.
రవితేజ… మనకున్న మంచి నటుల్లో ఒకడు… కానీ చాన్నాళ్లుగా దారితప్పాడు… వరుసగా అనేక పరాజయాలు… అప్పుడెప్పుడో వచ్చిన విక్రమార్కుడు, కిక్ తరువాత అంతగా ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చిన సినిమా లేదు బహుశా… సినిమాలు తీస్తూనే ఉంటాడు, ఫట్‌మంటూనే ఉంటాయి… ఐనా అదే గిరాకీ…
సోది కథలు, చెత్తా ప్రజెంటేషన్స్, సోకాల్డ్ కమర్షియల్ వాల్యూస్, పిచ్చి పాటలు- స్టెప్పులు, అంతా రొడ్డకొట్టుడు యవ్వారం… మొన్న ఎవరో నటుడు చెప్పాడు కదా, 12 లక్షలు- 26 ఎకరాలు- వందల కోట్ల ఆస్తి ఉంది రవితేజకు అని… హాయిగా జీవితం ఎంజాయ్ చేయక ఇంకా ఎన్నాళ్లు ఇలాంటి సినిమాలు తీస్తూ ప్రేక్షకులను విసిగిస్తాడు అనిపించేది…
Ads
అందుకే, ఇరుముడి సినిమా మీద కూడా పెద్దగా అంచనాల్లేవు చాలామందికి… కానీ మళ్లీ ఓ పాత రవితేజ కనిపించాడు… ఈసారి సగటు తెలుగు సినిమా తలతిక్క హీరోయిజంతో కాదు… మలయాళ సినిమా టైపు ఎమోషన్ పంథాలోకి వెళ్లిపోయాడు తను… మాస్ హీరో మార్క్ పిచ్చి ఎలివేషన్లను వదిలేసుకుని, పక్కాగా కథకు లొంగిపోయాడు, అందులో ఇమిడిపోయాడు… అంటే, అదే కేరళలో ఉన్న ఆ అయ్యప్ప దగ్గరకు స్వామియే శరణం అయ్యప్పా అంటూ ఇరుముడితో వెళ్లాడు… హిట్…

గొప్పగా ఉందని కాదు… కనీసం రవితేజ వరుస పరాజయాల నుంచి తనను తప్పించి, తిరిగి పాత రవితేజను చూపించిందీ అని..!! అక్కడక్కడా లాజిక్ రాహిత్యలున్నాయి… కానీ స్థూలంగా బిడ్డ- తండ్రి ఎమోషన్, బలమైన- ఉద్విగ్నతకు గురిచే క్లైమాక్స్ సినిమాను నిలబెట్టాయి… ఇన్నాళ్లకు మళ్లీ రవితేజ కళ్లలో గెలుపు కళ… ఓటముల ప్రవాహంలో కొట్టుకుపోతున్నవాడికి ఓ గెలుపు ఆసరా దొరికిన ఫీలింగ్… డెఫినిట్‌గా ఇది రవితేజకు కమ్ బ్యాక్…
రవితేజలో మంచి కామెడీ టైమింగ్, యాక్షన్ సీన్స్‌లో ఎనర్జీ అందరికీ తెలిసిందే… కానీ ప్రేమ, కోపం, బాధ బలంగా అభినయించగలడు… కానీ అలాంటి మంచి పాత్రలు పడితే కదా… ఆ కరువు ఇప్పుడు తీరినట్టుంది… ఉంది, అక్కడక్కడా ల్యాగ్ ఉంది, సినిమా ఎక్కువ నిడివి కారణం కావచ్చు… అక్కడక్కడా ప్రేక్షకుడు కన్విన్స్ కాని లాజిక్‌లెస్‌నెస్ ఉండొచ్చు… కానీ ఓవరాల్‌గా వోకే…

ఎందుకు బాగున్నదీ అంటే… అసాధారణమైన సూపర్ బంపర్ సినిమా అని కాదు… తన కొన్నేళ్ల సినిమాలతో పోలిస్తే బాగున్నదీ అని అర్థం !! రవితేజే సినిమాకు బలం… ఆ అమ్మాయి నక్షత్ర అదనపు బలం… మల్లెపూల పల్లకీ రీట్యూనింగ్ మీద కొన్ని విమర్శలు వచ్చాయి గానీ, సినిమాలో బాగా కుదిరింది… చప్పట్లు పడ్డాయి… బీజీఎం మాత్రం సోసో…
సినిమా గురించి …
‘ఇరుముడి’ అనేది తండ్రి (రవి తేజ), కూతురు (నక్షత్ర) మధ్య ఉన్న అనుబంధం ఆధారంగా తెరకెక్కిన చిత్రం. గ్రామంలో యువతులపై జరుగుతున్న షాకింగ్ సంఘటనలను, వాటిని ఎదుర్కొనే ఒక ప్రేమగల తండ్రి ప్రయాణాన్ని ఈ సినిమా కథాంశంగా మలిచారు…
శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం పాఠశాలలో జరిగే ఒక ఆత్మహత్య సన్నివేశంతో ప్రారంభమవుతుంది. మొదటి అర్ధభాగంలో తండ్రి-కూతురు బాండింగ్, అయ్యప్ప మాల కాన్సెప్ట్ కథను ఎంగేజింగ్‌గా నడిపిస్తాయి. అయితే, ఇంటర్వెల్ ముందు వేగం మందగిస్తుంది.
ద్వితీయార్ధంలో దర్శకుడు థ్రిల్లర్ అంశాలను, విలన్ ట్రాక్‌ను డీల్ చేయడంలో తడబడ్డాడు. ముఖ్యంగా ఎమ్మెల్యే ట్రాక్ బలహీనంగా అనిపిస్తుంది. అయితే, చివరి వరకు కథను నడిపించిన ఎమోషనల్ కోర్, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.
చివరగా… థ్రిల్లర్ అంశాలు కొంత నిరాశపరిచినా, బలమైన భావోద్వేగాలు, కంటతడి పెట్టించే క్లైమాక్స్ కోసం ఈ సినిమాని నిరభ్యంతరంగా చూడవచ్చు… కాకపోతే మరీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ అవసరం లేదు సుమా!!
Share this Article