.
రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) జట్టును వదిలించుకుందామని యాజమాన్యం భావిస్తోంది… మొదట్లో ఈ ఊహాగానాల్ని అది కొట్టిపారేసినా ఇప్పుడు ఇక అమ్మకడానికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది…
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) టైటిల్ కోసం తమ సుదీర్ఘ నిరీక్షణకు ఈ ఏడాది జూన్ 3న తెరదించింది… ఫైనల్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి వారు విజేతగా నిలిచారు…
Ads
అయితే, విజయం సాధించిన మరుసటి రోజు విషాదం చోటుచేసుకుంది. విజయోత్సవ ర్యాలీ సందర్భంగా వారి హోమ్ గ్రౌండ్ అయిన బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు…
రిపోర్టుల ప్రకారం, ఈ IPL విజయం ఫ్రాంచైజీ విలువను $269 మిలియన్లకు పెంచింది… డెక్కన్ హెరాల్డ్ నివేదిక ప్రకారం, RCB చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్థానంలో అగ్రస్థానానికి చేరుకుంది…
లలిత్ మోడీ పోస్ట్: పెరిగిన ఊహాగానాలు
తాజాగా, మాజీ IPL కమిషనర్ లలిత్ మోడీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఫ్రాంచైజీ అమ్మకంపై ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది… “ఒక IPL ఫ్రాంచైజీ, ముఖ్యంగా RCB అమ్మకం గురించి చాలా పుకార్లు వస్తున్నాయి – గతంలో వాటిని ఖండించారు… కానీ యజమానులు చివరకు దానిని తమ బ్యాలెన్స్ షీట్ నుండి తీసివేసి, విక్రయించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది..” అని మోడీ ‘X’ (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశాడు…
RCB ప్రారంభం నుండి ఈ జట్టుకు విజయ్ మాల్యా అసలు యజమానిగా ఉన్నాడు… 2016లో ఫ్రాంచైజీని డియాజియో కొనుగోలు చేసింది… మాల్యా కూడా తన IPL జట్టును విక్రయించాలని గతంలో అనుకున్నాడు కూడా… ఇక బెంగుళూరు తొక్కిసలాట అనంతరం కొత్త యాజమాన్యం మరింత గట్టిగా దీని అమ్మకంపై దృష్టి పెట్టింది…
గతంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) కూడా ఈ అమ్మకం వార్తలపై వివరణ కోరింది, దానికి డియాజియో ఆ ప్రచారాన్ని కేవలం ఊహాగానాలుగా కొట్టిపారేసింది… మీడియా నివేదికలు ఊహాజనితమైనవని, కంపెనీ అలాంటి చర్చలేవీ చేయడం లేదని డియాజియో జూన్ 10న BSEకి స్పష్టం చేసింది…
మోడీ అంచనా: $2 బిలియన్లకు పైగా విలువ
లలిత్ మోడీ తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో RCB ప్రపంచ పెట్టుబడిదారులకు లాభదాయకమైన ఆస్తిగా మారే సామర్థ్యాన్ని హైలైట్ చేశాడు… హౌలిహాన్ లోకీ 2025 IPL బ్రాండ్ వాల్యుయేషన్ స్టడీలో అంచనా వేసిన $269 మిలియన్ల కంటే చాలా ఎక్కువ అంటే, RCB విలువ $2 బిలియన్లకు పైగా ఉండవచ్చని తన అభిప్రాయం…
- “బిగ్ గ్లోబల్ ఫండ్స్ లేదా సావరిన్ ఫండ్‌లలో ఒకటి తమ పెట్టుబడి వ్యూహం, ఇండియా స్ట్రాటజీలో భాగంగా దీనిని కలిగి ఉండాలని బలంగా కోరుకుంటాయని అనుకుంటున్నాను… దీని కంటే మెరుగైన పెట్టుబడి అవకాశాన్ని నేను ఊహించలేను… దీనిని ఎవరు దక్కించుకుంటే వారికి శుభాకాంక్షలు… ఇది ఖచ్చితంగా కొత్త రికార్డు వాల్యుయేషన్‌ను నెలకొల్పుతుంది,..’’ అని మోడీ అభిప్రాయం…
అలాగే, సీరం ఇన్‌స్టిట్యూట్ CEO ఆదార్ పూనావాలా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్న పోటీదారుగా ఉన్నాడనే నివేదికలు కూడా వచ్చాయి…
స్పందించని యజమాన్యం
మోడీ పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసినప్పటికీ, డియాజియో ఇండియా ఈ వార్తలను నేరుగా ఖండించడం మానుకుంది… మార్కెట్ ఊహాగానాలపై వ్యాఖ్యానించడానికి డియాజియో నిరాకరిస్తోందని డెక్కన్ హెరాల్డ్‌కు కంపెనీ సన్నిహిత వర్గాలు తెలిపాయి…
Share this Article