.
అతిరథమహరథ ప్లేయర్లున్నా… వాళ్ల ఇంపాక్ట్ ఏమీ కనిపించక… వరుస ఓటములతో పూర్తిగా డీలాపడిపోయిన ముంబై ఐపీఎల్ జట్టు నిన్న కాస్త కళ పెరిగి, జోష్ తెచ్చుకుని… 123 దంచిన రికెల్టన్ పుణ్యమాని 244 చేసి… సేఫ్, ఈ మ్యాచ్ గెలుస్తాం అనుకుంటే… ఇంకా 8 బాల్స్ ఉండగానే హైదరాబాద్ జట్టు 249 పరుగుల్ని చేసి, అంత భారీ టార్గెట్‌ను ఉఫ్ అని ఊదేసింది…
అలవోకగా కొట్టేశారు… ఎవరో సోషల్ మీడియాలో రాసినట్టు… ‘‘‘ఒకప్పుడు క్రికెట్ అంటే కేవలం ఆట కాదు… ఒక అనుభూతి… Sachin Tendulkar, Sourav Ganguly అవుట్ అయ్యాక 35 ఓవర్లకి 165 ఉంటే, టీవీ ముందు కూర్చున్న కోట్లాది మందిలో ఒకే లెక్క — “ఇంకో పది ఓవర్లు బాగా ఆడితే 220… గరిష్టంగా 230… చాలు!” అన్న నమ్మకం…
Ads
ఆ వన్డే స్కోర్ కేవలం సంఖ్య కాదు, మనసుకు ఒక భరోసా… తర్వాత బంతి మా వాళ్ల చేతిలో పడితే గెలుపు దాదాపు ఖాయం అన్న భావన… Javagal Srinath మొదటి స్పెల్‌లో రెండు వికెట్లు తీస్తాడు, Anil Kumble వచ్చి మధ్య ఓవర్లలో చుట్టేస్తాడు… 160కి ఆల్‌అవుట్ చేస్తాం అన్న ఆశతో, టెన్షన్‌తో, దేశం మీద ప్రేమతో చూస్తాం… ఆ ప్రతి ఓవర్‌లో కథ ఉండేది, ప్రతి డాట్ బాల్‌కు విలువ ఉండేది… అదే క్రికెట్…
ఇప్పుడేమిటి… 20 ఓవర్లలో 250 కొట్టినా సరిపోదు… అసలు 200 రన్స్ టార్గెట్ అలవోకగా ఛేదించే రేంజు కూడా దాటిపోయి ఇప్పుడు 230, 240, 250 ప్లస్ స్కోర్లను కూడా ఛేజ్ చేసేస్తున్నారు… క్రీజులో దిగితే అందరూ వైభవ్ సూర్యవంశీలే… బాల్ రావడమే ఆలస్యం, దంచుడే… బుమ్రా వంటి ఇంటర్నేషనల్ ఫేమ్ బౌలర్లు కూడా తెల్లమొహాలు వేస్తున్నారు…
ఒకప్పుడు వన్డేల్లో 250 భారీ స్కోర్… ఇప్పుడు టీ20లలో కూడా 250 కూడా కామెడీగా ఛేజ్ చేసేస్తున్నారు… జీవం లేని పిచ్చులు, చిన్న బౌండరీలు… బ్యాటింగ్ ఫ్రెండ్లీ ఫీల్డింగ్ రూల్స్… అసలు ఆటగాళ్ల మైండ్ సెట్ కూడా మారిపోయింది ఈ దిశలో… భయం లేదు, లెక్కల్లేవు, ఎక్కాల్లేవు… దంచుడే… దీంతో ఫీల్ లేదు ఇప్పుడు… ఏదో వీడియో గేమ్ చూస్తున్నట్టుగా ఉంది…
అప్పటి క్రికెట్‌లో ఓపిక ఉండేది, ప్లాన్ ఉండేది, గెలుపు కోసం కష్టపడే కథ ఉండేది… ఇప్పటి క్రికెట్‌లో వేగం ఉంది, శక్తి ఉంది, ఎక్స్‌ప్లోషన్ ఉంది… అప్పట్లో 230తో మనం కలలు కనేవాళ్లం… ఇప్పుడు 250 చూసినా కళ్లెదుటే కరిగిపోతుంది… కానీ ఒక విషయం మాత్రం మారలేదు — మ్యాచ్ గెలిచినప్పుడు వచ్చే ఆనందం… ఫార్మాట్ మారింది, ఫిగర్స్ మారాయి… ఆట తీరు మారింది…
ఛలో, టెస్టులకు ఇక మంగళం పాడేద్దాం… ఎవడు చూస్తాడు 5 రోజుల ఆటను… అసలు వన్డేల సంఖ్యనూ కుదిద్దాం, రోజంతా ఎవడు చూస్తాడు..? టీ20 బెటర్… కాదు, టీ10 రోజులకు వెళ్లిపోదాం, అప్పుడు ప్రతి ఓవరూ ‘సూపర్ ఓవరో’… దంచు లేదా నిష్క్రమించు, ఇదే సూత్రం..!!
Share this Article