Muchata.com Latest Telugu News

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ములాయం పద్మవిభూషణ్‌పై… వాట్సప్ యూనివర్శిటీ తప్పుగెంతులు…

January 27, 2023 by M S R

ఇది సోషల్ మీడియాలోనే ఎక్కడో దొరికింది… ఈ బీజేపీ వాట్సప్ యూనివర్శిటీకి ఏం ప్రచారం చేయాలో, ఏం చెప్పుకోకూడదో తెలియదని మరోసారి స్పష్టమైంది… నిజంగా చెప్పదగిన విషయాల్ని జనంలోకి తీసుకువెళ్లడం వీళ్లకు చేతకాదు, అభూతకల్పనల్ని ప్రచారం చేసుకుంటూ మరింత అభాసుపాలు అవుతుంటారు… మోడీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే, దానికి ఓ జస్టిఫికేషన్ అవసరమా..? అలాంటప్పుడు రైతు చట్టాన్ని వాపస్ తీసుకుని, జాతికి క్షమాపణ చెప్పిన అవమానకర నిర్ణయంపై జస్టిఫికేషన్ ఏది… జస్ట్, ఉదాహరణ అది… సరే, ఇదొక్కసారి చదవండి…


‘‘కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులలో అయోధ్యలో కరసేవకులపై తుపాకీగుళ్ళవర్షం కురిపించిన ములాయం సింగ్ యాదవ్ పేరు ఉండడం చాలా మందికి మింగుడుపడడం లేదు. పైగా ఒక పెద్దాయన (పత్రికారంగ అనుభవంలో తలపండిన ) కూడా చిన జీయర్ స్వామికి పద్మభూషణ్ ఇచ్చి, కరసేవకులను చంపించిన ములాయం ఏదో పెద్ద గొప్పవాడైనట్లు పద్మవిభూషణ్ ఇవ్వడం సబబు కాదంటూ కేంద్రాన్ని ఎగతాళి చేస్తూ ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
ముందుగా మన ప్రధాని విషయంలో మనమంతా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ఆయనకు దేశ రక్షణ, దేశప్రగతులే అన్నింటికన్నా మిన్న.
ఆయన నిర్ణయాలన్నీ దేశ భక్తులకు తగినట్లుగానే ఉంటాయి. దేశ భక్తులను ఆయన గౌరవించినట్లుగా ఏ ప్రధాని కూడా ఇంతవరకూ చేయలేదన్నది సుస్పష్టం. అందువలన మోదీని అర్థం చేసుకోవడంలో చాలామంది పప్పులో కాలేస్తూ జారి పడుతున్నారు. ఇక విషయంలోకి వెళ్దాం……
చైనావాడు 2017 లో అణ్వస్త్రాలు లోడ్ చేసిన జలాంతర్గాములను బంగాళాఖాతంలో మొహరించాడు. పాకిస్థాన్ లోని కొన్ని ప్రాంతాలలో అణ్వస్త్రాలను భూమిలో కప్పి ఉంచి భారత్ పై పాకిస్తాన్ ద్వారా అణ్వస్త్ర దాడి చేయాలని ప్లాన్ చేసాడు. నిన్ననే అమెరికా మాజీ విదేశాంగ శాఖ సెక్రటరీ మైక్ పాంప్ కూడా దీనిని ధ్రువపరచడం జరిగింది. అయితే మరి మనపై దాడి ఎందుకు జరగలేదు? ఎందుకంటే…..
ఫ్లాష్ బాక్ కి వెళ్తే…. అప్పటి ప్రధాని వాజపేయి కొంతమంది దేశభక్తుల టీమ్ ను రహస్యంగా చైనాలో తయారుచేశాడు. ఆ టీమ్ ను వాజపేయి తదనంతరం కూడా పోషించింది ములాయం సింగ్ యాదవ్… 2017 లో మోడీ నేతృత్వంలో త్రివిధ దళాధిపతులతో మీటింగ్ జరిగింది. సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ కూడా అందులో పాల్గొన్నారు. ఆ మీటింగ్ కూడా ప్రధాని నివాసంలోని (7, లోకకళ్యాణ్ మార్గ్ ) కాన్ఫరెన్స్ రూమ్ లో కాకుండా ప్రధాని నివాసంలోని న్యూక్లియర్ బంకర్ లో జరిగింది. ఆ మీటింగ్ కోసం ములాయం సింగ్ కి కూడా కబురు వెళ్ళడం, ఒక గంటలో ఆయన జాయిన్ అవ్వడం చకచకా జరిగిపోయాయి.
ఆ మీటింగ్ లో ములాయం వివరించిన రహస్యాలు అక్కడి వారందరూ నివ్వెరపోయేలా చేసాయి. మనకు అణు దాడి పాక్ నుంచి కాదనీ… దానిని అడ్డు పెట్టుకుని చైనా చేస్తుందని ములాయం హెచ్చరిక చేయడం జరిగింది. తరువాత మీటింగ్ లోని వారికి చైనాలోని మన ఏజెంట్ల గురించి ములాయం చెప్పడం…. వారితో మాట్లాడించే ప్రయత్నం చేసినపుడు…. వారు తాము వాజపేయితో మాత్రమే విషయాలు పంచుకోగలమని తేల్చి చెప్పారు. వాజపేయి గారింటికి మన గూఢచారులను పంపి, వారితో వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేశారు….
వాజపేయి ఆ చైనాలోని మన ఏజెంట్లకు మోదీ ప్రభుత్వం దేశభక్తిని శంకించవలదని చెప్పగా…. వారు మన ప్రధానికి నివ్వెరపోయే నిజాలను…. చైనా వాడి లుచ్ఛాపనులను… ఏకరువు పెట్టారు. వారి మాటలన్నీ కూడా ములాయం చెప్పిన విషయాలను ధ్రువపరుస్తున్నాయి. దానితో షాక్ అయిన మన నాయకులు.. చైనావాడు ప్లాన్ చేస్తున్న అణు దాడికి ప్రతీకార చర్యలు తీసుకుని…. ఆ చైనాలోని మన ఏజెంట్ల సాయంతో పాక్ లో కప్పి ఉంచిన అణ్వస్త్రాలను డిఫ్యూజ్ చేయించడం జరిగింది.
మన దేశానికి పెను ప్రమాదం తప్పింది. ఇప్పుడు చెప్పండి…. ములాయం కు పద్మభూషణ్ ఇవ్వాలా?….. వద్దా? మన ప్రధాని ఏమి చేసినా దాని వెనుక ఎంతో కథ ఉంటుందని గ్రహించండి. ప్రతీ విషయం ఆయన దేశంతో పంచుకోలేరు. దేశ రహస్యాలను కాపాడాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. దేశ భక్తులను గౌరవించాల్సిన అవసరాన్ని ఆయన మనకు తెలియజేస్తున్నారని గ్రహించండి. ఆయనపై విశ్వాసం ఉంచుదాం….. 2024 లో కూడా దేశాన్ని దేశభక్తుల చేతిలోనే పెడదాం….


కథనం ఆర్ఆర్ఆర్ స్థాయిలో, విజయేంద్ర ప్రసాద్ రాసిన కథలాగే ఉంది… కానీ ఈ వాట్సప్ యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఇదే బాధ… జనం నవ్వుకుంటారనే సోయి లేకపోవడం..! వాజపేయి రహస్యంగా చైనాలో మన ఏజెంట్ల టీం క్రియేట్ చేశాడట… దానికి ములాయం లీడరట… ఇక నమ్మడానికి ములాయమే ఎందుకు దొరికాడో ఆయనకు..?! పైగా ములాయం కాషాయ క్యాంపుకి అత్యంత బద్ధవ్యతిరేకి… ఆర్ఎస్ఎస్‌కు ములాయం విషయంలో, తన హిందూ వ్యతిరేకతపై, ఆజంఖాన్ వంటి దేశవ్యతిరేకులతో ములాయం మిలాఖతైన తీరుపై ఆగ్రహం…

mulayam

తనకు రెండో అత్యున్నత పౌరపురస్కారం పద్మవిభూషణ్ ఇవ్వడం మీద ఆర్ఎస్ఎస్ క్యాంపులో ముఖ్యులకే మింగుడుపడటం లేదని వార్తలు వస్తున్నాయి… నిజంగానే ఇది ఆశ్చర్యకరమైన చర్య… ఇప్పటికీ ములాయం కొడుకు అఖిలేష్ దేశవ్యతిరేక శక్తులు, నాన్ బీజేపీ శక్తుల చేతుల్లో పావు… మరి ములాయంకు ఆ పురస్కారం ఏమిటనే విస్మయం కాషాయ శిబిరంలోనే వ్యక్తమవుతోంది… దానికి పైన వివరించిన సమర్థన నవ్వొచ్చేలా ఉంది…

అమిత్ షా, మోడీ సంప్రదాయ బీజేపీ రాజకీయాలతో పోలి ఉండదు… ఇదంతా డిఫరెంట్ పాలిటిక్స్… చతుర్విధోపాయాలను ప్రయోగిస్తూ తమంటే పడనివాళ్లను కూడా తమ తొవ్వకు తీసుకొచ్చుకుంటారు… రానీ, రాకపోనీ, ప్రయత్నం జరుగుతుంది… అంతటి మమతా బెనర్జీ సైతం ఇప్పుడు కుయ్ కుయ్ అని కూడా అనడం లేదు… మాయాదేవి బీజేపీ ఫోల్డ్‌లో ఉంది… కాంగ్రెస్‌ను తొక్కే పనిలో కేసీయార్‌ను కూడా వాడుకుంటోందనే ప్రచారం కూడా ఉంది… ములాయం తన కెరీర్ చివరలో యాంటీ బీజేపీ కాదు… చల్లబడిపోయాడు… తనకు ఓ పౌరపురస్కారం ఇవ్వడం వల్ల నష్టం లేదు… యూపీలోని యాంటీ బీజేపీ సెక్షన్లలోకి ఓ పాజిటివ్ సంకేతాల్ని పంపించినట్టు అవుతుంది…

రాజకీయాల్లో శతృత్వాలు శాశ్వతం కావు, కాలాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవసరాన్ని బట్టి, వ్యూహాన్ని బట్టి అమలుపరచబడే ఎత్తుగడలు రకరకాలుగా ఉంటయ్… ప్రతి అడుగు వెనుక ఓ మర్మం ఉంటుంది… ఇదీ అదే… అంతేతప్ప చైనా ఏజెంట్లు, వాజపేయి ఎట్సెట్రా కథలు వేస్ట్… ఒక్క సంగతి చెప్పుకుందాం, దాంతోనే పైన కథ ఎలాంటిదో మీకే అర్థమవుతుంది… అసలు 2017లో వాజపేయి మనుషుల్ని గుర్తించే స్థితిలో గానీ, మాట్లాడే స్థితిలో గానీ లేడు… వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని మోడీకి సర్టిఫికెట్ ఇలా ఇచ్చాడు..?!

Share this Article






Advertisement

Search On Site

Latest Articles

  • రంగమార్తాండ సినిమాలో కృష్ణవంశీ ఎక్కడెక్కడ రాంగ్‌స్టెప్స్ వేశాడంటే..?!
  • ధమాకా, ఖిలాడీ మూవీల కంబైన్డ్ కిచిడీ… విష్వక్సేనుడి దాస్‌కాధమ్కీ…
  • Rangamarthanda… ప్రకాష్‌రాజ్ ‘అతి’… బ్రహ్మానందం పర్‌ఫెక్ట్… రమ్యకృష్ణ వోకే…
  • రంగు సోడాల కడుపులు కొట్టి… ఆర్గానిక్ షర్బతుల పనిపట్టి… కూల్‌డ్రింక్స్ రసాయనదాడి…
  • ఢిల్లీ టు మద్రాస్… గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో రెండు రోజుల ప్రయాణం…
  • FingerTip… సోషల్ మీడియా కోట శ్రీనివాసరావును చంపేశాక ఇది గుర్తొచ్చింది…
  • ఈసారి ఉగాది టీవీ షోస్… పులుపు లేని చింత, తీపి లేని బెల్లం, చేదెక్కువ వేప్పువ్వు…
  • 186 అమెరికన్ బ్యాంకులు దివాలా దిశలో… అగ్రరాజ్యంలో ఆర్థిక సంక్షోభం…
  • థూమీబచె… ఎంతకు తెగించార్రా… ఇది ఉగాది స్పెషల్ షో అట..!!
  • కన్నతల్లికి మళ్లీ కల్యాణం… పెళ్లీడుకొచ్చిన కొడుకులే ఈ పెళ్లికి పెద్దలు…

Archives

Copyright © 2023 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions