మొన్నొకసారి కాసేపు… నిజంగా కాసేపే మాయాద్వీపం అనబడే ఓ రియాలిటీ షోను చూడటం తటస్థించెను… ఒకింత ఠారెత్తినట్టు అనిపించెను… ఆ దిక్కుమాలిన పిచ్చి సీరియళ్లే నయం కదా, ఆ దర్శకుల సాముగరిడీలు చూస్తూ కామెడీగా పడీ పడీ నవ్వుకోవచ్చు అని కూడా అనిపించెను… అసలు ఆ మాయాద్వీపంలో వేరే దెయ్యాలు, భూతాల సెట్లు దేనికి..? ఆ బవిరిగడ్డంతో ఓంకారన్నయ్యే ఓ పెద్ద మాయల ఫకీరులాగా ఉన్నాడు కదా అని నవ్వొచ్చెను… ప్రాణభీతితో వెంటనే చానెల్ మార్చేసి, ఈసారి బార్క్ రేటింగుల్లో దీని చోటు ఏమిటో చూడాలని బలంగా కోరిక కూడా కలిగెను… ఎవరు మీలో కోటీశ్వరులు ఫ్లాప్, మాస్టర్ చెఫ్ సూపర్ ఫ్లాప్ కదా… మరి దీని సంగతేమిటి..? అంతటి బిగ్‌బాస్ కూడా ఆశించినన్ని రేటింగ్స్ రావడం లేదు కదా… మరి ఈ మాయాద్వీపాలను, మంత్రతంత్రాలను జనం చూస్తున్నారా..?
తీరా చూస్తే… అనుకున్నది నిజమే… ముష్టి రెండున్నర రేటింగ్స్ కనిపించినయ్… అంటే ప్రేక్షకులు చీదరగా పక్కకు ఊడ్చేసినట్టు లెక్క… అప్పుడెప్పుడో మాయాద్వీపం సక్సెసైందని, మళ్లీ అదే వేషం వేస్తానంటే ఎలా..? పైగా ఇప్పటి పిల్లల టేస్ట్, రేంజ్, లెవల్ ఇప్పుడు మామూలుగా లేవు… వాళ్ల స్మార్ట్ ఫోన్లలోని గేమ్స్, ఇలాంటి మాయామంత్రాల షోలు, రియాలిటీ షోల నుంచి జీతెలుగు వైపు రప్పించాలంటే మాటలు కాదు, ఆ టాస్కులో ఓంకార్ ఫ్లాప్… వన్ సెకన్, వన్ సెకన్ అని భీకరంగా భయపెడితే సెలబ్రిటీలు భయాన్ని, వినోదాన్ని నటిస్తారేమో… కానీ పిల్లలు అలా కాదు, వాళ్లను ఎంగేజ్ చేయడం, ఎంటర్‌టెయిన్ చేయడం అంత వీజీ కాదు…
Ads
నిజానికి మన టీవీల్లో వచ్చే రియాలిటీ షోలలో కిట్టీ పార్టీలు, వెగటు కామెడీ తప్ప భిన్నత్వం పెద్దగా కనిపించదు… పిల్లల షోలు అసలే ఉండవు, మంచి ప్రోగ్రాం నాణ్యమైంది వస్తే జనం చూస్తారు… కానీ ఆ గ్యాప్ ఫిలప్ చేయడంలో జీతెలుగు సక్సెస్ కాలేదు, ఈటీవీకి, మాటీవీకి ఆ సోయే లేదు… నిజానికి రియాలిటీ షోల విషయంలో ఈటీవీని కొట్టే చానెల్ లేదు… అసలు ఈటీవీ బతుకుతున్నదే రియల్ న్యూస్ బులెటిన్, రియాలిటీ షోల రేటింగులతోనే…! మిగతా ఒక్క ప్రోగ్రామూ చూడబుద్ది కాదు, ఆ సీరియళ్లయితే చెప్పనక్కర్లేదు… తెలుగు టీవీ ప్రేక్షకుల పాలిట భూతాలు, శాపాలు… అందుకే మూడో స్థానంలో కొట్టుకుంటూ ఉంది…
మాటీవీ వాడికి బిగ్‌బాస్ మినహా వేరే రియాలిటీ షో చేతకావడం లేదు… స్టార్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ వంటివి ప్లాన్ చేస్తున్నా ఒక్కటీ క్లిక్ కావడం లేదు… జీతెలుగు వాడు కూడా ఈ మాయాద్వీపాలు చేస్తున్నా అవీ అంతే… నేలబారు ఫలితం… మరోవైపు ఈటీవీలో క్యాష్, వావ్ వంటివి కూడా అంతోఇంతో రేటింగ్స్ సాధిస్తుంటయ్… ఆ షోలలో నవ్యత, నాణ్యత పెద్దగా లేకపోయినా సాయికుమార్, సుమ హోస్ట్ చేస్తుంటారు కాబట్టి కాస్త ప్రేక్షకాదరణ వస్తోంది… ఈటీవీకి బలం జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్… అందుకని మాటీవీ వాడు తెలివిగా జబర్దస్త్‌ను కార్నర్ చేస్తున్నాడు ఈమధ్య… తమ రేటింగ్స్ ఎలా ఉన్నా, పోటీ చానెల్ రేటింగ్స్ పడిపోతే నయమే కదా… ఓసారి ఈ చార్ట్ జూమ్ చేసుకుని చూడండి…
నిజానికి బిగ్‌బాస్ షోతో మాటీవీ వాడు ఆశించినంతగా మంచి రేటింగ్స్ ఏమీ రావడం లేదు… కానీ వాళ్లు పోగ్రామ్స్ టైమింగు, అడ్జస్ట్‌మెంట్ విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్నారు… మామూలు రోజుల్లో పది గంటలకు షో… అంటే ప్రైమ్ టైమ్‌లో రెండు సీరియళ్లకు అలాగే ప్లేసు ఉంది… ఆ రేటింగ్స్ యాడ్ అవుతున్నయ్… బిగ్‌బాస్ చూసేవాడు ఎలాగూ చూస్తాడు… ఇక శనివారం, ఆదివారాల్లో 9 గంటలకే నాగార్జున వీకెండ్ షో ఉంటుంది… అది ఈటీవీ జబర్దస్త్‌కు తాకుతోంది… కొన్నిసార్లు సాయంత్రం ఆరు గంటల నుంచి పదీపదిన్నర దాకా వీకెండ్ షో నడిపించిన రోజులు కూడా ఉన్నయ్… అంతసేపూ ఈటీవీ, జీ షోలకు పడ్డట్టే దెబ్బ… అందుకే గతవారం బార్క్ రేటింగ్స్ చూస్తే జబర్దస్త్, ఎక్సట్రా జబర్దస్త్ బాగా తగ్గిపోతున్న ట్రెండ్ గమనించొచ్చు… కాకపోతే మాటీవీ వాడు ఎంత ప్రయత్నించినా సరే, సండే శ్రీదేవి డ్రామా కంపెనీని కొట్టలేకపోతున్నాడు… అది బాగా పికప్ అయిపోయింది… మరోవైపు స్టార్ మ్యూజిక్, కామెడీ స్టార్స్ నేలబారు రేటింగులతో చతికిలపడిపోయాయ్… వినోద చానెళ్ల నడుమ ఇదండీ పోటీ తీరు…!!
Share this Article