రాజకీయాల్లో అన్నీ బాగుంటేనే… కొడుకు, బిడ్డ, అల్లుడు, బావమరిది ఎట్సెట్రా కుటుంబగణమంతా సుహృద్భావంతో కలిసిమెలిసి సాగుతూ అన్నీ దండుకుంటారు… ఎక్కడ తేడా వచ్చినా సరే, ఇక తమ్ముడు లేదు, బిడ్డ లేదు, బంధుగణం లేదు… తన్నుకోవడమే… అంతపుర కుట్రలుంటయ్, వెన్నుపోట్లు ఉంటయ్, కూలదోయడాలు, బొందపెట్టడాలూ ఉంటయ్… కులపార్టీలు, కుటుంబపార్టీలు అయితే ఈ జాడ్యాలు మరీ ఎక్కువ… ప్రతి ఒక్కడూ తమ పార్టీల్లో తమ కుటుంబసభ్యుల నీడను చూసి కూడా భయపడాల్సిందే… మన దేశంలో పార్టీల యవ్వారాన్ని అర్థం చేసుకోవడానికి ఓ చిన్న పార్టీ కథ, ఆ పార్టీ ఓనర్ ఫ్యామిలీ కథ ఓసారి చదవాలి… ఉదాహరణ కోసం అన్నమాట… ఈ పార్టీ పేరు అప్నాదళ్… ఎహె, సవాలక్ష పార్టీలున్నయ్ దేశంలో, ఈ సోది పార్టీ గురించి మాకెందుకు అని తీసిపారేయకండి… ఇదొక ఇంట్రస్టింగు స్టోరీ… జాగ్రత్తగా చదవండి…
పాతికేళ్ల క్రితం సోనేలాల్ పటేల్ అనే పెద్దమనిషి అప్నాదళ్ అని ఓ పార్టీ పెట్టాడు… ఉత్తరప్రదేశ్ రాష్ట్రం… కుర్మి కులస్థుడు… పలు ప్రాంతాల్లో ఈ సామాజికవర్గానికి కాస్త బలముంది… (ఈయన వాజపేయి అభిమాని, బీఎస్పీకి పోటీగా కావాలనే ఈ పార్టీని బీజేపీ పెట్టించింది అనే ప్రచారం కూడా ఉంది…) సోనేలాల్ పోటీలు చేస్తూనే ఉండేవాడు, ఓడిపోతూ ఉండేవాడు… ఒకే ఒక్కసారి మాఫియా డాన్ కమ్ పొలిటిషియన్ అతీక్ అహ్మద్ గెలిచాడు, అంతే… వేరే ఏ విజయాలూ లేవు… ఈలోపు ఆయన పెద్ద కూతురు అనుప్రియ బాగా చదువుకుని, తండ్రికి చేదోడువాదోడుగా ఉండసాగింది… సైకాలజీలో మాస్టర్స్ చదివింది.., ఎంబీఏ కూడా చేసింది… టీచర్, ఫెమినిజం, సోషల్ జస్టిస్ కోణాల్లో యాక్టివిస్ట్… పార్టీ వ్యవహారాలన్నీ తన గుప్పిట్లోనే ఉండేవి… తండ్రి 2009లో ఏదో యాక్సిడెంటులో చనిపోయాడు… సరిగ్గా 20 రోజుల్లో పెళ్లి చేసుకుంది… భర్త పేరు ఆశిష్ సింగ్ పటేల్… ఇద్దరూ తెలివైన వాళ్లే…
Ads
అనుప్రియ పార్టీ అధ్యక్షురాలిగా తల్లి కృష్ణసింగ్‌ను పెట్టి, పార్టీ వ్యవహారాలు తను చూసుకోసాగింది… వారణాసి దగ్గరలో రోహనియా అనే నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని, 2012 లో, పీస్ పార్టీ ఆఫ్ ఇండియా అనే ఓ ముస్లిం పార్టీ సాయం తీసుకుంది, గెలిచింది… తరువాత 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు, ఎన్‌డీయేలో చేరింది… మిర్జాపూర్ లోకసభ స్థానం నుంచి అనుప్రియ తనే పోటీచేసింది… బీజేపీ హవాలో గెలిచింది… కానీ అప్పటికే తల్లికి, చెల్లెకు ఈమె పెత్తనం, ఆధిపత్యం మీద గుర్రుగా ఉంది… ఇంట్లో గొడవలు… ఈలోపు తను రాజీనామా చేసిన అసెంబ్లీ సీటు మరో చిచ్చుపెట్టింది… అక్కడ ఉపఎన్నికలో భర్త ఆశిష్‌ను నిలబెట్టాలని అనుప్రియ ప్లాన్… అల్లుడిని కాదని, అనుప్రియ తల్లి, అంటే ఆశిష్ అత్తగారు, పార్టీ అధ్యక్షురాలి హోదాలో నిర్ణయం తీసుకుని తనే సొంతంగా నిలబడింది… వేరే ఎవరిని నిలబెట్టినా అనుప్రియ కుట్ర చేసి ఓడిస్తుందనే భావనతో తనే పోటీచేసింది…
రాజకీయాల్లో అవ్వేంది, బిడ్డేంది, అల్లుడేంది..? అనుప్రియ తల్లి ఓడిపోయేలా చేసింది… దీంతో తల్లికి కోపమొచ్చి బిడ్డను, అల్లుడిని, మరికొందరు ముఖ్యుల్ని పార్టీ నుంచి బహిష్కరించింది… ఓసోస్ అని తేలికగా తీసుకున్న అనుప్రియ అప్నాదళ్ (సోనేలాల్) అని కొత్త పార్టీని స్టార్ట్ చేసింది… బీజేపీతో దోస్తీ అలాగే ఉంది, కేంద్రంలో కొన్నాళ్లు మంత్రిగా కూడా చేసింది… ఇక 2019 ఎన్నికల్లో ఆమె దశ తిరిగింది… మిర్జాపూర్, ప్రతాప్‌గఢ్ ఎంపీ సీట్లలో పోటీ చేసింది, రెండూ గెలిచారు… అసెంబ్లీలో 9 సీట్లు గెలిచారు… మండలిలో ఒక సీటు ఉంది… యూపీ పాలిటిక్స్‌లో అందరూ చాలా లైట్ తీసుకున్న ఓ చిన్న కుటుంబపార్టీ ఇప్పటి స్థితి అదీ… అసలు విషయం చెప్పుకుందాం… మొన్నటి ఎన్నికల్లో యూపీలో కాంగ్రెస్ గెలుచుకున్న ఎమ్మెల్యే సీట్లు కేవలం ఏడు… ఈ చిన్న పార్టీ గెలుచుకున్నవి ఏకంగా 9… ఇదీ మన రాజకీయాల్లోని వైచిత్రి… ఇప్పుడు ఈ పార్టీ కథ, ఈమె కథ పునశ్చరణ దేనికీ అంటారా..? మోడీ రేపటెల్లుండి కేబినెట్ విస్తరించబోతున్నాడు కదా… ప్రతిపాదిత మంత్రుల పేర్ల జాబితాలో అనుప్రియ పేరు కూడా వినిపిస్తోంది…! ఆ పేరు చూడగానే ఈ కథంతా గుర్తొచ్చింది కాబట్టి…!!
Share this Article