.
ముందుగా విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ పేరిట డిజిటల్ మీడియాలో కనిపిస్తున్న ఓ ప్రకటన చూడండి…
చట్టప్రకారమే నిర్వహిస్తున్న స్కిల్ బేస్డ్ గేమ్స్ కు మాత్రమే ప్రకటనలు చేసిన హీరో విజయ్ దేవరకొండ… ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ గేమ్స్ అనుమతి ఉన్న ప్రాంతాలకు మాత్రమే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు…
Ads
విజయ్ దేవరకొండ ఏ యాడ్ చేసినా, ఏ కంపెనీకి ప్రచారకర్తగా ఉన్నా ఆ కంపెనీని లీగల్ గా నిర్వహిస్తున్నారా లేదా అనేది ఆయన టీమ్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. ఆ కంపెనీ లేదా ప్రాడక్ట్ కు చట్టప్రకారం అనుమతి ఉంది. అనుమతి ఉన్న ఏ 23 అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. రమ్మీ స్కిల్ బేస్డ్ గేమ్ అని గతంలో పలుమార్లు గౌరవనీయ సుప్రీం కోర్టు తెలియజేసింది.
ఏ 23 అనే కంపెనీతో విజయ్ దేవరకొండ ఒప్పందం గతేడాది ముగిసింది. ఇప్పుడు ఆ సంస్థతో విజయ్ కు ఎలాంటి సంబంధం లేదు. విజయ్ దేవరకొండ విషయంలో పలు మాధ్యమాలలో ప్రసారమవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. విజయ్ ఇల్లీగల్ గా పనిచేస్తున్న ఏ సంస్థకూ ప్రచారకర్తగా వ్యవహరించలేదు.
పీఆర్ టీమ్
విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండపై ఎఫ్ఐఆర్ అనేది నిజం… ఇందులో ప్రసారమాధ్యమాలను నిందించడం దేనికి…? మీడియా చేస్తున్న ఆరోపణ కాదు, ఇది పోలీస్ కేసు… ఇదుగో ఎఫ్ఐఆర్…
ఆన్ లైన్ స్కిల్ బేస్డ్ అనుమతి ఉన్న ప్రాంతాలకే విజయ్ దేవరకొండ ప్రచారకర్తగా పరిమితమయ్యారు అంటున్నారు కదా… సదరు ఏ23 సంస్థను ప్రమోట్ చేస్తూ చేసే డిజిటల్ ప్రకటనలు అన్నిచోట్లా కనిపిస్తాయి కదా… ఇదొక సందేహం… కొన్ని ప్రాంతాలకే ఎలా పరిమితం చేయగలరు డిజిటల్ ప్రకటన వ్యాప్తిని..?
ఐతే విజయ్ దేవరకొండ పీఆర్ టీమ్ ఒకరకంగా తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌ను తప్పుపడుతున్నట్టుగా ఉంది… ప్రసార మాధ్యమాలను ప్రస్తావిస్తున్నా సరే ఆ పీఆర్ టీమ్ ప్రకటన పోలీసులను ఉద్దేశించే అనుకోవాలా..?
ఇప్పుడు ఒప్పందం ముగిసింది అనే పాయింట్ లో పంచ్ లేదు… ఐతే ఆ టీమ్ లేవనెత్తిన మరో పాయింట్ విలువైంది… కొంత ట్విస్టు కూడా ఉంది… సో, నిజంగానే పోలీసులు దీనిపై చార్జ్‌షీట్ వేస్తే, విజయ్ లీగల్ టీమ్‌కూ పోలీసు లాయర్లకూ మంచి ఆసక్తికరమైన న్యాయపోరాటం జరిగే చాన్స్ మాత్రం ఉంది… ఎందుకంటే..?
సుప్రీంకోర్టు రమ్మీని ‘స్కిల్ గేమ్’గా పరిగణించింది అనేది విజయ్ టీం వాదన… సుప్రీంకోర్టే స్కిల్ గేమ్ అంటున్నప్పుడు ఇక ఆ గేమ్‌ను ప్రమోట్ చేస్తే తప్పెలా అవుతుందనేది ఆ వాదన సారాంశం… ఎస్…
దీనిపై కొంత సమాచారం (Subject to Correction) ఏమిటంటే… భారత సుప్రీంకోర్టు రమ్మీని “స్కిల్ గేమ్” (నైపుణ్య ఆధారిత ఆట)గా పరిగణించింది. ఈ నిర్ణయం 1968లో “స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ కే. సత్యనారాయణ” కేసులో వెలువడింది. ఈ తీర్పులో, సుప్రీంకోర్టు రమ్మీ అనేది పూర్తిగా అదృష్టంపై ఆధారపడిన ఆట కాకుండా, ఆటగాళ్ల నైపుణ్యం, వ్యూహం, మరియు తార్కిక ఆలోచనలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుందని స్పష్టం చేసింది. అందువల్ల, ఇది జూదం (గేమ్ ఆఫ్ చాన్స్) కాదని, నైపుణ్య ఆధారిత ఆటగా వర్గీకరించబడిందని తేల్చింది…
ఈ తీర్పు తర్వాత వివిధ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాలు అనేక సందర్భాలలో సమర్థించాయి. ఉదాహరణకు, 1996లో “డాక్టర్ కె.ఆర్. లక్ష్మణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు” కేసులో కూడా రమ్మీని స్కిల్ గేమ్‌గా గుర్తించడం జరిగింది. కానీ రాష్ట్రాల వారీగా నిబంధనలు వర్తిస్తాయి (ఉదాహరణకు, కొన్ని రాష్ట్రాల్లో ఆన్‌లైన్ గేమింగ్‌పై పరిమితులు ఉన్నాయి).
తెలంగాణలో ఆన్‌లైన్ గేమింగ్‌పై పూర్తి నిషేధం లేదు, కానీ కొన్ని రకాల ఆన్‌లైన్ గేమింగ్, ముఖ్యంగా నగదు పందెం (real money gaming) ఉన్న గేమ్‌లపై నిషేధం ఉంది. 2017లో, తెలంగాణ ప్రభుత్వం “తెలంగాణ గేమింగ్ (సవరణ) ఆర్డినెన్స్” జారీ చేసింది, దీని ద్వారా “తెలంగాణ గేమింగ్ యాక్ట్, 1974″ని సవరించారు. ఈ చట్టం ప్రకారం, అదృష్టం (chance) ఆధారిత గేమ్‌లు, ముఖ్యంగా డబ్బు పందెం ఉన్నవి, రాష్ట్రంలో నిషేధించబడ్డాయి. ఇందులో ఆన్‌లైన్ రమ్మీ, పోకర్ వంటి గేమ్‌లు కూడా వస్తాయి, ఒకవేళ అవి నగదు పందెంతో ఆడితే…
అంటే… తెలంగాణలో ఈ గేమ్‌ను ఆన్‌లైన్‌లో నగదు పందెంతో ఆడటం చట్టవిరుద్ధంగా పరిగణించబడుతుంది. 2022లో, తెలంగాణ హైకోర్టు కూడా ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని సమర్థించింది, మరియు ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్‌పై నిషేధాన్ని కొనసాగించాలని ఆదేశించింది. కానీ, స్కిల్ ఆధారిత గేమ్‌లు డబ్బు లేకుండా (ఉచితంగా) ఆడితే వాటిపై నిషేధం లేదు… సో, విజయ్ దేవరకొండ టీమ్ వాదన లీగల్‌గా ఎంతమేరకు నిలుస్తుందో చూడాల్సి ఉంది…
Share this Article