అపర చాణక్యం లేదు, ఏమీ లేదు… 2009 అసెంబ్లీ ఎన్నికలు గుర్తున్నాయి కదా… టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కలిసి మహాకూటమిగా పోటీచేశాయి… పొత్తులో కూటమి అంతర్గత విభేదాలు, కుట్రలు… ఇదే టీఆర్ఎస్ 45 సీట్లలో పోటీచేస్తే గెలిచింది 10… ఫలితాల తరువాత కేసీయార్ గాయబ్… జనం ఎదుటకు రావడానికి మొహం చెల్లలేదు… అసలు పార్టీ ఉంటుందా, వైఎస్ దెబ్బకు మొత్తం కనుమరుగు అయిపోతుందా అనే స్థితి…
ఎప్పుడైతే వైఎస్ హెలికాప్టర్ పావురాలగుట్ట వైపు పయనించిందో… అకాలమరణం పాలయ్యాడో… జగన్ ను నిలువరించడానికి కాంగ్రెస్ వేసిన ఓ ఎత్తుగడ కోసం కేసీయార్ మళ్లీ తెరపైకి వచ్చాడు… ఆమరణదీక్ష, ఆ ప్రహసనం, అర్థంతర విరమణ, గద్దర్-ఓయూ నిరసనలతో కొనసాగింపు డ్రామా అందరికీ తెలిసినవే… మరి ఇప్పుడు..?
ఎస్, అదే ఓటమి మొన్న… తనను జాతీయ స్థాయిలో ఎవరూ నమ్మరు… బీజేపీ అస్సలు దగ్గరకు రానివ్వదు ఇక, ఎందుకంటే బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే ఆ పాత లోపాయికారీ అవగాహనను కొనసాగించేదేమో, ఇప్పుడు తెలంగాణ కేసీయార్‌ను తిరస్కరించాక ఇక బీజేపీ కూడా తనను అలవోకగా వదిలేసింది… బీఆర్ఎస్ ఎంత ఖాళీ అయితే బీజేపీకి అంత మేలు, అందుకని ఇక క్రమేపీ తొక్కడానికి ప్రయత్నిస్తుంది… కాంగ్రెస్‌కు మళ్లీ జోష్… కేసీయార్‌ను మళ్లీ లేవకుండా ఒత్తితేనే కాంగ్రెస్‌కు మేలు… అందుకని అదీ కేసీయార్ కుటుంబాన్ని, పార్టీని వీలైనంత తొక్కడానికి ప్రయత్నిస్తుంది… మళ్లీ కేసీయార్ బలం పుంజుకుంటే అది తనకే నష్టం కాబట్టి…
Ads
సో, కేసీయార్ ఇప్పుడు ఒంటరి… పైగా పదేళ్ల పాపాలు వెంటాడతాయి… ఐతే బీఆర్ఎస్ మనుగడ ఉండదా..? ఈ ప్రశ్నకు సమాధానం కష్టం… పదేళ్లు సంపాదించిన బోలెడంత డబ్బుంది, ఎవరో ఒకరు పార్టీ జెండా మోసేవాడు దొరుకుతాడు… పార్టీ ఉంటుంది, నిజంగా ఏదైనా మంచి అవకాశం దొరికితే ఫీనిక్స్ పక్షిలా పైకి ఎగిరే సంస్థాగత బలమూ ఉంది… అలాంటి చాన్స్ ఇవ్వకపోవడం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైనే ఉంది… కవిత అరెస్టుతో, రేవంత్ పెడుతున్న కేసులతో ఆ ప్రక్రియ వేర్వేరుగా స్టార్టయినట్టే భావించాలి… కేసీయార్, కేటీయార్, హరీష్‌లకు కూడా కేసుల ఉచ్చు బిగించే ప్రమాదం ఉంది… ఎందుకంటే, రేవంత్ ఓ భిన్నమైన నాయకుడు కాబట్టి…!! బీఆర్ఎస్ నుంచి జంపినవాళ్లకూ టికెట్లు, ప్రయారిటీ ఇవ్వడం వెనుక కూడా రాజకీయ మార్మిక ఎత్తుగడలున్నయ్… అది వాళ్ల మీద ప్రేమ కాదు…
ఐతే… తను పార్టీని సుస్థిరం చేసుకోవడానికి, అధికారానికి ఢోకా లేకుండా చేసుకోవడానికి కేసీయార్ ఇతర పార్టీల నుంచి బోలెడు మంది నాయకులను గతంలో లాగేసుకున్నాడు… తెలంగాణ సమాజం విభ్రమతో చూస్తుండగానే..! ఇప్పుడు కేసీయార్‌ను తన మానాన తనను వదిలేసి వెళ్లినవాళ్లు తెలంగాణ మీద ప్రేమతో వచ్చినవాళ్లేమీ కాదు… జస్ట్, గాలి ఎటు వీస్తే అటు కొట్టుకుపోయేరకం… ఇదే కేసీయార్ మళ్లీ పచ్చగా కనిపిస్తే ఈ జంపర్స్ అన్నీ మళ్లీ వచ్చి చేరేవే…
పార్టీని కష్టకాలంలో వదిలేసి వెళ్లిపోతున్నారు, మళ్లీ కాళ్లు పట్టుకున్నా రానివ్వం, తెలంగాణ ద్రోహులు, చెత్త మాత్రమే పోతోంది, కొత్త నాయకత్వాన్ని నిర్మించుకుంటాం వంటి తొందరపాటు వ్యాఖ్యలు బీఆర్ఎస్‌కు నష్టమే తప్ప ఫాయిదా ఏమీ లేదు… పోతుంది చెత్త అయితే, ఇన్నాళ్లూ ఆ చెత్తను జనం నెత్తికి రుద్దింది ఎవరు..? మిగిలినవాళ్లలో వేరే పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్లు లేరా..? వీడిపోతే చెత్త, కలిసి ఉంటే పవిత్రులా..? ఇన్నాళ్లూ మరి ఆ తెలంగాణ ద్రోహుల్ని నెత్తిన పెట్టుకున్నది ఎవరు..? దేని కోసం..? అసలు బీఆర్ఎస్‌ను వీడితే తెలంగాణ ద్రోహం ఎలా అవుతుంది..?
కడియం కావ్య ఎంపీ టికెట్టును కూడా ఎడమకాలితో తన్నేసి వెళ్లిపోవడం బీఆర్ఎస్‌కు నిజంగా షాక్… ఇప్పుడు ప్రకటించబడిన అభ్యర్థుల్లో కూడా ఒకరిద్దరు విరమించుకుంటారనే వార్తలు వస్తున్నాయి… బీఆర్ఎస్ఎల్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునే దిశలో (సేమ్, గతంలో కేసీయార్ చేసినట్టే…) కాంగ్రెస్ ప్రణాళికలు వేస్తుందని సమాచారం… అవును, త్వరపడకపోతే బీజేపీ తన్నుకుపోతుంది మరి… ఎంత మంది వెళ్లిపోయినా సరే, బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఉంటుంది, అది గ్యారంటీ… నామావశిష్టంగానైనా సరే..!!
Share this Article