పూర్వకాలంలో కొందరు రుషులు హోమగుండంలో కొన్ని ప్రత్యేక మూలికలు వేసేవాళ్లట… అవి మండి, మేఘాల్లోకి ఆ పొగ చేరి, అవి వర్షించేవట… కాస్త వ్యయప్రయాసలతో కూడిన అతిరాత్ర యాగాలూ అందుకేనట కదా… ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే… క్లౌడ్ సీడింగ్, అనగా మేఘమథనం అనే ప్రక్రియ అంత పాతది అని చెప్పడానికి…!
కానీ నిన్నటి ఓ వార్త ఆశ్చర్యపరిచింది… ఆ వార్త ఏమిటంటే..? ఐఐటీ కాన్పూర్ మేఘమథనంలో గ్రేట్ సక్సెస్ సాధించిందట… క్లౌడ్ సీడింగ్ ద్వారా వర్షాల్ని కురిపించిందట… ఇక ఈ సక్సెస్‌తో ఉత్తరప్రదేశంలోని కరువు ప్రాంతాల్లో వర్షాలు కురిపిస్తారట… సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ… ‘‘2017 నుంచీ ఈ ప్రాజెక్టు మీద ఐఐటీ కాన్పూర్ పనిచేస్తోంది… కానీ అవసరమైన అనుమతులు రాకపోవడంతో లేటైంది… అన్ని ఏర్పాట్లు చేసుకునీ, ప్రయోగాలు వాయిదా పడేవి… ఎట్టకేలకు ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ గగనంలోకి వెళ్లి 5 వేల అడుగుల ఎత్తులో అవసరమైన రసాయనాలు చల్లింది, తరువాత వర్షం కురిసింది’’ అని వివరించాడు…
అసలు మేఘమథనానికి అనుమతులు ఇవ్వకపోవడం ఏమిటి..? దీనికి ఆర్మీ ఎయిర్ క్రాఫ్టులు ఎందుకు..? ఇదేదో కొత్త ప్రయోగంగా, ఘనతగా, సక్సెస్‌గా చెప్పుకోవడం ఏమిటి..? అనేక దేశాలు కమర్షియల్‌గా కూడా ఈ మేఘమథనాన్ని చేపట్టాయి… రష్యా, చైనా వంటి దేశాలైతే వర్షాలు కురియడానికే కాదు, అప్పుడప్పుడూ మేఘాల్ని వర్షించకుండా చేయడానికి కూడా రసాయనాల్ని మేఘాల్లో చల్లేవి… (ముఖ్యమైన ఈవెంట్స్ వర్షాల వల్ల డిస్టర్బ్ కాకుండా ఉండటానికి…) కరోనా జన్మస్థలి అయితే ఇండియా మీద యుద్ధానికీ వెదర్ మాడిఫికేషన్ యుద్ధతంత్రాన్ని రచిస్తోంది…
Ads
సౌదీ వంటి దేశాలు వందల కోట్లు వెచ్చించాయి… అంతెందుకు..? ఉమ్మడి ఏపీలో రఘువీరారెడ్డి వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు మేఘమథనం చేపట్టారు… అనేక కోట్లు వెచ్చించారు… అదీ ఓ కుంభకోణమే అని టీడీపీ ఆరోపించేది… ఇంకాస్త లోపలకు వెళ్తే… 1983, 1984-87, 1993-94 సంవత్సరాల్లో తమిళనాడు ప్రభుత్వం, 2003-04లో కర్నాటక ప్రభుత్వం కూడా నిర్వహించింది… అమెరికాకు చెందిన వెదర్ మాడిఫికేషన్ సంస్థ అదే సంవత్సరం మహారాష్ట్రంలో కూడా మేఘమథనం చేపట్టింది…
మన దేశంలో పెద్దగా రిజల్ట్స్ రాలేదు… ఇజ్రాయిల్ అయితే గ్రౌండ్ స్టేషన్ల నుంచే రసాయనాల్ని మండించి మేఘాల్ని కురిపించేది… అనేక దేశాల్లో విమానాల్లో సిల్వర్ అయెడైడ్‌ను, పొటాషియం అయొడైడ్, సాల్ట్ తదితరాలను మేఘాల్లో జల్లేవాళ్లు… వివిధ దేశాల్లో ఈ ప్రయోగాలు, మేఘమథనంలో రకాల గురించి బోలెడు కంటెంట్ నెట్‌లో కూడా ఉంది… పెద్దగా నమ్మదగిన ప్రాజెక్టులేమీ కావు… కాకపోతే వర్షాల కోసం మనిషి ఆశతో చేసే ప్రయత్నాలు ఇవి…
అలాంటిది ఐఐటీ కాన్పూర్ ఇందులో కొత్తగా ఏం సాధించినట్టు ఈ ఘన ప్రకటనలు ఏమిటో అర్థం కాదు… పోనీ, మేఘమథనాన్ని తప్పనిసరి రిజల్ట్ కురిపించే కొత్త రసాయనాల్ని, కొత్త విధానాల్ని ఏమైనా కనిపెట్టారా..? అదే నిజమైతే డీజీసీఏ ప్రకటనలు దేనికి..? నేరుగా ఐఐటీ కాన్పూర్ పెద్దలే డిటెయిల్డ్ ప్రకటన జారీ చేయొచ్చు కదా…!!
Share this Article