రామాయణం… సీతను రావణుడు కిడ్నాప్ చేస్తాడు… అంటే రామాయణం కిడ్నాపులను ప్రోత్సహించినట్టేనా..? జస్ట్, ఓ సందేహం… ఓ సినిమాలో ఓ అమ్మాయిని విలన్లు అత్యాచారం చేసినట్టు చూపిస్తారు… అంటే సదరు సినిమా అత్యాచారాల్ని ఎంకరేజ్ చేస్తున్నట్టేనా..? ఓ నవలలో ఓ ముసలాయన్ని తన సొంత బంధువులే హతమారుస్తారు… అంటే సదరు రచయిత హత్యల్ని, హింసను ప్రమోట్ చేస్తున్నట్టేనా..? మద్యపానం సీన్లు, అమ్మాయిలకు వేధింపుల సీన్లు, హింస సీన్లు లేని సినిమాలు ఉన్నాయా ఈరోజుల్లో…
ఇదంతా దేనికి అంటే… విశ్వనగర పోలీసులు డ్రగ్స్ సీన్లు ఉన్న సినిమాలకు నోటీసులు ఇస్తున్నారు కదా… అందుకు…! అదేదో బేబీ అనే సినిమాలో దర్శకుడు రాజేశ్ డ్రగ్స్ సీన్లు పెట్టాడట, ఇదేమిటోయ్, వచ్చి సమాధానాలు, వివరణ ఇవ్వు అని నోటీసు జారీ చేశారట… (అవునూ, నిర్మాతకు కదా ఇవ్వాల్సింది అంటారా..? పోనీ, హీరోలకు ఇవ్వొచ్చు కదా… ఏమో, మాకవన్నీ ఏం పట్టవు..? దర్శకుడికే ఇస్తాం…)
Ads
సినిమాలో డ్రగ్స్ సీన్లు ఉంటే నేరమా..? ఎలా..? పైన మనం చెప్పుకున్న ఉదాహరణల్లో వాల్మీకి దగ్గర నుంచి నవలా రచయితలు, కథా రచయితలు, సినిమా రచయితల దాకా నేరస్థులు కాని వారెవరుంటారు ఇక..? ఇక్కడ మళ్లీ పాత చర్చే… జీవితంలో, క్షేత్రంలో కనిపించేవే సినిమాల్లో ఉంటున్నాయా..? సినిమాల్లో ఉన్న సీన్ల ప్రభావం సొసైటీ మీద ఉంటోందా..? ఆ చర్చ జోలికి వెళ్తే ఒడవదు, తెగదు గానీ ఈ డ్రగ్స్‌కు కాసేపు పరిమితం అవుదాం…
గతంలో అకున్ సభర్వాల్ రోజుకొక సినిమా సెలబ్రిటీని పిలిచి, మీడియాలో ధూంధాంకు అవకాశమిచ్చి నానా రభస చేశాడు కదా విచారణల పేరిట… అవి రహస్యంగా కూడా విచారించవచ్చు కదా అంటారా..? భలేవారే, మేం అలా ఎందుకు చేస్తాం..? ఇప్పుడు కూడా పోలీసులు సెలబ్రిటీల్ని డ్రగ్ తీసుకుంటున్నారనే నేరం మీద విచారిస్తారట… అప్పట్లో ఈ భారీ అట్టహాసపు విచారణల సమయంలో సీఎం కేసీయార్ డ్రగ్స్ తీసుకుంటే నేరమనే వాదనను కొట్టిపారేశాడు కదా… ఇప్పుడూ ఆయనే కదా మన సీఎం… తన స్టాండ్ మారినట్టు కూడా మనకు తెలియదు మరి… పోలీసులు మాత్రం మళ్లీ ఆ పాత పాటే…
పోలీసులు చెప్పే నవదీప్ నేను కాను, నేనేమీ పరారీలో లేను అని ఒకప్పటి హీరో నవదీప్ చెబుతున్నాడు… తాను గతంలో కూడా ఈ విచారణల బాధితుడే… ఐనా డ్రగ్స్ తీసుకునేవాళ్లు బానిసలు, బాధితులు అవుతారు తప్ప చట్టప్రకారం కూడా నేరస్తులు కాదని లా తెలిసిన కొందరు అంటున్నారు… ఎస్, రేవ్ పార్టీలు, హైప్రొఫైల్ పార్టీలతోపాటు విశ్వనగరంలో డ్రగ్స్ బెడద బాగా పెరిగిపోయినట్టు వింటూనే ఉన్నాం… ఆ నెట్‌వర్క్‌ను కదా ఛేదించాల్సింది… డ్రగ్ సప్లయర్స్, పెడిలర్స్, స్టాకిస్టులను కదా పట్టుకోవాల్సింది…
ఐనా బేబీ సినిమాను సెన్సార్ చూశాకే కదా సర్టిఫికెట్ ఇచ్చింది… అంటే అది అంతిమం కాదా..? వాళ్లకు సినిమా పరిశీలన చేతకాదా..? పోలీసులు సూపర్ సెన్సారింగ్ చేయాలా..? లేకపోతే సినిమాల్లో మద్యపానం అనారోగ్యకరం, ధూమపానం కేన్సర్ కారకం, ఈ సినిమా కోసం జంతుహింసకు పాల్పడలేదు, అతివేగం అనర్థదాయకం వంటి హెచ్చరికల్ని స్క్రోల్ చేయాలా ఆ డ్రగ్స్ సీన్లు వచ్చినప్పుడు..?
సార్, మీకు ఓ పచ్చినిజం చెప్పాలా..? కొన్ని డ్రగ్స్‌కన్నా మద్యం అతి అనారోగ్యకరం… అలాగని మనం మద్యాన్ని నిషిద్ధ సరుకు చేయలేదు కదా, పైగా ఎంకరేజ్ చేస్తున్నాం కదా… అలాగని డ్రగ్స్ మంచివి అని చెప్పడం లేదు ఇక్కడ… అసలైన నేరస్తుల్ని (ప్రత్యేకించి ఆ నైజీరియా గ్యాంగులు… వీళ్లు సైబర్ నేరాల్లో కూడా దిట్టలట…) పట్టుకుని, ఆ బెడదను నిర్మూలించండి, అంతేతప్ప ఈ వ్యసనపరుల జోలికి పోతే ఫాయిదా ఏమిటి సార్..?!
Share this Article