బీజేపీ ‘మిషన్ 400 ప్లస్’ అనే శీర్షికతో ఓ న్యూస్ స్టోరీ కనిపించింది… తెలంగాణలో 10 ఎంపీ సీట్లపై బీజేపీ కాన్సంట్రేషన్ అని మరో వార్త… 400 సీట్లు… అదొక అబ్బురమైన సంఖ్య… నిజంగా ఆ సంఖ్యను సాధించగలదా..? పదేళ్ల క్రితం వరకు బీజేపీకి సొంత మెజారిటీ వస్తుందని అనుకోవడమే, నమ్మడమే ఓ గగనం…
ఈ సంకీర్ణ, ప్రాంతీయ పార్టీల శకంలో ఒక జాతీయ పార్టీ సొంత మెజారటీ సాధించడం అసాధ్యమని తలలుపండిన ఢిల్లీ పాత్రికేయ, రాజకీయ మేధావులు తేల్చిపడేశారు… వాళ్లెప్పుడూ ఫీల్డ్ రియాలిటీకి దూరంగా ఉంటారు కదా… ఏ ఉద్వేగ పరిస్థితులూ లేని రెండు టరమ్స్‌లోనూ ఎవరి మీదా ఆధారపడని సొంత మెజారిటీ సాధించింది బీజేపీ… ఒకప్పుడు జస్ట్, రెండు సీట్లు… అదీ 1984లో…
1984 అంటే గుర్తొచ్చింది… ఇందిర హత్య తాలూకు సానుభూతి పవనాలు ముంచెత్తి కాంగ్రెస్ ఏకంగా 404 సీట్లు గెలిచింది… (కొంత ఆలస్యంగా పోలింగ్ జరిగిన పంజాబ్, బీహార్‌లలో కూడా 10 సీట్లు పొంది, మొత్తం 414 సంఖ్యకు చేరుకుంది… ఆ ఫిగర్ ఏ పార్టీకైనా ఓ కల… అలాంటి పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని దురవస్థలో పడిపోయింది ఇప్పుడు… తెలుగుదేశం కొత్త మురిపెం, బెంగాల్‌లో సీపీఎం పట్టు, తమిళనాట అన్నాడీఎంకే ప్రాబల్యం తప్ప ఇక ఆ ఎన్నికల్లో ఏ ఇతర పార్టీ సాధించింది ఏమీ లేదు… టీడీపీ 30, సీపీఎం 22, ఎఐడీఎంకే 12 సీట్లు గెలిచాయి… ఇందిర హత్య బాపతు సానుభూతినీ తట్టుకున్నాయి…
Ads
మరి ఇప్పుడు..? ఏ ఉద్వేగమూ లేదు… పదేళ్ల తాలూకు ప్రభుత్వ వ్యతిరేకత కాస్తో కూస్తో ఉండనే ఉంటుంది… ఈరోజుకూ మోడీ వ్యక్తిగత చరిష్మా మీదే పార్టీ ఆధారపడుతోంది… మరి ఆ 400 ప్లస్ సీట్లు వస్తాయా..? సాధ్యమేనా..? గెలవదు అనుకున్న రెండు రాష్ట్రాల్లోనూ గెలిచి, మొత్తం మూడు రాష్ట్రాలనూ గెలుచుకున్న మొన్నటి ఎన్నికల ఊపుతో 400 ప్లస్ సాధ్యమే అని ఆశపడుతున్నయ్ బీజేపీ శ్రేణులు… ఆ ప్లస్ పాయింట్ల వెర్షన్ ఏమిటంటే..?
- మోడీ చరిష్మా గతంలోకన్నా ఎక్కువగా ఉంది… తన మీద జాతి పెట్టుకున్న నమ్మకాన్ని ఈ పదేళ్లలో నిలబెట్టుకున్నాడు…
- ఇండియా ప్రపంచంలోని మెరుగైన దేశాల సరసకు చేరింది…
- తలాక్ బిల్లు, ఆర్టికల్ 370, కొత్త నేరస్మృతి చట్టాలు, అయోధ్య వంటివి మోడీ విజయాల జాబితాలో పడ్డయ్…
- దేశంలో ప్రతిపక్షం బాగా వీక్‌గా ఉంది, మోడీకి దీటైన జాతీయ నేత లేరు…
చెప్పుకోవడానికి బాగానే ఉంది గానీ… చాలా మైనస్ పాయింట్లు కూడా ఉన్నయ్… ఒకప్పుడు ఎన్డీయే పార్టీలు బీజేపీని విడిచిపెట్టి పోయాయి… టీడీపీ, అకాలీదళ్, శివసేన ఎట్సెట్రా… ఈరోజుకూ కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఎదుగూబొదుగూ లేదు పెద్దగా… తెలంగాణ కాస్త బెటర్… కర్నాటకలో కాంగ్రెస్ కూడా బలంగానే ఉంది… (అంటే వింధ్యకు ఈవల ఉన్న 131 సీట్లలో ఎన్ని సీట్లు వస్తాయో పార్టీ పెద్దలకే అంతుపట్టదు…) ఇక తూర్పుతీరం మొత్తం బీజేపీకి సానుకూలంగా లేదు… అవి ఒడిశా, బెంగాల్… బీహార్, యూపీలలో మునుపటి బలం లేదు…
ఈ స్థితిలో నాడు రాజీవ్ అనుభవించిన 414 సీట్ల ఫిగర్ సాధించడం మోడీ వల్ల అయ్యే పనేనా..? అవుతుందీ అని ఊహించగలమా..? భారత్ జోడో యాత్ర తాలూకు జోష్ ఇప్పుడు లేదు, మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణను కాంగ్రెస్ గెలవడం అనేది తన ఘనత కాదు, అది కేసీయార్ ఘోర వైఫల్యం… పైగా రాష్ట్రాల ఎన్నికలు వేరు, జాతీయ ఎన్నికలు అనగానే దేశం, భద్రత వంటి చాలా అంశాలు పరిగణనలోకి వస్తాయి… అది తమకు ఉపయోగకరమని బీజేపీ భావన…
ఈ పదేళ్లలో సంఘ్ పరివార్ దేశంలోని చాలా ప్రాంతాలకు చాపకింద నీరులా విస్తరించింది… అది బీజేపికి మరో ప్లస్ పాయింట్… ఇతర పార్టీలు వల్లెవేసే సెక్యులరిజం సూత్రాలు హిందూయిజానికి చేటు అని కొత్త తరం విశ్వసిస్తోంది… ఫలితంగా హిందూ వోటు పోలరైజ్ అవుతోంది… ప్రత్యేకించి కాంగ్రెస్, కమ్యూనిస్టుల కుహనా సెక్యులరిజం ఆ పార్టీలకు మైనస్ అవుతోంది… ఇప్పటికే సీపీఐ కనుమరుగయ్యే స్టేజ్, సీపీఎం వేగంగా ఆ దిశలో పయనం… (ఈ దుష్ప్రభావం నుంచి తప్పించుకోవడానికి రాహుల్ జంధ్యం వేసుకుని గుళ్లు తిరుగుతాడు ఎన్నికల వేళ, ప్రియాంక గంగాస్నానాలు చేస్తుంది…)
కనీసం 200 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ నడుమ పోటాపోటీ సిట్యుయేషన్ ఉంటుంది… అవి బీజేపీకి అనుకూలమనేది బీజేపీ నమ్మకం ఇప్పుడు… ప్రతిపక్ష పార్టీలన్నీ కలిపి ఇండి కూటమిగా ఏర్పడ్డాయి సరే… కానీ ‘‘ఉమ్మడి అభ్యర్థులు’’ అనేది అనుకున్నంత సులభం కాదు… పైగా ప్రధాని కుర్చీ ఆశావహులు ఎక్కువ… ఢిల్లీ, పంజాబ్‌లలో ఆప్, కేరళలో సీపీఎం కాంగ్రెస్‌తో పొసగనివ్వవు… మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇతర పార్టీలు చెప్పినట్టు సీట్లు తీసుకోవాల్సిందే డిమాండ్ చేయలేదు, ఒడిశా, బెంగాల్‌లలో కాంగ్రెస్ మరీ వీక్…
ఈ కూటమికి ‘ఉమ్మడి సమావేశాల’ నిర్వహణే చేతకావడం లేదు… ఇక కలిసి ప్రచారం ఎలా సాధ్యం..? పైగా ఈ కుహనా సెక్యులర్ పార్టీలన్నీ కలిసి హిందూయిజానికి వ్యతిరేకంగా కదులుతున్నాయని బీజేపీ కౌంటర్ అటాక్ ఆల్‌రెడీ స్టార్ట్ చేసింది… నాన్-బీజేపీ పార్టీలన్నింటినీ కలుపుకోగలదా కాంగ్రెస్..? నో… నవీన్ పట్నాయక్, కేసీయార్, తెలుగుదేశం, జేడీఎస్, బీఎస్పీ, వైసీపీ ఎట్సెట్రా పార్టీలు కలవవు… సో, వోట్ల చీలిక తప్పదు…
ఒడిశాలో పాండ్యన్, తెలంగాణలో కేటీయార్, బీఎస్పీలో ఆకాశ్, టీఎంసీలో అభిషేక్, ఆర్జేడీలో తేజస్వి, అకాలీదళ్‌లో సుఖ్‌బీర్ ఎట్సెట్రా కొత్త జనరేషన్స్ నాయకత్వాలు స్టార్టయ్యాయి… దీని ప్రభావం చూడాల్సి ఉంది… బీజేపీ 400 ప్లస్ ఆపరేషన్‌కు మరో ప్రధాన అడ్డంకి బీజేపీ ఎప్పుడూ గెలవని 144 సీట్లు… గత మూడు టరమ్స్‌లో అవి గెలవలేదు… దానికి ఏం చేయాలనే వ్యూహం, కార్యాచరణ గానీ బీజేపీలో కనిపించడం లేదు… ఎంతసేపూ నార్త్, సెంట్రల్ ఇండియాపైనే కాన్సంట్రేషన్… కొంతకాలంగా బీఆర్ఎస్‌తో ప్రచ్ఛన్న స్నేహం వంటి తప్పుటడుగులు కూడా పడ్డయ్… షిండేలు, అజిత్ పవార్లు పార్టీకి వాపులే తప్ప బలుపు కారు… ఇన్ని కారణాలు, విశ్లేషణల నడుమ…. బీజేపీ మిషన్ 400 ప్లస్ అనుకున్నంత సులభమేమీ కాదని తేలుతోంది…!!
Share this Article