రివ్యూయర్ :: Prasen Bellamkonda………… జీవితం నీకు రెండో అవకాశం ఇవ్వదు అనే నిజాన్ని అబద్దం చెయ్యడానికి టైం లూప్ అనే ఊహాత్మాక శాస్త్రీయ సంభవాన్ని కేంద్రం చేసుకుని ఓ కధ అల్లుకుంటే అదే కుడి ఏడమైతే వెబ్ సిరీస్… ఆహా ఓటిటి కంటెంట్ మీద ఉన్న అపనమ్మకంతో నిర్లిప్తంగానే ‘కుడి ఏడమైతే ‘ చూడడం మొదలెడితే… అలా లాక్కెళ్లిపోయింది కన్ఫ్యూజింగ్లీ గ్రిప్పింగ్ గా… నిజంగా ఇది ఆహా తరహా వెబ్ సిరీస్ కాదు… నాకైతే నచ్చింది… పోతురాజు సినిమా చాలా ఏళ్ళ క్రితం థియేటర్ లో చూస్తున్నపుడు నా వెనుక నుంచి ఓ ప్రేక్షకుడు వీడేంట్రా చూపించిందే మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాడు అని పెద్దగా అరిస్తే నాకు నవ్వొచ్చింది… ఎలాగో తెలీదు గానీ నాకు అప్పటికే అకిరా కురసోవా స్క్రీన్ ప్లే తెలుసు కనుక నేను ఎంజాయ్ చేస్తున్న సందర్భంలో… ఆ ప్రేక్షకుడి విసుగు నాకు అసమంజసంగానూ, మరో వైపు సమంజసంగానూ అనిపించింది… ఇప్పుడు ఈ కుడి ఏడమైతే చూసేప్పుడు కూడా ఆ సమంజసాసమంజస కన్ఫ్యూజన్ ఎదురైనా థ్రిల్లింత మాత్రం దొరుకుతుంది….
The time loop or temporal loop is a plot device in fiction whereby characters re-experience a span of time which is repeated, sometimes more than once, with some hope of breaking out of the cycle of repetition.
Ads
ఒక సమయంలో మనకు జరిగింది మళ్ళీ జరగడం అనే కాన్సెప్ట్ తీసుకుని, దాన్ని మార్చాలని చూస్తే ఒకరకంగా.., ఉన్నది ఉన్నట్టు స్వీకరిస్తే మరోరకంగా జరగడం అనే విచిత్రంలోకి మనం వెళ్లడం అనే అనుభవాన్ని కలిపి, ఇద్దరు వ్యక్తులకు ఇదే జరిగి. ఆ ఇద్దరూ ఒకే టైం లూప్ లో ఉంటేనో… అన్న ఊహతో అల్లుకున్న కధ ఇది. అయోమయంగా ఉంది కదూ… అవును అలానే ఉంటది… అయినా బాగుంటది… సన్నివేశాలు రిపీట్ అయినట్టు కనిపించినా, ప్రతి రిపీటీషన్ లో చిన్న చిన్న తేడాలుంటాయి జాగ్రత్తగా చూడాలి… అన్ని ఓటిటిలను చూసినట్టు మంచం మీద పడి దొర్లుతూ, ఫోన్లో వాట్సాప్ చెక్ చేసుకుంటూ, అరకొర ధ్యాసతో చూస్తే ఇక్కడ కుదరదు…
దర్శకుడు స్క్రీన్ ప్లే మీద సాము నైపుణ్యంగా చేసాడు… చివరికో ముడి విప్పకుండా సీజన్ టూ కు పునాది వేసుకోవడం బాగుంది.. అమలాపాల్ బాగా చేసింది ఎప్పటిలానే… రాహుల్ ప్రామిసింగ్ గా వున్నాడు. జీవితం సెకండ్ ఛాన్స్ ఇస్తే… అనే అంశాన్ని కధగా చేసుకుని పూరీ జగన్నాద్ తీసిన ‘దేవుడు చేసిన మనుషులు’, పెద్ద నరేష్ హీరోగా జయసుధ ప్రొడ్యూస్ చేసిన ‘అదృష్టం’ ఇలాంటివే… ఇంగ్లీషు’ స్లైడింగ్ డోర్స్’ ఈ కధలకు మూలం. కుడి ఏడమైతేలో దాన్ని టైం లూప్ లోకి మార్చాడు దర్శకుడు… హాలీవుడ్ లో ఈ టైం లూప్ కధగా బిఫోర్ ఐ ఫాల్, బ్లడ్ పంచ్, ఎండ్ లెస్ లాంటి చాలా సినిమాలున్నా మనకు కొత్తే… కనుక ఒక కొత్త ఐడియాతో ధైర్యంగా ముందుకు వచ్చినందుకు భుజం తట్టి చూడడం సినిమా పిచ్చోళ్ళుగా మన కర్తవ్యమూ బాధ్యతా కదా… చూసేయండి… (స్టోరీ నచ్చితే దిగువన కోడ్ స్కాన్ చేయండి, ముచ్చటకు అండగా నిలవండి…)
Share this Article