హుప్పా హుయ్యా… మరాఠీలో పుష్కరకాలం క్రితం ఓ సినిమా వచ్చింది… హనుమంతుడి మహత్తును చెప్పే ఓ కల్పితగాథ… అప్పట్లో వంశీ దర్శకత్వంలో నితిన్, అర్జున్ నటించిన శ్రీఆంజనేయం అనే సినిమాలాగే ఉంటుంది ఇది కూడా… నిజానికి ఈ పదాలకు ఉత్పత్తి అర్థమేమిటో తెలియదు కానీ హనుమంతుడి భజనలో తరచూ వాడే పదాలు ఇవి…
ఆదిపురుష్ సినిమా వివాదాలకు కేంద్రబిందువు ఇప్పుడు… సీత కిడ్నాప్‌ను జస్టిఫై చేశారనే పాయింట్ దగ్గర్నుంచి తిరుమలలో దర్శకుడు ఓం రౌత్ సీతపాత్రధారిణి కృతి సనన్‌ను ముద్దాడే పాయింట్ దాకా… అనేక వివాదాలు… మళ్లీ ఆ వివాదాల్నీ ఇక్కడ ఏకరువు పెట్టడం వృథాయే గానీ… 600 కోట్ల ఈ సినిమా ఓ గ్రాఫిక్, ఓ యానిమేషన్ సినిమాలాగే తలపిస్తోంది…
తెలుగు, హిందీ భాషల్లో తీసి, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లోకి డబ్ చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు గానీ… తప్పు… హిందీలో మాత్రమే తీసి మిగతా భాషల్లోకి డబ్ చేశారు… తెలుగు కూడా అంతే… ఒక్క ప్రభాస్ మినహా సినిమాలో తెలుగుతనం ఏమీ లేదు… (నిజానికి పౌరాణికాలు తీస్తే తెలుగువాళ్లే బ్రహ్మాండంగా తీయగలరు…) సేమ్, రాధేశ్యాం సినిమాలాగే… హిందీలో తీసి తెలుగీకరించబడిన సినిమా ఆదిపురుష్… తారాగణం, సంగీతం, టెక్నీషియన్స్, నిర్మాతలు, దర్శకుడు గట్రా అన్నీ హిందీయే… పైగా హనుమంతుడు, రావణుడి వేషాలు అపహాస్యానికి గురయ్యాయి…
Ads
అలా హిందీలో ట్యూనబడిన పాటల్ని అడ్డదిడ్డంగా తెలుగీకరించడమే ఇప్పుడు మరో తలనొప్పి, చికాకు యవ్వారం… మచ్చుకు హుప్పా హుయ్యా అనబడే ఓ పాటను వినబడ్డాను… అసలు ఆ పదాలేమిటో, సరస్వతీపుత్రుడు అనే పదాల్ని తన పేరుకు తగిలించుకుని, తనే ప్రచారం చేసుకునే రామజోగయ్య శాస్త్రి ఆ పాటను తెలుగులోకి అనువదించాడు… నిజానికి అనువాద పాటల్ని రాయడం పెద్ద ఆర్ట్… శాస్త్రికి అస్సలు చేతకాలేదు… అసలు ఆ పాట వింటుంటే అసలవి తెలుగు పదాలేనా అనిపించేలా ఉన్నయ్…
పాట స్టార్ట్ కావడమే హుప్పా హుయ్యా అని ప్రారంభమై మధ్య ఎక్కడో మేనత్త అనే పదంలా వినిపించింది… సరే, ఆ ట్యూన్‌లో ఏవో పదాల్ని కూర్చేసిన శాస్త్రి చేతులు దులుపుకున్నాడు గానీ… ఆ గాయకుడు పాడే తీరు కూడా కఠోరంగా ఉంది… ఆ గాయకుడి పేరు సుఖ్వీందర్ సింగ్… తను హనుమాన్ భజనపాట పాడుతున్నా సరే, భల్లే భల్లే అంటూ ఏదో ఓ పంజాబీ ఫోక్ సాంగ్ పాడుతున్నట్టే ఉంది… తెలుగులో పాట రాయలేకపోయారు సరే, కానీ తెలుగు గాయకులే లేరా..? 600 కోట్ల ఖర్చులో ఓ లక్ష రూపాయల్ని తెలుగు గాయకుడికి ఇవ్వలేకపోయారా..?
కారుణ్య, హేమచంద్ర, శ్రీరామచంద్ర… నిన్నామొన్నటి ఇండియన్ ఐడల్స్ కార్తీక్, జయరాం తదితరులైనా సరే బ్రహ్మాండంగా పాడేవాళ్లు కదా… సంగీతదర్శకులు అజయ్- అతుల్ సమకూర్చిన ట్యూన్లలో కూడా మాధుర్యం లేదు… మనోజ్ ముంతాశిర్ శుక్లా అనే పేరును కూడా లిరిక్ రైటర్‌గా వేస్తున్నారు… ఫాఫం రామజోగయ్యశాస్త్రి… ఈ పాటకు ఇద్దరు రచయితలా..? డార్లింగ్ ప్రభాస్… ఎవరు వీళ్లంతా..? ఓం రౌత్ అనే దర్శకుడు నిన్ను నిండా ముంచేసినట్టే కనిపిస్తోంది… పాపం శమించుగాక… అవునూ, రాముడు ఆదిపురుషుడు ఎలా అయ్యాడు దర్శకా…!? చివరకు సినిమా టైటిల్‌కు కూడా సమర్థనీయత లేదు… చిన జియ్యరుడైనా చెప్పగలడో లేడో…
ఈ నిర్వాకానికి, ఏదో రామాయణాన్ని ఉద్దరిస్తున్నట్టు… ప్రతి షోలో ఒక సీటును హనుమంతుడికి రిజర్వ్ చేస్తున్నట్టు ప్రకటనలు… ప్రచారాలు… ఆదిపురుష్ సినిమాలో ఏదీ సరిగ్గా లేదు… ఇది మాత్రం పక్కా… చూడామణి – గాజు వివాదం మీద కూడా ముచ్చటించుకుందాం… వెయిట్…
Share this Article