543 నియోజకవర్గాలు… 30 వేల మంది… అంటే, ఒక్కో నియోజకవర్గానికి 55 మంది… ఉజ్జాయింపుగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి తొమ్మిదీపది మంది… అందులోనూ ప్రధానంగా నగరవాసులు… ఫోన్లకు, ఆన్‌లైన్‌కు అనువుగా ఉన్నవాళ్లు…… ఒక్కో అసెంబ్లీ సీటుకు పది మంది వ్యక్తం చేసే అభిప్రాయాలు, మొత్తం 90 కోట్ల మంది వోటర్ల మనోభావాలకు అద్దం పడతాయా..? ఈరోజు, నిన్న మెయిన్ స్ట్రీమ్ సైట్లు, పత్రికలు ప్రచారంలోకి తీసుకొచ్చిన IANS-Cvoter గవర్నెన్స్ సర్వే చూడగానే తలెత్తిన ప్రధానమైన ప్రశ్న ఇది..! జనం పల్స్ ఏమిటో ఈ శాంపిల్ సైజ్ వ్యక్తపరుస్తుందా..? పైగా ఓ మోస్తరు యాక్యురసీ కావాలంటే వివిధ వృత్తులు, నివాస నేపథ్యాలు, లింగ-కుల-మత-ప్రాంత పరిస్థితులు గట్రా బోలెడు పరిగణనలోకి రావాలి… అలాంటివి ఏవీలేని సర్వేలకు ఉన్న ప్రాధాన్యం ఎంత..? ప్రామాణికత ఎంత..? నిజానికి ఆ మాత్రం సర్వే అయినా జరిగిందా..? ఇది మరో ప్రశ్న… ఎందుకంటే..? జాతీయ స్థాయిలో ఎవరో సర్వే పేరిట ఓ డేటా క్రోడీకరిస్తారు, దాన్ని ఇతరులూ వాడేసుకుంటారు, ప్రచారంలోకి పెట్టేస్తారు… ప్రశాంత్ కిషోర్ అనబడే ఓ రాజకీయ విధ్వంసకారుడు రంగంలోకి వచ్చాక మరీ ఈ సర్వేలకు అర్థమే లేకుండా పోయింది… అడ్డదిడ్డం సర్వేలు, అబద్దపు సర్వేలు, అశాస్త్రీయ సర్వేలు, అవసరార్థం సర్వేలు అని బోలెడు రకాలు…
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పనితీరును, పాలనవిధానాల్ని, ప్రజలపై వాటి ప్రభావాల్ని ఆ రాష్ట్ర ప్రజలు సరిగ్గా చెప్పగలరు గానీ… ఇతర రాష్ట్రాల వోటర్లు ఎలా చెప్పగలరు..? వాళ్ల అభిప్రాయాలకు బేస్ ఏమిటి..? ఉదాహరణకు… చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి పథకాలేమిటో, నిర్ణయాలేమిటో ఓ నాగాలాండ్ వోటరుకు ఏం తెలుసు..? మేఘాలయ సీఎం ఎంతటి పనిమంతుడో కేరళ వోటరుకు ఏం తెలుసు..? నీతిఆయోగ్ వంటి సంస్థలు ఇచ్చే ర్యాంకింగులకు కనీసం ఏవేవో పిచ్చి సర్కారీ గణాంకాలు ఆధారంగా ఉంటయ్… మరి సీవోటర్ సర్వేకు ఆ ప్రామాణికత కూడా లేదు కదా..! అబ్బే, ఒక్క మెతుకు చాలదా అన్నం ఉడికిందో, పాచిపోయిందో, ఉడకలేదో తెలియడానికి… ఇదీ అంతే, 30 వేల మంది అభిప్రాయాలు రఫ్‌గానైనా ఓ చిత్రాన్ని కళ్లముందు ఉంచుతాయి అనుకుందాం… కానీ ఈ సర్వేల్లో అనేక పరస్పర విరుద్ధాంశాలు బోలెడు ఉంటయ్… ఉదాహరణకు మనం గతంలో చెప్పుకున్న ఇండియాటుడే సర్వే తీరు… (ఇదీ ఆ లింక్… తెలుగు సీఎంల ప్లేస్ ఎక్కడ..? మోడీ గ్రాఫ్ పాతాళానికి..! యోగీకి పాపులారిటీ..!)
Ads
ఎమ్మెల్యేలపై జనాభిప్రాయం వేరు- స్థూలంగా ముఖ్యమంత్రి పనితీరుపై అంచనా వేరు- సీఎం మారాల్సిందే అనే ఆగ్రహం వేరు- ప్రభుత్వంపై అసంతృప్తి స్థాయి వేరు….. అవన్నీ కలగలిపి ఓ నిర్దుష్ట అంచనాకు రావడం తప్పు… పైగా ఎన్నికలను బట్టి ఫలితాలు వేర్వేరు ఉంటయ్ కూడా..! ఎలాగంటే..? మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై బాగా వ్యతిరేకత ఉండేది జనంలో… కానీ చివరకు ఏమైంది..? వాళ్లకే టికెట్లు ఇచ్చి మరీ కేసీయార్ గెలిపించుకున్నాడు… దానికి ఉపకరించిన కారణాలు బోలెడు ఉండవచ్చుగాక..! అదే పార్లమెంటు సీట్లకొచ్చేసరికి కేసీయార్‌ను ఏడు స్థానాల్లో వోటర్లు నేల మీదకు దింపేశారు… చావు తప్పి కన్నులొట్టబోయింది… స్థానిక ఎన్నికలు ఇంకోరకం… సో, ఈ సర్వే ఇప్పటికిప్పుడు వ్యక్తులు, నాయకులు, పార్టీల అసలు బలాన్ని అంచనా వేస్తుందని ఓ నిర్ధారణకు రావడం తప్పు…
ప్రస్తుతం సీవోటర్ సర్వే ఏమంటోంది..? తెలంగాణ సీఎం పాలన తీరు అథమస్థానంలో బోరుమంటోంది… ఏపీలో ఎమ్మెల్యేల మీద దేశంలో ఎక్కడా లేనంత ఆగ్రహం కనిపిస్తోంది… కావచ్చు, నిజమే కావచ్చు, క్షేత్రంలో ఆ పరిస్థితే ఉండవచ్చు, కేసీయార్ పాలన తీరు మీద గానీ వైసీపీ ఎమ్మెల్యేల మీద గానీ జనం గుర్రుమంటూ ఉండవచ్చు… మనం ఇక్కడ చెప్పుకునేది సర్వేల ప్రామాణికత- శాస్త్రీయత గురించి మాత్రమే… మొన్నటి ఇండియాటుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా కేసీయార్ ఘోరమైన స్థానంలో నిలబడ్డాడు… ఇప్పుడు ఈ గవర్నెన్స్ సర్వేలోనూ అంతే… ఇదే తరహా గవర్నెన్స్ సర్వే జనవరిలో జరిగినప్పుడు జగన్ దేశంలోకెల్లా మూడో స్థానంలో ఉన్నాడు, అంటే ఈ ఏడెనిమిది నెలల్లోనే ఏపీలో పాలన భ్రష్టుపట్టిపోయిందా..? జనం కళ్లు తెరుచుకుని, రియలైజ్ అయిపోయారా..?
ఉత్తమ పాలకుల్లో, అంటే, జనంలో పెద్ద వ్యతిరేకత లేని పాలకుల్లో చత్తీస్‌గఢ్ సీఎం ఫస్ట్ అట, అంతకుముందు సర్వేల్లో ఈ ప్లేసులో నవీన్ పట్నాయక్ ఉండేవాడు… ఉత్తరాఖండ్ సీఎం మీద వ్యతిరేకత లేదు అంటే… తను బాగా పనిచేస్తున్నాడనే నిర్ధారణ కాదు..! తను కొత్తగా వచ్చాడు, జనంలో అప్పుడే ఓ అంచనా రాదు, అందుకే అసంతృప్తి కనిపించదు, అంతేతప్ప ఆయన తోపు అని కాదు..! నిజంగా జనం ఏమనుకుంటున్నారో తెలియాలంటే శాస్త్రీయమైన ఓ మోస్తరు శాంపిల్‌తో సర్వే జరగాలి… ఏపీలో గానీ, తెలంగాణలో గానీ…! అదే సరైన జనం పల్స్…! అవేమీ జరగడం లేదు కాబట్టి ఇదుగో, ఇలాంటి సర్వేలను తమ తమ రాజకీయ అవసరాల మేరకు మీడియా గానీ, పార్టీలు గానీ జనంలో ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడతాయి… సోషల్ మీడియా సరేసరి… (ఈ సర్వే ఉత్త దిక్కుమాలినది అని చెప్పడం అంటే, కేసీయార్ మీద జనంలో వ్యతిరేకత లేదని కాదు అర్థం… సూపర్, బంపర్ పాలన అనే సమర్థన కూడా కాదు… ఎమ్మెల్యేల మీద జనంలో ఆగ్రహం లేదని కాదు…)
Share this Article