.
Subramanyam Dogiparthi …….. చిరంజీవి సినిమాల్లో నాకు బాగా ఇష్టమైన సినిమాల్లో ఒకటి ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా . ఈ సినిమాకు చాలా విశేషాలు ఉన్నాయి . ఫేమిలీ సినిమాల హీరోగా చిరంజీవికి మహిళా అభిమానులను తెచ్చిపెట్టిన సినిమా .
చిరంజీవి- మాధవి జోడీకి పేరు తెచ్చింది . ఈ సినిమా తర్వాత వచ్చిన ఖైదీతో బోలెడు పుకార్లు కూడా వచ్చాయి ఇద్దరి మీద . అంత క్రేజ్ వచ్చింది వాళ్ళ జోడీకి .
Ads
దాసరి శిష్యపరమాణు కోడి రామకృష్ణని దర్శకుడిగా పరిచయం చేసింది . పెద్ద దర్శకుల లిస్టులో పడేసింది . అప్పటిదాకా నాటకాల రచయితగా , సినిమా డైలాగుల రచయితగా పాపులర్ అయిన గొల్లపూడి మారుతీరావుని నటుడిగా పరిచయం చేసింది . ఇలా చాలా …
బిగువయిన కధను , బిర్రయిన స్క్రీన్ ప్లేని తయారుచేసుకుని దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణని ముందుగా మెచ్చుకోవాలి . సాధారణంగా పాపులర్ బేనర్లు , అనుభవం కలిగిన నిర్మాతలు కధ , కధనం మీద , ఓవరాల్ ప్రొడక్షన్ మీద పట్టు కలిగి ఉంటారు . ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ కూడా ఆ బేచిలో ఒకరు . ఈ సినిమా నిర్మాత ఆయనే .
ఢిష్యూం ఢిష్యూం సినిమాలు , నెగటివ్ పాత్రల్నే కాదు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య , మంత్రి గారి వియ్యంకుడు వంటి సంసారపక్షమైన పాత్రల్ని కూడా బ్రహ్మాండంగా నటించగలనని చిరంజీవి ప్రూవ్ చేసుకున్నారు .
మొదటి సినిమా అయినా సాఫ్ట్ & క్రూయెల్ విలనీని అద్భుతంగా పండించిన గొల్లపూడిని అభినందించాలి . ఎంత బాగా నటించాడంటే లేచి తన్ని వద్దామనేంత కోపం వస్తుంది ఆ పాత్ర మీద . అంత బాగా నటించారు .
ఈ సినిమా పేరు చెప్పగానే గుర్తొచ్చే మరో పాత్ర పూర్ణిమది . గలగలా మాట్లాడే అమాయకురాలి పాత్ర . బాగా నటించింది . ప్రేక్షకుల సానుభూతి కూడా పొందింది .
మరో పాత్ర సంగీతది . దేశంలో కోట్లాది సగటు భార్యలకు ప్రతినిధి పాత్ర . చాలా మంది మొగుళ్ళు ఇంట్లో రామయ్యలు వీధిలో కృష్ణయ్యలు . ఈ సంగతి సీతమ్మలకు తెలిసినా తమ భర్త శిఖామణులు రామయ్యలే అని అందరికీ టాంటాం వేయటమే కాకుండా , అదే సత్యమని నమ్మినట్లు జీవిస్తూ ఉంటారు . లేకపోతే కొంపలన్నీ కొల్లేరులే అయిపోతాయి .
ఇతర పాత్రల్లో పి యల్ నారాయణ , కాకినాడ శ్యామల , అన్నపూర్ణ , జయశీల , గిరిజారాణి , ప్రభృతులు నటించారు . మొదట గ్రామీణ ప్రాంతం నేపధ్యంలో ప్రారంభమై తర్వాత పట్టణ నేపధ్యానికి ఫిఫ్టవుతుంది సినిమా .
ఈ సినిమా విజయానికి ఇతర ప్రధాన కారకులు సంగీత దర్శకులు జె వి రాఘవులు , పాటల్ని వ్రాసిన సి నారాయణరెడ్డి , పాడిన గాయనీ గాయకులు . సినిమాకు ఐకానిక్ సాంగ్ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య రెండు సార్లు వస్తుంది . వీర హిట్ సాంగ్ .
వచ్చె వచ్చె వాన జల్లు పాట బాగా హిట్టయింది . సీతారాముల ఆదర్శము రాధాకృష్ణుల అనురాగము చాలా శ్రావ్యంగా ఉంటుంది . స్వామీ శరణం అయ్యప్పా పాట అయ్యప్ప భజన పాటల్లోకి చేరిపోయింది . అంత బాగా వ్రాసారు , పాడారు .
ఏప్రిల్ 23 , 1982 న వచ్చిన ఈ హిట్ సినిమా ఎనిమిది సెంటర్లలో యాభై రోజులు , రెండు సెంటర్లలో వంద రోజులు ఆడింది . ఇంకా ఉంది రికార్డ్ . హైదరాబాద్ శాంతి థియేటర్లో మూడు షోలతో 106 రోజులు ఆడాక నాంపల్లి లతలో ఉదయం ఆటలతో 52 వారాలను పూర్తి చేసుకుంది . షిఫ్టులతో , ఉదయం ఆటలతో 517 రోజులు ఆడింది . ఆ రోజుల్లో ఓ చిన్న బడ్జెట్ సినిమా అన్ని రోజులు ఆడటం చాలా గొప్ప విషయం .
అంత చక్కటి చిత్రం . మా గుంటూరులో రాధాకృష్ణ టాకీసులో ఆడింది . ఇప్పుడు ఆ థియేటర్ లేదు . సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . చూసినా మళ్ళా చూడొచ్చు . ఏం బోర్ కొట్టదు . టివిలో తరచూ వస్తూ ఉంటుంది . కాసేపయినా చూస్తూ ఉంటా . A watchable , neat , musical , feel good movie .
#తెలుగుసినిమాలసింహావలోకనం #సినిమా_కబుర్లు #తెలుగుసినిమాలు
Share this Article