ముందుగా ఒక వార్త చదవండి… ‘‘తెలంగాణ భాష, కల్చర్, బాధ, సంబురం అన్నీ కలగలిపిన కథ నాని నటించిన దసరా సినిమా… దీనికి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… ప్రజెంట్ ట్రెండ్ రస్టిక్ లుక్ కాబట్టి, పుష్ప సూపర్ హిట్ అయ్యింది కాబట్టి ఈ సినిమాలో కూడా నానికి అలాంటి వేషం, కేరక్టరే పెట్టాడు దర్శకుడు… ధూంధాం సక్సెస్ లేకుండా చాన్నాళ్లుగా వెనకబడిపోతున్న నానికి ఇది కీలకమైన మూవీ… అందుకే ఊరలుక్ మాస్ పాత్ర వేస్తున్నాడు…
హీరోయిన్ కీర్తి సురేష్‌ను కూడా రొటీన్ దట్టమైన మేకపుతో గ్లామరస్ తారగా బదులు డీగ్లామర్ పాత్రలో చూపిస్తున్నారు… అన్నింటికీ మించి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి… చంకీల అంగీలేసి ఓ వదినే అనే పాట కూడా విపరీతంగా పాపులరైంది… రీల్స్, షార్ట్స్ బోలెడు కనిపిస్తున్నాయి ఈ పాటతో… మార్చి 30న విడుదల కాబోతోంది… పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు… మరి నానికి కూడా రాంచరణ్, జూనియర్, బన్నీ, ప్రభాస్ తరహాలో పాన్ ఇండియా స్టార్ కావాలని ఉంటుంది కదా…
Ads
అయితే సెన్సార్ మాత్రం భారీ సంఖ్యలో కట్స్ విధించి (దాదాపు 36) మరీ యూఏ సర్టిఫికెట్ ఇచ్చింది… కొన్ని తెలంగాణ పదాల్ని, సామెతల్ని కూడా కట్ చేసిపారేసింది… కథే సింగరేణి సమీపంలోని వీర్లపల్లి గ్రామ నేపథ్యం… అలాంటప్పుడు తెలంగాణ పలుకుబడులు గట్రా ఉండవా మరి..? అసలు సెన్సార్ బోర్డులో తెలంగాణ వాళ్లు ఉన్నారా..? తెలంగాణలో వ్యవహారికంలో చాలా సహజంగా వాడే “బద్దలు బాషింగాలు అవుతయ్, బాడ్కవ్, పిర్రలు చూసి పీటలేస్తరు” లాంటి పదాలను బూతులుగా సెన్సార్ బోర్డ్ భావించడం విచిత్రంగా ఉంది…
అంతకు ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో బాడ్కవ్ అనే పదానికి రాని అభ్యంతరం ఇప్పుడు ఈ దసరా సినిమాకు ఎందుకు వస్తోంది… అసలు తెలంగాణ మాండలికం, తెలంగాణ వ్యవహారిక పదబంధాల గురించి కనీస అవగాహన లేని వ్యక్తులే సెన్సార్ బోర్డ్ సభ్యులుగా ఉండి ఇలాంటి అర్థం పర్థం లేని కట్స్ ను సూచిస్తున్నారు…
దసరా సినిమా ట్రైలర్, పాటల విడుదలప్పుడే కొంత మంది తెలంగాణ భాషను అవహేళన చేస్తూ మాట్లాడారు… ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి మాటకు, పాటకు, ఆటకు తెలుగు సినిమాలో దక్కుతున్న ప్రాధాన్యతను జీర్ణించుకోలేక కొంత మంది కావాలనే దసరా సినిమాపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు… ఇన్ని కట్స్, మ్యూట్స్ తరువాత దసరా సంభాషణల్లో ఒరిజినల్ ఫ్లో దెబ్బతింటుంది…’’
….. ఇదీ వార్త… నిజమే, తెలంగాణ మాటకు, పాటకు ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్దపీట వేస్తోంది… అయితే ఈ ట్రెండ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు వల్ల సిద్ధించిన ప్రయోజనంగా చూడాల్సిన అవసరం లేదు… జనం చూస్తున్నారు, మెచ్చుతున్నారు కాబట్టి ఇండస్ట్రీ పెద్దపీట వేస్తోంది… అంతేతప్ప తెలంగాణ భాష మీదో, కల్చర్ మీదో ప్రేమ కాదు… పిచ్చి పిచ్చి టీవీ సీరియళ్లలో కూడా తెలంగాణతనం లేని చాలామంది ఇష్టారాజ్యంగా తెలంగాణ పదాల్ని ఖూనీ చేసేస్తున్నారు… ఏదో ఒకటి తెలంగాణ పేరిట చెలామణీ చేసుకునే కక్కుర్తి… సినిమాలు, సీరియళ్లలో డైలాగులు కృతకంగా ఉండి ఒరిజినల్ తెలంగాణ భాషకు ద్రోహం జరుగుతోంది…
దసరా సినిమాకు సంబంధించి పాటలైనా మాటలైనా అత్యంత సహజంగా తెలంగాణ సమాజ వ్యవహారాల్లో వినిపించేవే, ఉన్నవే… బాడ్కవ్ అనే పదం మరీ నిషేధించదగినంత బూతేమీ కాదు… అలాగే పిర్రలు చూసి పీటలేసుడు అనేది కూడా చాలా సాధారణంగా పలకబడేదే… ఇలాంటివి ఏ సందర్భంలో, ఏ ఉద్దేశంలో వాడారనేది ప్రధానం… నిజంగానే సెన్సార్ బోర్డులో అంత విచక్షణో, తెలివిడో ఉన్నవాళ్లు ఎవరూ కనిపించడం లేదు…
ఉదాహరణకు ఒరెక్క అనే పదం… ఆశ్చర్యాన్ని వ్యక్తీకరిస్తూ చాలామంది మాట్లాడతారు… నిజానికి దాని ఒరిజినల్ రూపం వోర్నీయక్క అయి ఉంటుంది… అది అభ్యంతరకరమే… కానీ ఫ్లోలో దాన్ని ఒరెక్కగా ఉచ్చరిస్తుంటారు… పిల్లలు, మహిళలు కూడా వాడుతుంటారు… ఇక్కడ పిర్రలు చూసి అనే పదాలకు కూడా ఆక్షేపణలు అక్కర్లేదు… స్థోమతను చూసి ప్రాధాన్యమిస్తుంటారు లోకంలో… ఇదీ దాని అర్థం… బద్ధలు బాషింగాలు అవుతయ్… అంటే నీకు వీర లెవల్లో దెబ్బలు తప్పవు అని హెచ్చరించడం… బద్ధలు పలుగుతయ్ అనేదీ అలాంటి వ్యవహారికమే… ఐనా, ఓటీటీల్లో రానానాయుడి వంటి సినిమాలు పచ్చి బూతును, అశ్లీలాన్ని పారిస్తున్నయ్… గీ తెలంగాణ మాటలే గలీజ్ కనిపిస్తన్నయా…
ఇప్పుడు ఇదంతా ఎందుకు రాసుకోవడం అంటే… కొన్ని సైట్లు సెన్సార్ బోర్డు తెలివి లేని కట్స్ గురించి వార్తలు రాశాయి… మాట్లాడితే తెలంగాణ పేరు చెబుతూ ఊరేగే ఒక్కరూ దానిపై స్పందించలేదు… తెలంగాణ సమాజం నుంచి కనీస నిరసన కూడా వ్యక్తం కాలేదు… అస్సలు మాట్లాడిన వారే లేరు… అంటే ఇండస్ట్రీ తెలంగాణ పేరిట ఏం చూపించినా, ఏం వినిపించినా మౌనంగా ఆమోదముద్ర వేస్తున్నట్టే భావించాలా..? గతంలో తెలంగాణతనాన్ని నెత్తినమోసిన చాలామంది మేధావులు, కవులు, రచయితలు పలు ప్రభుత్వ పోస్టుల్లో చేరి, పిర్రలు బలిసిపోయి, కళ్లు-నోళ్లు మూసుకుంటున్నారనేది నిజమే కదా…!!
Share this Article