అధికారంలో ఉన్న నాయకుల పిల్లలు తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాలా..? రావాలి…! లేకపోతే ‘‘పరివారం’’ ఊరుకోదు… లాగుతూనే ఉంటుంది… ఆయా పిల్లల వ్యక్తిగత అభిరుచులు ఏమైనా సరే, వాళ్లకు ఎదిగే ఇంట్రస్టు ఉన్న రంగాలు ఏవైనా సరే, వేరే ఫీల్డ్స్‌లో వాళ్లు మంచి వర్క్ చేస్తున్నా సరే… పాలిటిక్స్‌లోకి లాక్కొచ్చేస్తూనే ఉంటారు చుట్టూ ఉన్న జనం… కొన్నిసార్లు ఆయా పార్టీల అనివార్యతలు లాక్కొస్తాయి… బోలెడు ఉదాహరణలు… రాజీవ్‌గాంధీకి రాజకీయాలంటే పడవు… హాయిగా విమానాలు నడుపుకుంటూ ఉండేవాడు… రావల్సి వచ్చింది రాజకీయాల్లోకి..! మన తెలుగు రాజకీయాల్లోనూ బోలెడు… బ్రాహ్మణికి తెలంగాణ తెలుగుదేశం పగ్గాలు ఇవ్వాలని తరచూ కేడర్ చంద్రబాబును డిమాండ్ చేస్తూ ఉంటుంది… కేసీయార్ మనమడు హిమాంశుకు ఇప్పట్నుంచే రాజకీయాల్ని రుద్దుతున్నారు కొందరు… ఇప్పుడు మనం చెప్పుకునే కేరక్టర్ పేరు తేజస్ ఠాక్రే… నాలుగైదు రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం ఈ పేరు.,. అతను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే చిన్న కొడుకు… పెద్ద కొడుకు ఆదిత్య ఠాక్రే ఆల్‌రెడీ రాజకీయాల్లోనే ఉన్నాడు… మంత్రి… ఇప్పుడు కథ ఏమిటంటే..?
పైన ఫోటోలో పొడుగ్గా కనిపిస్తున్నాడు కదా, తనే తేజస్… అదుగో పాలిటిక్సులోకి వస్తున్నాడు, ఇదుగో యంగ్ టైగర్ వచ్చేసినట్టే అనే ప్రచారాలు అప్పుడప్పుడూ సాగుతూనే ఉంటయ్… ‘‘పరివారం’’ రాజకీయాల్లోకి లాక్కురావాలని ప్రయత్నం చేస్తూనే ఉంటుంది… కానీ ఎప్పుడూ పొలిటికల్ స్క్రీన్ మీదకు రాలేదు అతను… తండ్రి సీఎం అయినప్పుడు ప్రమాణస్వీకారం వేళ, అన్న వర్లి సీటు నుంచి ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్న వేళ, అధికారంలోకి వచ్చాక ఫ్యామిలీతో కలిసి సిద్దివినాయకుడి గుడికి వెళ్లిన వేళ… ఇలా అరుదుగా… అదీ కుటుంబసభ్యుడిగా..! అంతేతప్ప తనకు పార్టీలో ఏ హోదా లేదు, పార్టీ యాక్టివిటీస్‌లోకి రాడు… అలాంటిది మొన్న శివసేన అధికార పత్రిక సామ్నాలో ఓ ఫుల్ పేజీ ప్రకటన… ఉద్దవ్ కుడిభుజంగా చెప్పుకునే మిలింద్ నర్వేకర్ ఈ ప్రకటన ఇచ్చాడు… పేరుకు అది బర్త్ డే గ్రీటింగ్స్, కానీ గతంలో ఇలా ఎప్పుడూ లేదు… అందులో పెద్ద పులి ఠాక్రే, సీఎం ఉద్దవ్, ఆయన భార్య రష్మి, పెద్ద కొడుకు ఆదిత్య ఫోటోలు… ‘‘ఠాక్రే కుటుంబంలోని వివియన్ రిచర్డ్స్’కు శుభాకాంక్షలు అని ఉంది అందులో… రిచర్డ్స్ అంటే వెస్ట్ ఇండీస్ ఫేమస్ క్రికెటర్, బ్యాటింగు అంటే మొదట గుర్తొచ్చేది రిచర్డ్స్ పేరే… అంటే పరోక్షంగా ‘‘ఆట ఆడటానికి వస్తున్నాడు’’ అన్నట్టుగా ఉంది ఆ ప్రకటన… అదీ పార్టీ పత్రికలో రావడం విశేషం… అయితే… ఇలాంటి ప్రయత్నాల్ని పరివారం చేస్తూనే ఉంటుంది, ఇదేమీ కొత్తేమీ కాదు అని మనం చెప్పుకున్నాం కదా… తన రాజకీయ ప్రవేశం మీద డిబేట్లు సాగుతూనే ఉన్నయ్… కానీ చెప్పుకోవాల్సిన విశేషాలు వేరే ఉన్నయ్… అసలు తేజస్ ఏం చేస్తుంటాడు..?
Ads
‘‘ఒకే దెబ్బకు రెండు ముక్కలు… అన్న ఒస్తున్నాడు… పులి కదిలింది’’ వంటి విశేషణాలతో ట్వీట్లు కూడా కొడుతున్నారు కొందరు శివసేన కార్యకర్తలు, నాయకులు… నిజానికి తేజస్ జీవితం వేరు, తన అభిరుచి వేరు, తన వర్క్ వేరు, తన ఫోకస్ వేరు, తన ఫీల్డే వేరు… సగటు కార్యకర్తకు తేజస్ వర్క్ అర్థమే కాదు… వికీపీడియాలో తన పేజీ ఓపెన్ చేయగానే మీకు కనిపించేది పర్యావరణ పరిరక్షణవాదిగా… అవును, తన లోకం అడవి, తన లోకం వైల్డ్ లైఫ్, తన ప్యాషన్ ఫోటోగ్రఫీ… తన ప్రాణం పరిశోధన… చేపలు, పీతలు, పాములు, బల్లులు, సాలెపురుగులు, ఇతర జీవుల కొత్త జాతుల్ని అన్వేషిస్తాడు, అలా పశ్చిమ కనుమల్లోకి రోజుల తరబడీ వెళ్లి తిరుగుతుంటాడు… గిరిజనంతో మాటామంతీ, పలుసార్లు వాళ్లతోనే భోజనం… అక్కడే క్యాంపులు… అడవి మధ్యలో టెంట్లు, నిరీక్షణ…. చెట్లు, పుట్టలు, కాలువలు… ఇదే ప్రపంచం తనది… (ఒక్కసారి మన చుట్టూ ఉన్న నాయకుల పిల్లల జీవితాలు, అరాచకాలు, తెలివితక్కువ వేషాలు, పబ్బులు, కేసులు, గ్యాంగులు గట్రా గుర్తుతెచ్చుకుంటే ఈ యువకుడి జీవితం ఎంత ఫెయిరో మనకు అర్థమవుతుంది…)
19 ఏళ్లు… సెకండ్ ఇయర్‌లోనే అతను సహ్యాద్రి అడవుల్లో అయిదు కొత్త జాతుల ఎండ్రికాయల్ని కనిపెట్టాడు… ఒక దానికి Gubernatoriana thackerayi అని తన పేరు కలిసొచ్చేలా నామకరణం చేశాడు… 2018లో… మరో 11 రకాల్ని కనిపెట్టాడు… తరువాత సంవత్సరం తూర్పు కనుమల్లో తిరిగి ఓ కొత్తరకం బల్లిని కనిపెట్టాడు… దానికి Hemidactylus thackerayi అని పేరు పెట్టాడు… తన పేరు కూడా కలిపి..! అదే సంవత్సరం తేజస్ కూడా సభ్యుడిగా ఉన్న ఓ టీం క్యాట్ స్నేక్‌ను కనిపెట్టింది… 125 ఏళ్లలో ఈ అన్వేషణ ఇదే మొదటిసారి… దానికి Boiga thackerayi అని పేరు పెట్టారు… 2020లో తేజస్ టీం సహ్యాద్రి అడవుల్లోనే కొత్తరకం చేపల్ని కనిపెట్టింది… అందులో ఒకదాని పేరు Hiranyakeshi loach… బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది… ఇవేకాదు, ముంబై ఆరే కాలనీ పరిరక్షణవాది… తరచూ అటవీ శాఖ అధికారులను కలుస్తుంటాడు, అడవుల ఇష్యూస్ డిస్కస్ చేస్తుంటాడు… గత ఏడాది ఠాక్రే వైల్డ్ లైఫ్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాడు… ఆరే కాలనీ మీద మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై, పశ్చిమ కనుమల్లోని ఏడు అడవుల్ని రిజర్వ్ ఫారెస్టులుగా ప్రకటించడంపై కూడా తేజస్ ప్రభావం, పాత్ర ఉన్నాయంటారు… ముప్ఫై ఏళ్ల ఈ పొడగరి ఇప్పటికైతే రాజకీయ వాసనలకు దూరంగానే ఉంటున్నాడు… కొందరు వారసులనైనా స్వచ్ఛంగా బతకనియండర్రా…!!
Share this Article