పార్ధసారధి పోట్లూరి …. అక్టోబర్ 7 శనివారం ఉదయం 6.30… ఇజ్రాయెల్ లో రాత్రి షిఫ్టు ముగించుకొని సైనికులు నిద్రకు ఉపక్రమించే సమయం. రాత్రి షిఫ్ట్ సైనిక డ్యూటీ అయిపోయిన వాళ్ళ స్థానంలో పగలు విధుల్లోకి చేరే వాళ్ళు సిద్ధం అవబోతున్న సమయం! గాజా నుండి రాకెట్లు ఇజ్రాయిల్ మీదకి విరుచుకు పడడం మొదలయ్యింది! ఆకాశంలో రాకెట్లు కనపడగానే వెంటనే ఇజ్రాయెల్ లో సైరన్లు మోగడం మొదలయ్యింది! సాధారణ పౌరులు, అప్పుడే సైనిక పోస్ట్ లలో విధుల్లోకి చేరబోతున్న వాళ్ళు హడావిడిగా పరిగెత్తడం మొదలయ్యింది!
********************
ఆపరేషన్ ఆక్స ఫ్లడ్ – Operation Aqsa Flood. హమాస్ ఇజ్రాయెల్ మీద దాడికి పెట్టిన పేరు ఇది. నిన్న ఉదయం 6.30 కి మొదలయిన రాకెట్ దాడిని రొటీన్ గా హమాస్ చేసే దాడిగా భావించారు సాధారణ పౌరులతో పాటు ఇజ్రాయేలీ డిఫెన్స్ ఫోర్స్ (IDF). కానీ అది రొటీన్ దాడి కాదని కొద్ది గంటలలోనే తెలిసిపోయింది! మొదట పదుల సంఖ్యలో రాకెట్లు ప్రయోగించారు గాజా వైపు నుండి హమాస్ తీవ్రవాదులు. ఐరన్ డోమ్ తన పనిని మొదలు పెట్టింది!
Ads
కానీ నిముషాలు గడిచే కొద్దీ పదులు కాస్తా వందల సంఖ్యను చేరుకుంది! ఐరన్ డోమ్ మీద ఒత్తిడి పెరిగింది! ఐరన్ డోమ్ ఒక్కో సిస్టమ్ 4×4 లేదా 6×6 మిసైల్ లాంచర్స్ ఉంటాయి. మిసైల్స్ ఖాళీ అయిపోయాక మళ్లీ లాంచర్స్ లోకి కొత్త మిసైళ్ల ని లోడ్ చేయడానికి 10 నిముషాలు పడుతుంది. ఈ 10 నిముషాల సమయంలో వందల కొద్దీ రాకెట్లు ఇజ్రాయెల్ లోని జనావాసాల మీద పడ్డాయి.
******************
1.హమాస్ రాకెట్ దాడి మొదలయిన గంటలోపే ఇజ్రాయెల్ ప్రధాని ఎమర్జెన్సీ ప్రకటిస్తూ హమాస్ మీద యుద్ధం ప్రకటించాడు. కానీ అప్పటికే సమయం మించి పోయింది.
2.ఎయిర్ అలెర్ట్ ప్రకటన వెలువడిన కొద్దిసేపటికే అర్ధమయింది IDF కి తమ సరిహద్దు పోస్టులను ధ్వంసం చేసి హమాస్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ పట్టణాలలోకి ప్రవేశించారని.
3.చాలా ఆర్గనైజ్డ్ గా దాడి చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు హమాస్ తీవ్రవాదులు.
4.మొదట భారీ సంఖ్యలో రాకెట్లని ప్రయోగించి ఐరన్ డోమ్ ని పనికిరాకుండా చేశారు. హమాస్ రాకెట్ దాడి చేసినప్పుడల్లా IDF సురక్షిత షెల్టర్లలోకి వెళతారు. దీనిని అడ్వాంటేజ్ గా తీసుకొని హమాస్ ఒక గంటలో 2500 రాకెట్లని ప్రయోగించింది. IDF సైనికులు షెల్టర్లకే పరిమితం అయ్యారు.
5.ఒక గంట సమయాన్ని వృథా చేయలేదు హమాస్!
6.భూగర్భ సొరంగాల ద్వారా కొందరు, మైదాన ప్రాంతాల ద్వారా కొందరు ఇలా ఇజ్రేయిలీ సైనిక పోస్ట్ ల మీద మెరుపు దాడి చేసి ఇజ్రాయేల్ లోకి ప్రవేశించారు.
7.అదే సమయంలో సముద్రంపైన, సముద్రంలో అడుగున ప్రయాణిస్తూ మరి కొంతమంది ఇజ్రాయెల్ లోకి ప్రవేశించారు.
8.గాజాలో ఎత్తయిన ప్రదేశాల నుండి హాండ్ గ్లైడ్స్ ద్వారా గాలిలో ఎగురుతూ ఇజ్రాయెల్ లోకి మరికొంత మంది ప్రవేశించారు!
9.ఇజ్రాయెల్ లో ఒక నిబంధన ఉంది, దానిని అందరూ పాటించాలి అది…. హమాస్ రాకెట్ దాడి మొదలు పెట్టగానే పౌరులు తమ అపార్ట్మెంట్, ఇండిపెండెంట్ ఇళ్లలో ఉండే సురక్షిత గదులలోకి వెళ్లిపోవాలి. సైరన్లు మోగడం మొదలయిన వెంటనే అందరూ విధిగా దీనిని పాటిస్తారు. ఒకవేళ ఎవరన్నా ఆ సమయంలో రోడ్ మీద ఉంటే దగ్గరలో ఉన్న ఇంట్లో ఆశ్రయం తీసుకోవచ్చు, సదరు ఇంటి యజమాని కూడా అభ్యంతరం చెప్పడు.
10.ఈ నిబంధన వలన అందరూ ఇళ్లలో ఉండగానే హమాస్ తీవ్రవాదులు పట్టణాలలోకి ప్రవేశించినా ఎవరికీ తెలియలేదు.
11.ఇజ్రాయెల్ లోకి ప్రవేశించగానే హమాస్ తీవ్రవాదులు మొదట సైనిక బేస్ లోకి వెళ్లి తమ వద్ద ఉన్న AK47 లని అక్కడ వదిలేసి ఇజ్రాయెల్ సైనికులు వాడే M16 అసాల్ట్ రైఫిల్స్ ని తీసుకున్నారు. అదే బేస్ లో అండర్ గ్రౌండ్ షెల్టర్ లో IDF సైనికులు ఉన్నారు కానీ పైన బేస్ లోకి హమాస్ తీవ్రవాదులు ప్రవేశించినట్లు తెలియదు.
12.M16 అసాల్ట్ రైఫిల్స్ చేతిలోకి రాగానే మిలటరీ బేస్ నుండి బయటికి వచ్చి ఇళ్లలోకి చొరబడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడం మొదలు పెట్టారు హమాస్ తీవ్రవాదులు.
13.చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు అనే బేధం లేకుండా కాల్పులు జరపడంతో మొత్తం 200 మంది ఇజ్రాయేలీ పౌరులు మరణించారు శనివారంనాడు.
14.మొత్తం1000 కి పైగా తీవ్రంగా గాయపడ్డారు!
15.ఇజ్రాయిల్ మిలటరీలో పనిచేస్తున్న మహిళా సైనికులని చంపి వివస్త్రలని చేసి పికప్ వాన్ లో గాజాకి తీసుకెళ్లి ఊరేగిస్తూ గాలిలోకి కాల్పులు జరిపారు.
16.కనీసం 4గురు సీనియర్ IDF కమాండర్లని బందీలుగా చేసి గాజా తీసుకెళ్లారు!
17.నిన్న రాత్రి వరకు అందిన సమాచారం మేరకు సాధారణ పౌరులతో పాటు సైనికులు ఎంతమందిని బందీలుగా పట్టుకెళ్ళారో సరయిన సమాచారం లేదని టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ తెలిపింది.
*******************
ఇది ఖచ్చితంగా మొస్సాద్ వైఫల్యమే! మొస్సాద్ బలహీన పడితే మరో వైపు RAW చాలా బలమయిన శక్తిగా ఎదిగింది అన్నది నిజం! ఇజ్రాయెల్ లో గత రెండేళ్ల గా రాజకీయ అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. బెంజమిన్ నేతన్యాహు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చాలా కాలంగా. నేతన్యాహూ పరిపాలనలో ఇజ్రాయెల్ అస్తవ్యస్తంగా తయారయ్యింది. నిత్యం ఎక్కడో ఒక చోట ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేయడం పరిపాటిగా మారింది.
1960 నుండి సమాచారం కోసం CIA మొస్సాద్ మీద ఎక్కువగా ఆధారపడేది. 2014 నుండి CIA మొస్సాద్ ల మధ్య సమన్వయ లోపం పెరుగుతూ వచ్చింది. ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్య గురించి CIA దూరంగా ఉండాలని ఆదేశాలు ఉండడం వలన గాజాలో ఏం జరుగుతుందోన ఎవరికీ అప్డేట్స్ లేవు.
నిన్నటి హమాస్ దాడి వెనుక ఇరాన్ ఉన్నది అన్నది నిజం. లేబనాన్ లో హెజ్బొల్లా, పాలస్తీనాలో హమాస్ లకి ఇరాన్ సహాయం చేస్తున్నది. హెజ్బొల్లా షియా గ్రూపు అయితే హమాస్ సున్నీ గ్రూపు.
జియో పాలిటిక్స్? రష్యా ఆమోదంతోనే ఇరాన్ సున్నీ గ్రూపు అయిన హమాస్ కి సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇది ఇజ్రాయెల్, సౌదీ అరేబియాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొంటున్న సమయంలో తీసుకున్న నిర్ణయం. ఇప్పుడు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కి మద్దతు ఇస్తుందా? లేక సున్నీ గ్రూపు హమాస్ కి మద్దతు ఇస్తుందా? చాలా తెలివిగా రష్యా కదిపిన పావు ఇది! ఉక్రేయిన్ కి నాటో చేస్తున్న సహాయాన్ని డైవర్ట్ చేయడానికే హమాస్ ని తెర మీదకి తెచ్చాయి ఇరాన్, రష్యాలు.
మధ్య ప్రాచ్యంలో మళ్లీ అశాంతిని రగుల చేయడమే లక్ష్యంగా ఇరాన్, రష్యా, చైనాలు ప్లాన్ చేశాయి. ఇజ్రాయెల్ ఇప్పుడు గాజా, గోలన్ హైట్స్, తో పాటు లేబనాన్, సిరియాలో కొంత భాగాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం సమస్య జఠిలం అవుతుంది. భారత్-Pok..?
ఇజ్రాయెల్ కనుక పాలస్తీనాని తన ఆధీనంలోకి తీసుకుంటే దానిని అమెరికాతో పాటు EU సమర్ధిస్తే అప్పుడు POK ని భారత్ స్వాధీనం చేసుకుంటే?
చచ్చినట్లు భారత్ ని సమర్ధించాలి! చాలా జాగ్రత్తగా, సునిశితంగా హాండిల్ చేయాలి భారత్…
Share this Article