జ్యోతిష్కుల బండారం జ్యోతిష్కులకే ఎరుక… చెప్పాలి, వాళ్లే చెప్పాలి, జ్యోతిష్యంలో అడుగుపెట్టే వైరసులను వాళ్లే బయటపెట్టాలి… పెడుతున్నారు కూడా కొందరు..! ఉదాహరణకు పెళ్లిళ్లలో చూడబడే వివాహపొంతన..! పూర్వకాలం నుంచి కూడా పెళ్లిళ్లు అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడమన్నారు తప్ప, ఆయా వంశాలకున్న పేరును పరిగణనలోకి తీసుకోమన్నారు తప్ప, వివాహపొంతనలో పాయింట్లు, అనగా గుణాల ఆధారంగా మాత్రమే నడుచుకొమ్మని ఎవరూ చెప్పలేదు…
కొన్నేళ్ల క్రితం వరకు కూడా… ఈ పాయింట్లు, గుణాల లెక్కలేవీ చూసేవాళ్లు కాదు… కొన్ని కులాల్లో కేవలం గోత్రాలు చూస్తారు… స్వగోత్రం లేకపోతే చాలు… నిజానికి అది మంచిదే… కొన్ని కులాల్లో మరీ శాఖాభేదాల దాకా చూసి, లెక్కలు వేసి మరీ పెళ్లిళ్లు ఖరారు చేసేవాళ్లు… ఇప్పుడు వాళ్ల కులాల్లో ఆడపిల్లలే తగ్గిపోవడంతో ఇతర కులాల పిల్లల్ని కూడా చేసేసుకుంటున్నారు… వైశ్యుల్లో గతంలో మూడు గోత్రాలు చూసేవాళ్లు… క్రమేపీ అది రెండు గోత్రాలకు తగ్గిపోయింది, ఇప్పుడు మొదటి గోత్రం చూస్తున్నారు…
కొన్ని కులాల్లో గోత్రాలు గట్రా ఏవీ చూడరు… పిల్ల, పిల్లవాడు పరస్పరం మెచ్చాలి… చదువు, కొలువు, ఆస్తులు, ఆయా కుటుంబాలకున్న పేరు గట్రా చూసేసి పెళ్లిళ్లు ఫైనల్ చేస్తున్నారు… ఐనా, ఇవ్వాళారేపు ఖండాంతరాలు, మతాంతరాలు, కులాంతరాలు, దేశాంతరాలు జరుగుతూ ఉంటే… ఇంకా గోత్రాలు ఏమిటి..? ఈ గుణ గణన ఏమిటి అంటారా..? అదీ నిజమే… విషయం ఏమిటంటే… కొన్నేళ్లుగా ఈ గుణాలు అనబడే పాయింట్ల పిచ్చి మొదలైంది…
Ads
అన్నీ బాగున్నా సరే, గుణాలు తక్కువ అంటూ ఆగిపోతున్నారు… అదేమంటే, అందరూ చూస్తున్నారు, సంప్రదాయం, జాతకాలు కలవకపోతే పెళ్లిళ్లు నిలబడవు కదా అంటారు.., సంతాననష్టం, సయోధ్యలోపం వంటి నష్టాలు చూపిస్తుంటారు… నిజానికి అద్భుతంగా జాతకాలు కలిసిన జంటలు నాలుగురోజులకే విడిపోతే కూడా మళ్లీ ఎవరూ మాట్లాడరు…
వివాహపొంతనలోనూ మళ్లీ ఎనిమిది విభాగాలు… ఒక్కో విభాగంలో అమ్మాయి వైపు నుంచి, అబ్బాయి వైపు నుంచి అంచనా… వెరసి సగం మార్కులకు పైన రావాలి… లేకపోతే తూచ్… అందులో కొన్ని లోపాలకు ఉపశమనం, శాంతి లభిస్తాయి… కులాల వారీ పొంతనలు కూడా లెక్కిస్తారు… తారాబలం లేకపోతే అమ్మాయిల పేర్లు మార్చేస్తారు… అదీ తాత్కాలిక, అవకాశవాద పరిష్కారమే… పుట్టుక సమయాన్ని బట్టి రాశిని, నక్షత్రాన్ని తేల్చేశాక, ఇక ఎన్ని పేర్లు మార్చినా సరే, ఒరిజినల్ పేరే కదా ఆమె గ్రహస్థితిని, భవిష్యత్తును నిర్ధారించేది… మరిక పేర్లు మార్చితే జాతకం ఎలా మారుతుంది..?
ఈ వీడియో ఒకటి బాగుంది… తారాబలం కాదురా బాబూ, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేయండి… అటూ ఇటూ కుటుంబాల స్థితిగతులు చూసుకొండి… అన్నీ కుదిరితే చేసేయండి, జాతకాలు కుదరడం లేదని, పాయింట్లు ఎక్కువ లేవని పెళ్లిళ్లు చెడగొట్టుకోవద్దు అని హితవు చెబుతున్నాడు… వీలయితే గోత్రాలు చూడండి చాలు అంటున్నాడు… చాలా సింపుల్‌గా నిమిషంలో తేల్చేశాడు ఈ జాతకాల లెక్కల కోసం ఆందోళనకు గురికావద్దు అని… ఆలోచనాత్మకమే… ఇవిగో, ఇలాంటివే అవసరం…
Share this Article