.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ప్రమాణస్వీకారం చేయడానికి ఒకరోజు ముందే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడా..? మన్మోహన్‌సింగ్‌ను ఆర్థికమంత్రిగా తీసుకోవడానికి అసలు తెరవెనుక శక్తులు వేరే పనిచేశాయా..? మన జీవితాల్ని, మన దేశ స్థితిగతుల్ని నిజంగా శాసించేది ఎవరు..?
1978 నుంచీ పలు జాతీయ పత్రికల్లో పొలిటికల్ రిపోర్టింగ్ చేసిన వెటరన్ రైటర్ పి.రామన్ దివైర్ సైటులో రాసిన ఓ వ్యాసంలో కొన్ని ఇంట్రస్టింగు పాయింట్లు ఉన్నయ్… ఆ వ్యాసమంతా కాదు గానీ, కొన్ని సంక్షిప్తంగా, సరళంగా తెలుగు రీడర్స్ తెలుసుకోవడం అవసరమే అనిపిస్తోంది…
Ads
30 ఏళ్ల క్రితం… జూన్ నెల 18, 19… 1991… శరద్ పవార్ ప్రధాని కావడానికి వీలుగా దాదాపు 130 మంది కాంగ్రెస్ ఎంపీలు సై అన్నారు… భేటీలు, పార్టీలు సాగుతున్నయ్… కానీ అది కాంగ్రెస్… రకరకాల మంత్రాంగాలు… అన్నీ పెద్ద పెద్ద బుర్రలే కదా… అకస్మాత్తుగా అర్జున్ సింగ్, ధావన్, ఫోతేదార్, తివారీ, కరుణాకరన్, ప్రణబ్ ముఖర్జీ వంటి నేతలు పీవీ వైపు మొగ్గారు…
సరే, పీవీకి ఇంకా ఎవరెవరు తెర వెనుక సాయం చేశారు, సోనియాను ఒప్పించారు వంటి అంశాల్ని వదిలేస్తే… అప్పటి రాష్ట్రపతి వెంకట్రామన్‌ను పార్టీ ముఖ్యులు కలిసి పీవీ ప్రధానిగా ఎంపిక చేసుకున్నట్టు చెప్పారు… ఇక ఆయన 21న ప్రమాణం చేయాలి, రాష్ట్రపతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా పీవీని ఆహ్వానిస్తూ లెటర్ ఇచ్చాడు… అది 20వ తేదీ… మధ్యాహ్నం రెండు గంటలైంది అప్పటికే…
సోనియమ్మ దర్శనం చేసుకుని, ఆశీస్సులు పొందడం తప్పదు కదా… చకచకా ఆమె నివాసానికి వెళ్లాడు పీవీ… ఈలోపు కేబినెట్ సెక్రెటరీ నరేష్ చంద్ర ఒక మెసేజ్ పెట్టాడు తనకు… అర్జెంటుగా ఓ కీలక నిర్ణయం తీసుకోవాలి, నేను వచ్చి మీకు వివరిస్తాను అని… రమ్మన్నాడు…
‘‘విదేశీ మారకద్రవ్యం మరీ 2500 కోట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది… జీడీపీలో 22 శాతం విదేశీ రుణాలు, 56 శాతం అంతర్గత రుణాలు, రేటింగ్ ఏజెన్సీలు ఇండియాకు ‘డేంజరస్’ అని రేటింగ్స్ ఇచ్చాయ్…’’ ఇదీ ఆయన చెప్పింది… మరేం చేద్దామంటావ్ అన్నాడు పీవీ… తను డిజిగ్నేటెడ్ ప్రైమ్ మినిస్టర్ అప్పటికే…
అప్పటికే చంద్రశేఖర్ ప్రభుత్వం మన బంగారాన్ని లండన్ బ్యాంకుల్ని కుదువ పేరిట అమ్మేసింది దాదాపుగా… ఈ స్థితిలో గంటన్నరపాటు సాగిన ఈ ఆర్థిక భేటీలో కేబినెట్ సెక్రెటరీ చెప్పిన చావు కబురు ఏమిటంటే..?
‘‘అర్జెంటుగా డబ్బు కావాలి, ఐఎంఎఫ్‌ను అడిగాం, 20 నెలల స్వల్పకాలిక రుణం 23 లక్షల డాలర్లు ఇవ్వాలంటేనే బోలెడు షరతులు పెట్టారు… కొన్ని అధికారికం, ఇంకొన్ని మౌఖికం… మీరు సరేనంటే వాళ్ల షరతులపై మేం మాటామంతీ కొనసాగిస్తాం…’’
ఆ షరతులు ఒప్పుకోవాలంటే పీవీకి తనున్న స్థితిలో చాలా కష్టం… సాహసం… అయితేనేం..? వోకే అన్నాడు… అవును, ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయడానికి ఒకరోజు ముందే ఐఎంఎఫ్ షరతుల్ని పూర్తిగా అంగీకరించాడు…
మరోవైపు తన నివాసంలో సీనియర్ నేతలంతా ఈయన కోసం ఎదురుచూస్తున్నారు… చంద్రస్వామి ఆశీస్సుల కోసం వెళ్లి ఉంటాడనే చెణుకులు కూడా పడుతున్నయ్… ఐఎంఎఫ్ తాలుకు డెసిషన్స్ తీసుకుని కూల్‌గా ఇంటికొచ్చి కాబోయే మంత్రుల ఖరారు కసరత్తులో మునిగిపోయాడు…
వాస్తవానికి నెహ్రూ ఆర్థిక విధానాల నుంచి అంగుళం పక్కకు జరగని సీనియర్లే కాంగ్రెస్‌లో ఎక్కువ… పైగా ఐఎంఎఫ్ షరతులు బయటికొస్తే సొంత పార్టీలో అప్పటికప్పుడు తనకు పొగతప్పదు… పైగా బీజేపీ నిఖార్సు స్వదేశీ మోడల్ ఆర్థిక విధానాన్ని చెబుతోంది… విపక్షాలన్నీ కస్సుమనడం ఖాయం… అసలే మైనారిటీ ప్రభుత్వం… ఆ షరతులు కూడా ఒక కోణంలో చూస్తూ దుర్మార్గం… మన నిస్సహాయతను ఆసరాగా తీసుకుని ఆడించడమే…
ఆ షరతుల్లో ప్రధానమైంది… సంస్కరణలకు కట్టుబడిన మనిషిని, అదీ రాజకీయాలకు అతీతంగా ఉన్న వ్యక్తిని ఆర్థికమంత్రిని చేయడం..! మొదట ఆర్థికవేత్త ఐజీ పటేల్‌ను అడిగారు, అనారోగ్యం పేరుతో ఆయన రానన్నాడు…
ఐఎంఎఫ్ సూచించిన జాబితాలో తరువాత పేరు మన్మోహన్ సింగ్… మొదట ఆయన నమ్మలేదు, కానీ పీవీ స్వయంగా మాట్లాడక అంగీకరించాడు… అంతకుముందు ఆర్థిక సలహాదారు కదా ఐఎంఎఫ్‌కు మన్మోహన్ గురించి తెలుసు… మన్మోహన్ వెంటనే రంగంలో దిగాడు…
మరో కీలక షరతు రూపాయి విలువను ఐఎంఎఫ్ సూచించిన మేరకు తగ్గించడం… జూన్ 30న 9 శాతం, జూలై రెండున మరో 11.83 శాతం మేరకు రూపాయి విలువను తగ్గించేసింది ప్రభుత్వం… తరువాత రోజు కోటా సిస్టం, ఎగుమతి ఆంక్షల తొలగింపును ప్రకటించింది…
ఆర్థిక సరళీకరణ ప్రారంభమైంది… జూలై 24న మన్మోహన్ తన ఫస్ట్ బడ్జెట్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల్లో 20 శాతం పెంపుదల ప్రకటించాడు… రెండు రోజుల తరువాత రైల్వే మంత్రి రైల్వే ఛార్జీలు పెంచేశాడు…
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల పాక్షిక ఉపసంహరణ, విదేశీ పెట్టుబడులకు ఆటో అప్రూవల్స్, ఎంఆర్టీపీసీ రద్దు, నల్లధనం వెల్లడికి పథకం వంటివి చకచకా నిర్ణయాలు వెలువడ్డాయి… సబ్సిడీలకు కత్తెర్లు మొదలయ్యాయ్… వీపీ సింగ్, సూర్జిత్, చంద్రశేఖర్, అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్, మధు దండావతే, యశ్వంత్ సిన్హా తదితరులు మండిపడుతున్నారు…
పీవీ, మన్మోహన్ మరుసటి రోజు దాదాపు సగం మంది ప్రతిపక్ష ముఖ్యుల్ని కలిశారు… క్రమేపీ రాజకీయాల దృష్టి ఇతర అంశాల వైపు మళ్లడంతో పీవీ ఆర్థిక విధానాల మీద పంచాయితీలు తగ్గిపోయాయ్… ఇవే ప్రధాన కారణాలు అని ముద్రవేయలేం గానీ 1996 ఎన్నికల్లో కాంగ్రెస్ బలం 140కు పడిపోయింది…!!
Share this Article