ట్రైబల్ వెల్ఫేర్ ఇంజనీర్ జగజ్యోతి ఇంట్లో 65 లక్షల క్యాష్‌తోపాటు 3.6 కిలోల బంగారం దొరికిందట… అఫ్ కోర్స్, ఆమె అక్రమార్జన స్థాయికి ఆ కోటిన్నర విలువైన బంగారు నగలు ఉండటం పెద్ద ఆశ్చర్యమేమీ కాకపోవచ్చు, పైగా దొరకని వేలాది మంది అక్రమార్కుల ఇళ్లల్లో అంతకు చాలా చాలా ఎక్కువ బంగారమూ ఉండొచ్చు…
గతంలో తులం బంగారం కొనడమంటే గగనం… ఇప్పుడు పూచికపుల్ల చందం… కిలో బంగారం అంటే కూడా ఓసోస్ అంతేనా అనే కేరక్టర్లు మన చుట్టే బోలెడు మంది… అందుకే ఆ జగజ్యోతి ఇంట్లో మూడున్నర కిలోల బంగారం వార్త పెద్దగా కనెక్ట్ కాలేదు, కానీ జయలలిత బంగారం వార్త మాత్రం ఆసక్తికరం అనిపించింది… అప్పట్లో జయలలిత నుంచి ఆమె ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు కదా… వాటి బరువు ఎంతో తెలుసా..? 27 కిలోలు… బంగారం అంటే ఆమెకు ఎంత పిచ్చో అలా పోగేసిన ఆభరణాలే చెబుతున్నాయి…
రకరకాల డిజైన్లు, దేహం నిండా ధరించే ఆభరణాలు… కళ్లు జిగేలు… ఇప్పటి ధరల్లో దాదాపు 16 కోట్ల పైమాటే… ఇన్ని ఆభరనాలు ఏం చేసుకునేది అనే ప్రశ్నే కరెక్టు కాదు… నిజానికి సగటు మహిళకు బంగారు ఆభరణం అంటే అలంకరణ మాత్రమే కాదు, ఇంట్లో ఉన్న బంగారం ఓ ఆర్థిక భరోసా… ఆపదలో కూడా ఆదుకునే డిపాజిట్… దాంతోపాటు హోదా, ప్రదర్శన, మురిపెం ఎట్సెట్రా… మరి జయలలితకు..? ఆమె కూడా ఆడదే కదా… వందల కోట్ల ఆస్తులతోపాటు బోలెడంత బంగారాన్ని కూడబెట్టుకుంది… బంగారం ధరించడం ఆమెకు పిచ్చి గనుక…
Ads
ఈ 27 కిలోలే కాదు, శశికళ దాచిపెట్టిన బంగారం ఎంత ఉందో తెలియదు, అదేమైందో ఆమెకే తెలియాలి… అప్పట్లో ఈ బంగారం మొత్తం తూచి, లెక్కలేయడానికి స్పెషల్ కోర్టుకు నాలుగు రోజులు పట్టిందని ఓ వార్త చదివినట్టు గుర్తు… అంతేకాదు, శపథాలు చేసే అలవాటు కదా… నేను అక్రమాస్తుల కేసుల నుంచి బయటపడేవరకూ ఒక్క చిన్న ఆభరణమూ ధరించను అని శపథం చేసిందట… కానీ ఆ కేసేమో ఎంతకూ తెగదు, ఆభరణాలు ధరించకుండా ఉండలేదు…
దాంతో మెల్లిగా ఒక ఉంగరంతో స్టార్ట్ చేసి, గోల్డ్ వాచి యాడ్ చేసి, తరువాత చెవి రింగులు పెట్టి… బోసిగా కనిపిస్తే కేడర్ ఒప్పుకోవడం లేదని చెప్పిందట… కానీ అంత బంగారం పోగేసుకుని ఏం సాధించింది..? నిజం చెప్పాలంటే అనామకంగానే మరణించింది… ఎవరూ లేరు, ఏమవుతుందో తెలియని ఆ శశికళ తప్ప…
ఇప్పుడు కోర్టు ఆరు ట్రంకు పెట్టెల్లో ఉన్న ఆ బంగారాన్ని తీసుకుపోవాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది… వేలం వేసుకోవచ్చునని చెప్పింది.,. స్టాలిన్ ఏం చేస్తాడు..? పోయెస్ గార్డెన్‌ను జయ స్మారకం చేసి, ఓ మ్యూజియం పెట్టి, అందులో ఆమె ఆభరణాలు, వందల జతల చెప్పులు, హ్యాండ్ బ్యాగులు, దుస్తులు ఏమీ పెట్టడు… ఎంచక్కా వేలం వేసి, ఆ సొమ్ము ట్రెజరీకి జమచేస్తాడు, ఆమె జ్ఞాపకాల్ని తనెందుకు భద్రపరుస్తాడు..? సో, ఖేల్ ఖతం… ఇక్కడొక చిన్న ట్విస్టు ఉంది…
జయలలిత స్వయంగా సంపాదించిందే అక్రమ సొమ్ము, కానీ ఆమెకు వారసత్వంగా వచ్చిన నగలకు అక్రమాల మకిలి లేదు కదా, అందుకని ఆ 7 కిలోలను మాత్రం వేలం వేయకండి, వారసులకు ఇవ్వండి అని చెప్పింది కోర్టు… మళ్లీ ఓ ప్రశ్న… ఎవరు ఆమె వారసులు..? ఆమె మరణించాక చాన్నాళ్లు ఇదే పంచాయితీ కదా కోర్టుల్లో… బహుశా ఆమె మేనకోడలు దీపకు ఆ నగలు దక్కుతాయేమో… అవునూ, ఆ జయలలిత హైదరాబాద్ భూములు ఏమయ్యాయి..?
ఇప్పుడు వందల కోట్ల ప్రాపర్టీ… రేవంత్ రెడ్డి గనుక కాస్త తవ్వితే చాలా బాగోతాలు బయటపడతాయట.,. ఏమో, బీఆర్ఎస్ ప్రముఖుల జాతకాలే దొరకొచ్చు… ఐనా ఎందుకులెండి, ఎక్కువ తవ్వితే అవి ఇంకెవరి పునాదుల దాకా వెళ్తాయో…!!
Share this Article