…
ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్స్ కేరళకు వెళ్లి ఆ ఒరిజినల్ డాక్యుమెంట్లను పరిశీలించారు… అవి నకిలీవి కావని తేల్చుకున్నారు… ఐనా సరే ఎందుకో వలవితో కంటాక్టులోకి రాలేదు తరువాత… వలవి లోకల్ మీడియాకు వివరాలన్నీ చెప్పాడు… పీఐ ఇండస్ట్రీస్ తనను మోసం చేసిందని ఆరోపించాడు… సెబికి ఫిర్యాదు చేశాడు… సెబి అడిగినా సరే ఆ కంపెనీ సరిగ్గా స్పందించడం లేదు… ఇప్పుడు వలవి వయస్సు 74 ఏళ్లు… ఇంకా తవ్వుతున్నాడు… తనకు తెలియవచ్చింది ఏమిటంటే..? 1989లో కంపెనీ సెక్రెటరీగా ఉన్న జీసీ జైన్ అనే వ్యక్తి తన క్లోజ్ రిలేటివ్స్ ప్లస్ ఫ్రెండ్స్ 13 మంది పేరిట షేర్లను బదలాయించాడని..! అందరూ ఇన్‌సైడర్లే… ఇప్పుడు వలవి దగ్గరున్న కాగితాలను బట్టి లెక్కేస్తే 42.8 లక్షల తాజా షేర్లతో సమానం… ఇంతకీ సెబి ఆయనకు న్యాయం చేస్తుందా..? న్యాయం జరగాలంటే ఏం చేయాలి..?! (వార్త సోర్స్ :: IndiaTimes)
Share this Article