పత్రికల యజమానుల మీద వచ్చే ఆరోపణలకు తమ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా ఖండనలు, వివరణలు రాసుకోగలరు… టీవీ చానెళ్ల ఓనర్లు తమ వెర్షన్ చెప్పడానికి ప్రత్యేకంగా ఎపిసోడ్లు రన్ చేయగలరు… మరి చానెళ్లలో, పత్రికల్లో, సినిమాల్లో పనిచేసే ఆర్టిస్టులు తమపై జరిగే థంబ్ నెయిల్ దాడులకు వివరణ ఎలా ఇచ్చుకోవాలి..? ఏది మార్గం..? అసలు యూట్యూబ్ చానెళ్లు రాసేసుకునే రాతలకు వివరణలు ఇచ్చుకోవాలా..?
ఆదివారం మధ్యాహ్నం ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ చూస్తుంటే ఈ ప్రశ్నలే తలెత్తాయి… రష్మి, ఇంద్రజ, ఆది, పరదేశి, పొట్టి నరేష్ మీద వైరల్ అవుతున్న కొన్ని వార్తలకు ఈ షోలోనే వాళ్లతోనే జవాబులు ఇప్పించే ప్రయత్నం జరిగింది… కాస్త ఆసక్తిగానే అనిపించింది కానీ ప్రజెంటేషన్‌లో ఓవరాక్షన్, మరీ తెలుగు టీవీ సీరియళ్ల తరహా స్నాప్ షాట్స్ ఎక్కువై చివరలో కాస్త చిరాకు లేచింది… ఇక్కడ రెండుమూడు పాయింట్లు ఏమిటంటే…
ఈ షో నిర్మాతలకు ఈటీవీ కార్యక్రమాల మీద గ్రిప్ ఉంది… పైగా ఇంద్రజ, ఆది, రష్మి తదితరులకు గ్రిప్ ఉంది… వీళ్లు అడిగారు, ఏవో వివరణలు (వాటిల్లో ఏమీలేదు…) చెప్పారు… దాన్ని కూడా ఓ ఎంటర్‌టెయిన్‌మెంట్ బిట్ చేసిపారేశారు… కానీ అన్ని వినోద చానెళ్ల సీరియళ్లు, షోలు కలిపి వందల మంది పనిచేస్తున్నారు… చాలామంది పాపులర్… వారిపైనా ఇలాంటి థంబ్ నెయిళ్ల దాడి సాగుతూనే ఉంటుంది… అందరికీ ఇలాంటి చాన్స్ దొరుకుతుందా..?
Ads
కపిల్ శర్మ షో కావచ్చు, ఇంకేదో హిందీ షో కావచ్చు… ఎవరి మీదనైనా ఆసక్తికరమైన కామెంట్లు, ట్వీట్లు, మీమ్స్ వస్తే, వాటిని చూపిస్తూ, సరదా ప్రశ్నలు వేస్తూ ఎంటర్‌టెయిన్ చేయడం అలవాటే… ఇక్కడ అది కూడా లేదు… డ్రై ఆన్సర్స్… వేస్ట్ అటెంప్ట్ అనిపించింది… ఆ థంబ్ నెయిల్ జర్నలిజంలాగే వీళ్ల జవాబులు పెద్ద ఫ్రాంక్… ఎలాగంటే..?
రష్మికి ఎవరో హీరో విల్లా కొనిచ్చారు… ఇదీ వార్త… దానికి ఆమె రకరకాలుగా మూతి విరిచి, మొహం మడిచి, అటు తిప్పీ ఇటు తిప్పీ ఇచ్చిన సమాధానం ఏమిటంటే..? నేనే ఆ హీరో… నేనే కష్టపడి సంపాదిస్తున్నాను, నేనే కొనుక్కుంటున్నాను… సో వాట్ అని ప్రశ్నించింది… నరేష్ లోపం మీద డాక్టర్లు ఏం తేల్చేశారో తెలుసా..? ఇది మరో వార్త… నిజానికి చాన్నాళ్లుగా నరేష్‌కు పొటెన్సీ లేదనే రీతిలో దాదాపు ప్రతి ఎపిసోడ్‌లో ఎవరో ఒకరు ఎత్తిపొడుస్తూనే ఉంటారు… భయంకరమైన బాడీ షేమింగ్… నవ్వుతూనే భరిస్తాడు… తప్పదు కదా… ఈ ప్రశ్న, ఈ వార్తలోనూ అదే వెక్కిరింపు ఉంది… ఎగతాళి ఉంది…
దానికి తెలివిగా… అవును, డాక్టర్లు ఇక నువ్వు పొడవు పెరగవు అని తేల్చేశారు అన్నాడు… పరదేశి అని ఆమధ్య వ్యభిచారం కేసులో దొరబాబుతోపాటు అరెస్టయ్యాడు కదా… లేడీస్ హాస్టల్‌లో అన్నిరోజులు ఎందుకున్నాడో తెలుసా అని ఓ వార్త… అదీ తన వ్యవహార ధోరణి, అక్రమ సంబంధాల మీద వెగటు వెక్కిరింత… లేడీస్ హాస్టల్‌లో జెంట్స్‌ను ఒక్కరోజు కూడా ఉండనివ్వరు అని ఓ జవాబు పారేశాడు… ఇంద్రజ దానాలు ఎక్కువ చూసి, ఐటీ వాళ్లు దాడులు చేశారు అనేది మరో వార్త… దానికి కూడా ఆమె ఓవరాక్షన్ ఫోజులు పెట్టి… అన్ని దానాలు చేశాక నాదగ్గర ఏం మిగిలిందని ఐటీ వాళ్లు వస్తారు అన్నదామె…
హైపర్ ఆది తన ర్యాగింగ్ పంచుల్లాగే జవాబు ఇచ్చాడు… ఒక్కో స్కిట్‌కు ఆది ఎన్ని లక్షలు తీసుకుంటాడో తెలుసా..? అనేది వార్త… దానికి ఏదేదో సుత్తి ఉపోద్ఘాతం చెప్పి, ఇంత అంటూ చేతుల బార్లా చాపి వెళ్లిపోయాడు… ఈమాత్రం దానికి ఈ థంబ్ నెయిల్ ఎపిసోడ్ దేనికి పెట్టినట్టు ఈ షోలో..?! అసలు విషయం చెప్పుకుందాం…
థంబ్ నెయిల్ జర్నలిజం మీద అప్పుడప్పుడూ యాంకర్ ఆంటీ, హేమ ఆంటీ తదితరులు భగ్గుమంటుంటారు… నాలుగు రోజులు ఏ వార్త రాకపోతే వాళ్లే తట్టుకోలేరు… వాటికి విరుగుడు పీఆర్ టీమ్స్ మెయింటెయిన్ చేయడమే… సుడిగాలి సుధీర్ టీం ఈ విషయంలో యాక్టివ్… లేదంటే ఆ వార్తలు చూసి నవ్వుకోవడమే… వాటిని ఎవరూ నమ్మరు… సీరియస్‌గా తీసుకోరు… పెద్ద హీరోలు, దర్శకులు అస్సలు ఎవ్వడూ వీటిని పట్టించుకోరు… నిజానికి… జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ వంటి షోలలో కనిపించే వెకిలి బాడీ షేమింగ్, ఆది మార్క్ ర్యాగింగ్ పంచులు, ద్వంద్వార్థాలు, బూతులతో పోలిస్తే యూట్యూబ్ చానెళ్ల థంబ్ నెయిల్ జర్నలిజం పెద్ద ప్రమాదకరం ఏమీ కాదు… మరి మీరు కూడా ఉలిక్కిపడితే ఎలా..?
చివరగా :: జబర్దస్త్, డ్రామా కంపెనీ తదితర షోలలో కమెడియన్లుగానే కాదు, కేరక్టర్ ఆర్టిస్టులుగా కూడా రాణించగల వాళ్లున్నారు… రాఘవ… కొత్తగా వచ్చిన నూకరాజు… వచ్చే ఎపిసోడ్‌లో ఓ ట్రాజెడీ బిట్ చేశారు… లోన్ యాప్స్ రికవరీ టీమ్స్ దారుణాలు, ఆత్మహత్యల మీద ఓ స్కిట్… వాళ్లిద్దరూ మంచి యాక్టర్లే కాబట్టి బాగున్నట్టు ప్రోమోలో కనిపిస్తోంది… సరిగ్గా వాడుకోగలిగితే ఇమాన్యుయెల్ కూడా మంచి యాక్టరే… అక్కడున్న స్టార్ పంచ్ మాస్టర్లకన్నా చాలా బెటర్… వాళ్లకు థంబ్ నెయిల్స్ ఏం ఆనతాయి..? థంబ్ నెయిల్స్ పీకినా వాళ్లు డోన్ట్ కేర్…!!
Share this Article