రాజకీయ నేపథ్యాలు లేని అశ్విన్ వైష్ణవ్, జైశంకర్‌లకు కేంద్ర మంత్రి పదవులు ఎలా వచ్చాయో… వాళ్లు రెగ్యులర్ పాలిటిక్స్‌కు ఎలా భిన్నమో… వాళ్ల మీద కేంద్ర ప్రభుత్వం పెట్టుకున్న ఆశలేమిటో మనం నిన్నా మొన్నా చెప్పుకున్నాం కదా… మంచో చెడో, ఫలితం ఏదైనా సరే, ఎంపికల వరకూ వోకే… డబుల్ వోకే… ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరో కేంద్ర మంత్రిది మరీ మరీ భిన్నమైన కేసు… ఒక్క ముక్కలో చెప్పాలంటే ఓ పార్టీ అధినేత నీడకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చినట్టు..! అర్థం కాలేదు కదా… అవును, ఇదొక అర్థం లేని ఎంపికే ఒక కోణంలో…! ఈయన పేరు రామచంద్రప్రసాద్ సింగ్… సింపుల్‌గా ఆర్సీపీ సింగ్, RCP అంటుంటారు బీహార్‌లో…
నిజానికి ఈయన యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి… మరీ గొప్పగా చెప్పుకునేవేమీ లేవు కెరీర్‌లో, అదేసమయంలో కొంత బ్యాడ్ ట్రాక్ రికార్డు కూడా ఉంది… ప్రాజెక్టులు, బదిలీలు, పోస్టింగులకు ‘ఆర్సీపీ టాక్స్’ వసూలు చేస్తాడనే ఆరోపణ ఉంది కానీ అదీ నితిశ్ కోసమో, పార్టీ ఖర్చుల కోసమో, తన కోసమో తెలియదు… లాలూ కొడుకు తేజస్వి యాదవ్ ఆరోపణ ఏమిటంటే… అసలు బీహార్ పాలనను శాసించేది, నడిపించేది, నితిశ్ వ్యవస్థీకృత అవినీతికి వసూళ్ల పితామహుడు ఆర్సీపీయే…! (263 కోట్లు ఖర్చుచేసి, ఎనిమిదేళ్లు కట్టిన ఓ బ్రిడ్జి నెల రోజుల్లో కొట్టుకుపోయినప్పుడు ఆర్సీపీ టాక్స్ బాగా చర్చల్లో నలిగింది) ఈయన నితిశ్‌కు కుడిభుజం, లలన్‌సింగ్ అని ఇంకొకాయన ఉంటాడు, ఆయన ఎడమభుజం… ఆర్సీపీ పుట్టింది నలంద… కుర్మి కులం… జేడీయూ బాస్, బీహార్ సీఎం నితిశ్ కూడా సేమ్…
Ads
వాజ్‌పేయి ప్రభుత్వంలో ఈ నితిశ్ కొన్నాళ్లు రైల్వే మంత్రిగా చేశాడు కదా… యూపీ కేడర్‌లో ఉన్న ఆర్సీపీని తన సెక్రెటరీగా రప్పించుకున్నాడు… ఆ మంత్రి పదవి తరువాత కూడా ఆర్సీపీని వదిలేయలేదు… నమ్మకస్తుడు కదా… తన ప్రభుత్వం రాగానే, యూపీ నుంచి బదిలీపై రప్పించుకుని, ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా పెట్టుకున్నాడు… ఇక ఆర్సీపీ ఏది చెబితే అదే… కాదు, నితిశ్ ఏది చెబితే దాన్ని పక్కాగా అమలు చేసేవాడు ఆర్సీపీ… నితిశ్‌కు నీడ తను… తెర మీద కనిపించేవాడు కాదు… కానీ అంతా తానే… కొద్దినెలల్లో రిటైర్‌మెంట్ ఉండగా, సర్వీస్ నుంచి 2010లో రాజీనామా చేశాడు… నితిశ్ ఆయన్ని వెంటనే రాజ్యసభకు పంపించాడు… 2016లో మళ్లీ చాన్స్ ఇచ్చాడు… పార్టీకి ప్రధాన కార్యదర్శిగా చేశాడు… సాఫీగా సాగుతున్న ఈ కథలో ఇక్కడే కాస్త ఝలక్ ఉంది…
పీకే అలియాస్ ప్రశాంత్ కిశోర్… అదేనండీ, జగమెరిగిన ఎన్నికల వ్యూహకర్త… నితిశ్ బాగా చేరదీశాడు… పార్టీ వైస్ ప్రెసిడెంటును చేశాడు, నా తరువాత నువ్వే నా వారసుడివి అన్నాడు… కానీ పీకే ఆశలు చాలా పెద్దవి… చాలా అంటే, అవి ఎర్రకోటనే కబళించాలన్నంతగా..! మెల్లిమెల్లిగా సీఎం నితిశ్‌కు దూరం అయ్యాడు… పౌరసత్వ సవరణ చట్టం లొల్లి జరుగుతున్నప్పుడు మొత్తానికే పార్టీ నుంచి వెళ్లిపోయాడు… ఇక ఆ ప్లేసులో ఈ ఆర్సీపీ బాగా ఫిక్సయిపోయాడు… ఈలోపు బీజేపీ అరుణాచల్ ప్రదేశ్‌లో ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలను మింగేసింది… ఇక్కడ దోస్తే, అక్కడ యవ్వారం వేరు… ఇంకాస్త పార్టీ మీద దృష్టి పెట్టిన నితిశ్ ఈ ఆర్సీపీని ఏకంగా పార్టీ అధ్యక్షుడిని చేశాడు ఆమధ్య… ఇప్పుడు కేంద్ర మంత్రినీ చేశాడు… ఇంత చదివాక కూడా ఆయనకు నితిశ్ ఎందుకంత ప్రాధాన్యం ఇస్తున్నాడో అర్థం కాలేదా..? భలేవారే… జేడీయూకు, నితిశ్‌కు వారసుడు ఆయనే…!!
అన్నట్టు… ఆర్సీపీకి ఇద్దరు పిల్లలు… ఒక బిడ్డ పేరు లిపిసింగ్… 2016 ఐపీఎస్ ఆఫీసర్… లేడీ సింగం అని పేరు… భర్త సుహర్ష భగత్, ఆయన సివిల్స్ అయిదో జాతీయ ర్యాంకు కొట్టాడు… ప్రస్తుతం బంకా జిల్లా కలెక్టర్… అనంతసింగ్ అని ఓ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఇంటి మీద దాడిచేసి, పెద్దఎత్తున బాంబులు, తుపాకులు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నప్పుడు ఆమె పేరు మారుమోగిపోయింది… తరువాత ఓసారి దుర్గ ఊరేగింపు వివాదంలో బదిలీకి గురై మళ్లీ వార్తల్లోకి ఎక్కింది… సో, రాబోయే రోజుల్లో ఈ మాజీ ఐఏఎస్ అధికారి, ప్రస్తుత కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ బీహార్ రాజకీయాల్లో ఇంకా ప్రముఖ పాత్ర పోషించబోతున్నాడు..!! (ఈ స్టోరీ నచ్చితే “ముచ్చట”ను సపోర్ట్ చేయండి)
Share this Article